రేవంత్ ప్రతిపాదనకు ఫడ్నవీస్ సానుకూలం!
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాణహిత నదిపై ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ముంబై వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది. ఇందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేయడం, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తును తగ్గించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందనే వాదన అప్పట్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను గాలికొదిలేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 152 మీటర్లకు పెంచడం ద్వారానే దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలమని కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
ఇవి కూడా చదవండి
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగినట్లు ఇరు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. మహారాష్ట్ర భూములకు ముంపు ముప్పు లేకుండా చూడాలనే షరతుతో ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినప్పటికీ.. తుది అనుమతులు సాధించడం అంత సులభం కాదు. ముంపు ప్రాంతాలు, పరిహారం, నీటి లభ్యత వంటి సున్నితమైన అంశాలపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే, అది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద విజయంగా మారుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని గిరిజన నియోజకవర్గాల్లో పట్టు బిగించడానికి ఈ ప్రాజెక్టు అధికార పార్టీకి బ్రహ్మాస్త్రం కాగలదు. అయితే కేంద్ర జల సంఘం సాంకేతిక నిబంధనలు, అంతరాష్ట్ర జల వివాదాల చట్రంలో ఈ ఫైల్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు అసలు పరీక్ష. చర్చలు సఫలమై, భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం అయితేనే ఆదిలాబాద్ రైతుల కన్నీళ్లు తుడిచినట్లవుతుంది. లేదంటే ఇది మరో రాజకీయ హామీగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.








