భారత్ తూర్పుతీరంలో చైనా కుంపట్లు.. ఇండియన్ నేవీకి పెను సవాళ్లు..!
బంగాళాఖాతంలో భారత్ నౌకాదళానికి సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న డ్రాగన్.. పాకిస్తాన్ తో కలిసి భారత్ ను చిక్కుల్లో పడేస్తోంది. పాకిస్థాన్ నౌకాదళంలోకి కొత్తగా చేరిన అత్యాధునిక సబ్‌మెరైన్ ‘పీఎన్ఎస్ హ్యాంగోర్’ ఈ ప్రాంతంలో సంచరించడం, అదే సమయంలో బంగ్లాదేశ్‌లో చైనా నిర్మించిన ‘బీఎన్ఎస్ పెకువా’ నౌకా స్థావరం సిద్ధమవడం భారత్‌కు భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు పరిణామాలు కలిసి భారత తూర్పు తీరంలో వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతున్నాయి.
చైనా సహకారంతో నిర్మించిన పీఎన్ఎస్ హ్యాంగోర్, పాకిస్థాన్‌కు అప్పగించిన 8 జలాంతర్గాములలో మొదటిది. ఇందులో ఉన్న ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థ వల్ల, బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉపరితలానికి రాకుండానే మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగలదు. ఇటీవల కరాచీలో నౌకాదళంలో చేరిన ఈ సబ్‌మెరైన్, శ్రీలంకలోని కొలంబోను సందర్శించి బంగాళాఖాతంలోకి తిరిగి వచ్చింది.
మరోవైపు, బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ సమీపంలో చైనా నిర్మించిన బీఎన్ఎస్ పెకువా నౌకా స్థావరం కూడా ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ స్థావరంలో 8 యుద్ధ నౌకలు, 6 జలాంతర్గాములను నిలిపే సామర్థ్యం ఉంది. బంగ్లాదేశ్ వద్ద కేవలం రెండు సబ్మెరైన్లే ఉన్న నేపథ్యంలో, ఈ స్థావరాన్ని చైనా, దాని మిత్ర దేశాల నౌకలు ఉపయోగించుకుంటాయని స్పష్టమవుతోంది.
ఈ బేస్ చైనా, పాక్ సబ్మెరైన్లకు లాజిస్టిక్స్ హబ్‌గా మారే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థావరం వ్యూహాత్మకంగా అండమాన్ నికోబార్ దీవులకు సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో, భారత తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం నుంచి కూడా దాదాపు అంతే దూరంలో ఉండటం గమనార్హం. బంగాళాఖాతంలో చైనా నౌకల కదలికలను ఎదుర్కోవడానికి భారత్ వద్ద శక్తిమంతమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ, పొరుగు దేశాల స్థావరాలను ఉపయోగించుకుంటూ పాక్, చైనా జలాంతర్గాములు ఇంత సమీపంలో సంచరించడం తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.








