జనసేనతో పొత్తుకు బీజేపీ ససేమిరా!?
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడి నడుస్తోంది. ముఖ్యంగా నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య జనసేనతో పొత్తు అంశం రాష్ట్ర బీజేపీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే భవిష్యత్ లక్ష్యాలతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే తలెత్తే పరిణామాలపై బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన కీలక సమావేశంలో జనసేనతో పొత్తుపై బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి జనసేన తన అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు పేరును ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. మెజారిటీ నేతలు బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి బలమైన హిందూత్వ బ్రాండ్ ఉందని, పొత్తుల పేరుతో ముందుకు వెళితే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న స్థానాల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న వాదనను కొందరు నేతలు పార్టీ పరిశీలకుల ముందు గట్టిగా వినిపించినట్లు సమాచారం.
తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, తనకంటూ ఓ ముద్రను క్రియేట్ చేసుకుందనే అంశాన్ని నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. పొత్తుల కారణంగా పార్టీ స్వతంత్ర అస్తిత్వం దెబ్బతింటుందనే వాదనను తెరపైకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో కేడర్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందని కొందరు ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జనసేనతో విడివిడిగా ఉంటూనే అవసరమైన సందర్భాల్లో రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్లాలే తప్ప, అధికారిక పొత్తు మాత్రం ఆత్మహత్య సదృశమే అవుతుందనే హెచ్చరికలు కూడా కమలనాథుల నుంచి వస్తున్నాయి. ఈ అంశాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు సమాచారం.
మరోవైపు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ సీట్ల సర్దుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పేరు ఇక్కడ దాదాపు ఖరారని సమాచారం. ఈ స్థానంలో జనసేన మద్దతును తీసుకుని మరో స్థానంలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపైన కూడా సమావేశంలో చర్చించారు.
మొత్తంగా చూస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జనసేనతో పొత్తు అంశం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది. జాతీయ నాయకత్వం ఈ అంశంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో, పార్టీలోని ఈ అంతర్గత భేదాభిప్రాయాలు, వ్యూహాత్మక విభేదాలు బీజేపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి.








