కూటమి సునామీ.. 15 మున్సిపాలిటీలు, 726 వార్డుల్లో కూటమి క్లీన్ స్వీప్..!
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు ఊహించని రీతిలో చారిత్రాత్మక ప్రభంజనాన్ని సృష్టించాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికే రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఏకగ్రీవంగా కూటమి సొంతమయ్యాయి. ఇందులో సింహభాగం తెలుగుదేశం పార్టీ (TDP) కైవసం చేసుకోగా, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు కూడా తమ ఉనికిని గట్టిగా చాటుకున్నాయి. మొత్తంగా లెక్కిస్తే 15 మున్సిపాలిటీలు నేరుగా టీడీపీ ఖాతాలోకి వెళ్లగా, జనసేన పార్టీ ఒకటి, భారతీయ జనతా పార్టీ (BJP) ఒక మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి.
మిగిలిన 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ చైర్మన్ స్థానాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వార్డులు, డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు రికార్డు స్థాయి ఏకగ్రీవాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల పరిధిలోని వార్డులలో కూటమికి చెందిన మొత్తం 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ వార్డుల విభజనను పరిశీలిస్తే.. టీడీపీ తరఫున అత్యధికంగా 660 వార్డులు, జనసేన పార్టీ 38 వార్డులు, బీజేపీ 28 వార్డులలో ఏకగ్రీవ విజయాలను సాధించాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేవలం 19 వార్డులకే పరిమితం కాగా, సీపీఐ ఒక వార్డును, స్వతంత్రులు 5 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని మొత్తం వార్డులలో 21.08 శాతం, అలాగే కార్పొరేషన్ డివిజన్లలో 12.58 శాతం స్థానాలు పోలింగ్‌కు ముందే ఏకగ్రీవమవడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన మరియు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిణామాలే.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 8 మున్సిపాలిటీలలో ఏకంగా 6 చోట్ల కూటమి అభ్యర్థులే ఏకగ్రీవంగా చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుని ప్రతిపక్షానికి షాక్ ఇచ్చారు. ఒకప్పుడు విపక్షాలు నామినేషన్ వేయడానికే భయపడే కడప గడ్డపై ఈ స్థాయిలో పసుపు-కాషాయ జెండాలు ఎగరడం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి తెరలేపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ల పర్వంలోనే కూటమి ఈ రేంజ్ ఆధిక్యం ప్రదర్శించడంతో, మిగిలిన స్థానాల్లో జరగబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








