అత్యవసర మందులపై 1000% లాభాలా? ఆసుపత్రులపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
సాధారణంగా మనం బయట ఏ వస్తువు కొనాలన్నా కొట్టు కొట్టుకి తిరిగి రేట్లు చూస్తాం, తక్కువ ఉన్న చోట కొంటాం. కానీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఐసీయూ బయట నిలబడినప్పుడు అలాంటి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. డాక్టర్లు ఏ మందు రాస్తే అది, ఆసుపత్రి మెడికల్ షాప్‌లోనే కొని తీరాల్సిన విధిలేని పరిస్థితి. సరిగ్గా ఈ బలహీనతనే కొందరు ఆసరాగా చేసుకుంటున్నారు.
కేవలం రూ.2,700 మాత్రమే ఉన్న ఒక మందును, దానిపై ఎమ్మార్పీ (MRP) రూ.27,000గా ముద్రించి రోగుల నుంచి పిండుకోవడం ఏ రకమైన న్యాయమని సుప్రీంకోర్టు నిలదీసింది. రోగి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆరాటంలో ఎంత అడిగితే అంత చెల్లించడం తప్ప వేరే దారి లేకపోవడంతో సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది.
లాభాల కక్కుర్తి.. ఎమ్మార్పీ వెనుక ఉన్న పెద్ద దందా
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం కొన్ని ఆసుపత్రులు మందులు, సర్జరీ సామగ్రిపై ఏకంగా 100 శాతం నుంచి 1,000 శాతం వరకు మార్జిన్లు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడే మందులపై 700 శాతానికి పైగా లాభాలు గుంజుతుండటం నిజంగా దారుణం.
ఇక్కడ వ్యాపార కోణం ఏంటంటే, ఏ కంపెనీ అయితే ఆసుపత్రులకు ఎక్కువ కమిషన్లు, భారీ మార్జిన్లు ఇస్తుందో ఆ కంపెనీ మందులనే ఆసుపత్రులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ఎమ్మార్పీ ఎక్కువ పెట్టి, ఆసుపత్రికి తక్కువ ధరకు ఇచ్చి, మధ్యలో రోగి నుంచి మాత్రం ఆ గరిష్ఠ ధర మొత్తాన్ని లాక్కుంటున్నారు. మార్కెట్లో అదే రకమైన తక్కువ ధర ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి సమాచారం రోగులకు తెలియకుండా దాచేస్తున్నారు.
క్యాన్సర్ మందులకే పరిమితమా? సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు
ఈ దోపిడీని అరికట్టడానికి కొన్ని క్యాన్సర్ మందుల వాణిజ్య మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేస్తామని, దీనివల్ల మందుల ధరలు 20 నుంచి 70 శాతం వరకు తగ్గి రోగులకు రూ.2,500 కోట్లు ఆదా అవుతాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానం చాలా కీలకమైన ప్రశ్న వేసింది.
ఇవి కూడా చదవండి
కేవలం క్యాన్సర్ మందుల ధరలనే ఎందుకు నియంత్రిస్తారు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడే రోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. రోగి వ్యాధి ఏదైనా సరే, ఆసుపత్రుల బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఉండాలని, వైద్య పరికరాలు, ఇంజెక్షన్లు, సర్జరీ వినియోగ వస్తువులన్నింటిపై ఒక స్పష్టమైన నియంత్రణ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
బిల్లులో ప్రతి రూపాయికి లెక్క ఉండాలి!
ఆసుపత్రులు తమ సేవల ధరలను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని, రోగుల ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరినట్లు తెలుస్తోంది. ఈ చర్యలు సరిగ్గా అమలైతే రోగులకు కొంత ప్రయోజనం కలగవచ్చు. గది అద్దె, పరీక్షలు, ఇతర సేవలకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. మందులు, వైద్య వస్తువుల బిల్లులను పరిశీలించవచ్చు. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు అనిపిస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
అయితే ఆసుపత్రిలో ధరల పట్టిక ప్రదర్శించడం ఒక్కటే సరిపోదు. బిల్లులో ఏ మందుకు ఎంత వసూలు చేశారు, ఏ వైద్య వస్తువుకు ఎంత ఖర్చయింది అనే వివరాలు స్పష్టంగా ఉండాలి. ఆసుపత్రులు వాటిని ఎంతకు కొనుగోలు చేశాయి, రోగుల నుంచి ఎంత వసూలు చేస్తున్నాయి అనే అంశాలపై పర్యవేక్షణ కూడా అవసరం.
సామాన్యుడికి నిజమైన ఊరట లభించేనా?
ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 935 రకాల అవసరమైన మందులకు గరిష్ఠ ధరలను నిర్ణయించినప్పటికీ, ఇంకా అనేక మందులు, ఆసుపత్రి వస్తువులు ఈ ధరల నియంత్రణ పరిధి బయటే ఉన్నాయి. ఆసుపత్రులు అసలు సామగ్రిని ఎంతకు కొంటున్నాయి, రోగికి ఎంతకు విక్రయిస్తున్నాయో తెలిపే స్పష్టమైన డేటా తమ వద్ద లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ముందుగా ఈ వివరాలను సేకరించి, స్పష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి ఆసుపత్రి తమ వద్ద ఉన్న సేవలు, మందుల ధరల పట్టికను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏదైమైనా…
ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి తన వ్యాధితో పోరాడాలి కానీ, మందుల ధరల లెక్కలతో మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. వైద్యం అందుబాటులో ఉండటమే కాదు.. దాని ఖర్చు కూడా పారదర్శకంగా, రోగికి అర్థమయ్యేలా ఉండాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








