చలికాలంలో వేడి సెగలు? డిసెంబర్లో ఎల్‌నినో విలయం..?భారతదేశానికి ముప్పు ?
చలికాలం రాగానే వెచ్చటి టీ, బయట చల్లటి గాలులు, పొగమంచు గుర్తుకొస్తాయి కదా! కానీ ఈసారి పరిస్థితి అంత మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. బయట చలి మొదలైంది అనుకునేలోపే హఠాత్తుగా ఎండలు పెరగడం, ఒక ఊరిలో వానలు దంచికొడుతుంటే పక్క ఊరిలో చుక్క నీటి కోసం ఎదురుచూడటం లాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. దీనికంతటికీ వెనుక ఉన్న అసలు కారణం ‘ఎల్‌నినో’. పసిఫిక్ మహాసముద్రం వేగంగా వేడెక్కుతుండటంతో రాబోయే మూడు నెలల్లో ప్రపంచ వాతావరణం ఎలా మారబోతోందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
సముద్రం వేడెక్కితే మనకేంటి?
సముద్రంలో వేడి పెరిగితే మనకేంటి అని అనుకోవచ్చు కానీ, సముద్రం , వాతావరణం విడదీయలేని జంట. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు గాలుల కదలికలు, మేఘాలు ఏర్పడే తీరు, వర్షాలు పడే ప్రాంతాలు అన్నీ మారిపోతాయి. దాన్నే మనం ఎల్‌నినో అంటాం.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనాల ప్రకారం, నవంబర్ నుంచి జనవరి మధ్య పసిఫిక్ మహాసముద్రం మరింత వేడెక్కనుంది. అమెరికా క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ అయితే 1950 నుంచి ఇప్పటివరకు చూసిన అతిపెద్ద ఎల్నినోలలో ఇది ఒకటి కాబోతోందని ధీమాగా చెబుతోంది. అయితే ఎల్‌నినో అనగానే ప్రపంచమంతా ఎండిపోతుందని కాదు; ఒకచోట వరదలు వస్తే, ఇంకోచోట కరువు రావడం దీని అసలు నైజం.
డిసెంబర్లోనే అసలు కథ
శాస్త్రవేత్తలు ‘నినో 3.4 ఇండెక్స్’ అనే కొలత ద్వారా ఎల్‌నినో ఎంత బలంగా ఉందో లెక్కిస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎంత ఎక్కువ ఉందో ఈ సూచీ చెప్తుంది. గత జూలైలో 2 డిగ్రీలుగా ఉన్న వ్యత్యాసం, సెప్టెంబర్ నాటికి 2.8 డిగ్రీలకు చేరింది. రాబోయే డిసెంబర్ నాటికి ఇది ఏకంగా 3.8 డిగ్రీలకు పెరగొచ్చని WMO అంచనా వేస్తోంది. ఈ లెక్కలు చూస్తుంటే డిసెంబర్ నాటికి వాతావరణంలో పెద్ద మార్పులే వచ్చేలా కనిపిస్తున్నాయి.
మన దగ్గర చలి ఉండునా.. ఊడునా?
సాధారణంగా నవంబర్ రాగానే మన దగ్గర స్వెటర్లు బయటకు తీస్తాం. కానీ ఈసారి భారత్‌లో అలాంటి పరిస్ధితి కనిపించకపోవచ్చు. నవంబర్ నుంచి జనవరి మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. మనతో పాటు అరేబియా ద్వీపకల్పం, తూర్పు ఆసియాలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. అయితే దీని అర్థం దేశమంతా ఎండలు మండిపోతాయని కాదు. ప్రాంతాన్ని బట్టి పగటిపూట వేడి ఉండి, రాత్రికి చలి ఉండవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, స్థానిక వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారం బట్టే అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది.
ఒకచోట వాన.. ఇంకోచోట ఎండ!
ఈసారి ప్రపంచవ్యాప్తంగా వర్షాల తీరు బొత్తిగా కుదురుగా ఉండేలా లేదు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే, పశ్చిమ ప్రాంతంలో మాత్రం పొడి వాతావరణం ఉండవచ్చు. అలాగే మధ్య అమెరికా, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటే, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలోని గ్రేటర్ హార్న్ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు దంచికొట్టవచ్చు. ఆఖరికి దక్షిణ అమెరికా ఖండంలోనే ఒకవైపు వర్షాలు, ఇంకోవైపు కరువు వస్తుండటం ఎల్‌నినో చూపిస్తున్న విచిత్రమైన ప్రభావం.
భారత్‌పై హిందూ మహాసముద్రం ప్రభావం
మనకి పసిఫిక్ ఎంత ముఖ్యమో, మన పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ‘ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD)’ అనే ప్రక్రియ జరుగుతుంది. గత కొన్ని నెలలుగా ఇది పాజిటివ్‌గా ఉండి మనకి అనుకూలించినా, రాబోయే నవంబర్ నుంచి జనవరి నాటికి ఇది సాధారణ స్థాయికి తగ్గిపోతుందని అంచనా. అంటే దీని నుంచి వచ్చేదనపు ఊరట ఈ శీతాకాలంలో ఉండకపోవచ్చు.
ముందుంది ముసళ్ల పండుగ?
ఆర్కిటిక్ నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్రికా నుంచి అట్లాంటిక్ సముద్రం వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వాతావరణ నిపుణులు వేసిన ప్రాథమిక అంచనాలు మాత్రమే. నివేదికలు వచ్చాయి కదా అని ప్రతిరోజూ వేడిగా ఉంటుందనో, లేదా ప్రతిచోటా ప్రళయం వస్తుందనో భయపడాల్సిన పనిలేదు. రాబోయే వారాల్లో సముద్రాల్లో జరిగే మార్పులను బట్టి స్థానిక వాతావరణ కేంద్రాలు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ ఉండటమే మనముందున్న మార్గం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








