ఎన్టీఆర్ పై బెజవాడ వేదికగా, ఉపరాష్ట్రపతి ప్రసంశలు..!
భారతదేశ వైద్య విద్యారంగంలో దివంగత ఎన్టీఆర్(NTR) అందించిన సేవలు చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కొనియాడారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఘటికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. వైద్య విశ్వవిద్యాలయ స్థాపనలో ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి ఎంతో కీలకమైనదని ప్రశంసించారు. వికసిత్ భారత్ 2047 సాధనే లక్ష్యంగా దేశంలో వైద్య విద్య విస్తరణ ముమ్మరంగా జరుగుతోందని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ మరియు పీజీ మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు.
వైద్య విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, అధునాతన పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త పరిష్కారాలు, మందులను కనుగొనాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి భవిష్యత్తులో నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని, అంతర్జాతీయ స్థాయిలో వైద్య పరిశోధనల్లో మన విద్యార్థులు గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత కాలంలో వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని, అయితే సాంకేతికత ఎంత పెరిగినా వైద్యవృత్తిలో రోగుల పట్ల చూపించే మానవత్వం, ఆప్యాయత మాత్రమే అన్నింటికన్నా ముఖ్యమైనవని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. గతంలో దేశం మొత్తం మీద కేవలం 21 వేలుగా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, నేడు ఏకంగా 1.20 లక్షలకు పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు వైద్యులు, యువత చొరవ తీసుకోవాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.








