అమెరికా-ఇరాన్ మధ్య చర్చలపై గందరగోళం..!
ఇవాళ ఖతార్ రాజధాని దోహాలో చర్చలుంటాయన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ భేటీలో తమ దేశ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొంటారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ చర్చల్లో ప్రధానంగా హర్మూజ్ జలసంధి , శాంతి ప్రక్రియకు చేపడుతున్న చర్యలపైనా చర్చిస్తారని అమెరికా ప్రతినిధులు చెబుతున్నారు. తాత్కాలిక ఒప్పందం నిబంధనలపై వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య చర్చలు పునఃప్రారంభమవుతాయని పాకిస్థాన్ కూడా తెలిపింది. అయితే ట్రంప్ ప్రకటనను.. ఇరాన్ ప్రతినిధులు తోసిపుచ్చారు.
ట్రంప్ చర్చల ప్రకటనను ఇరాన్ సీనియర్ ప్రతినిధి కజెమ్ ఘరీబాబాదీ ఖండించారు. దోహాలో భేటీ ఇంకా ఖరారు కాలేదని, అవతలి పక్షంతో సాధారణ సంప్రదింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
హర్మూజ్‌పై ఇరాన్ పట్టు సడలుతున్నట్లు కనిపిస్తున్న వేళ.. ఆ దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. జప్తు చేసిన తమ ఆస్తుల్లో 600 కోట్ల డాలర్లను ఖతార్ విడుదల చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ‘ఇప్పటివరకూ రూపొందించిన ప్రణాళికల ప్రకారం.. ఖతార్‌లో జప్తు చేసిన 1,200 కోట్ల డాలర్ల ఇరాన్ ఆస్తుల్లో సగం సొమ్మును ఆ దేశం విడుదల చేస్తుంది’’ అని పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలకు దక్కిన గొప్ప విజయంగా పెజెష్కియాన్ అభివర్ణించారు.
చర్చలపై ఇరుదేశాలు విభిన్నమైన ప్రకటనలు చేస్తుండడంతో అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ..ప్రస్తుతం ఇరుపక్షాలు పరస్పరం దాడులకు దిగకపోవడం కాస్త ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు పరిశీలకులు.








