అమెరికా టెక్ దిగ్గజాలపై పన్నులొద్దు..యూరప్! దేశాలకు ట్రంప్ వార్నింగ్.. !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యూరోపియన్ యూనియన్ దేశాలపై ఫైరయ్యారు. అమెరికా టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ సేవల పన్ను (డీఎస్టీ) విధించాలన్న యూరోపియన్ యూనియన్ దేశాల తీరుపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై 100 శాతం ప్రతికార సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా-యూరప్ దేశాల మధ్య సరికొత్త వాణిజ్య యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలపై డిజిటల్ సేవల పన్ను విధించే లేదా అమలు చేయడానికి సిద్ధపడే ఏ దేశమైనా సరే, తక్షణమే అమెరికా నుంచి తీవ్రమైన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. “ఈ 100 శాతం టారిఫ్ సదరు దేశాలతో కుదుర్చుకున్న పాత, కొత్త వాణిజ్య ఒప్పందాలన్నింటినీ అధిగమించి వర్తిస్తుంది” అని ఆయన రాసుకొచ్చారు. అమెరికా కంపెనీల ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏ దేశం అడుగులు వేసినా ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈ వివాదం ప్రధానంగా ఆపిల్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాల చుట్టూ తిరుగుతోంది. అనేక యూరోపియన్ దేశాలు ఈ కంపెనీలు తమ స్థానిక మార్కెట్ల నుంచి ఆర్జిస్తున్న ఆదాయంపై డిజిటల్ సేవల పన్నులను విధిస్తున్నాయి లేదా పెంచాలని యోచిస్తున్నాయి. అయితే, ఈ పన్నులు ఉద్దేశపూర్వకంగానే అమెరికా కంపెనీలను వివక్షకు గురిచేసేలా ఉన్నాయని వాషింగ్టన్ సుదీర్ఘకాలంగా వాదిస్తోంది.
ముఖ్యంగా ఫ్రాన్స్ .. 2019 నుంచి 3 శాతం డిజిటల్ సేవల పన్నును అమలు చేస్తోంది, ఇప్పుడు దీనిని 6 శాతానికి పెంచే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గతంలో మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిళ్లకు లొంగి తాము ఈ పన్నును వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పారు. బ్రిటన్, స్పెయిన్, ఆస్ట్రియా వంటి దేశాలు కూడా ఇటువంటి పన్ను విధానాలను కలిగి ఉండటంతో ట్రంప్ తాజా ప్రకటన ఈ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా ఒకవేళ నిజంగానే 100 శాతం టారిఫ్‌లను విధిస్తే, అది అంతర్జాతీయ సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. యూరప్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వైన్, చీజ్, కార్లు, యంత్రాల వంటి ప్రసిద్ధ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, ఇరువైపులా ఉన్న వినియోగదారులు, వ్యాపారాలపై మోయలేని భారం పడుతుంది.








