కాటంరెడ్డి ప్రసాదరెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన ‘‘‘‘శంకర రత్న పురస్కారం 2025’’
శంకర నేత్రాలయ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘‘శంకర రత్న పురస్కారం 2025’’ కాటంరెడ్డి ప్రసాద రెడ్డికి దక్కింది. చెన్నైలోని శంకర నేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రసాదరెడ్డి, శోభారెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి శంకర నేత్రాలయ చైర్మన్ డా సురేంద్రన్, శంకరనేత్రాలయ ఇండియా అధ్యక్షుడు డా. గిరీష్ రావు, శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తితో పాటు, అమెరికా నుండి శ్యామ్ అప్పాలి, ఇ.వి.పి, డల్లాస్ ట్రస్టీ బుచ్చిరెడ్డి గోలి, మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
భారత ఉప రాష్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తమిళనాడుతో, మద్రాస్ శంకరనేత్రాలయతో ఉన్న తమ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, కాటంరెడ్డి ప్రసాద రెడ్డి, శోభా రెడ్డి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు వీరి సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని, మరింత సహకారాన్ని అందించాలని సూచించారు.

శంకరనేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అనేక రాష్ట్రాలలో శంకరనేత్రాలయ చాప్టర్లు ప్రారంభించామని చెప్పారు. తద్వారా వాలంటీర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారు శంకరనేత్రాలయ వారు చేసే సేవాకార్యక్రమాలు మరింతమంది దాతల దగ్గరకు తీసుకువెళ్లారని అన్నారు. తద్వారా సంస్థకు కావలిసిన నిధులు, మునుపెన్నడూ లేని విధంగా సమకూర్చడం జరుగుతోందని చెప్పారు. ఇదే సందర్భంలో, ప్రసాద్ రెడ్డి ఈ శంకరారత్న అవార్డుకు పూర్తిగా అర్హులని.. శోభారెడ్డి, ప్రసాదరెడ్డి నిస్వార్ధంగా ఎన్నో సేవాసంస్థలకు అండదండగా ఉంటూ, తమ లాభాలలో రెండు మిలియన్ డాల్లర్స్ను ప్రతి సంవత్సరం విరాళంగా ఇస్తారని చెప్పారు. శంకరనేత్రాలయ సంస్థ అంటే, వీరికి ప్రత్యేక అభిమానమని కూడా తెలియజేశారు.
ప్రసాద రెడ్డి స్వయంగా దాతగానే కాకుండా, శంకరనేత్రాలయ సంస్థలకు సలహాదారుడిగా సేవలు అందిస్తూ, సంస్థ చేపట్టే నిధుల సమీకరణ కార్యక్రమాలకు ప్రత్యేకంగా హాజరవుతూ, శంకరనేత్రాలయ అమెరికా కార్యకర్త శ్రేణులలో ఉత్సాహాన్నినింపుతున్నారని చెప్పారు. మరెంతోమంది కొత్త దాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరు చేసిన సేవలకు ఇటీవల న్యూజెర్సీ రాష్ట్ర సెనెట్ అభినందిస్తూ ఒక ప్రొక్లెమేషన్ కూడా జారీ చేసింది.

ఇక.. పురస్కార గ్రహీత ప్రసాదరెడ్డి కాటంరెడ్డి మాట్లాడుతూ శంకరనేత్రాలయ సంస్థ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వందలాదిమంది సేవాకార్యకర్తలు అహర్నిశలు శ్రమించి ఎంతోమందికి కంటిచూపూ తెప్పించడం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియచేశారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయ సంస్థలకు అదనంగా మరో లక్ష డాలర్ల విరాళాన్ని అందజేశారు. దీనితో ఇప్పటివరకు శంకరనేత్రాలయాకు ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి ఆరు లక్షల ఇరవై ఐదు వేల డాలర్స్ మొత్తాన్ని అందచేసి సంస్థకు అమెరికాలో అత్యంత ధనసహాయాం చేసిన దంపతులుగా, తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.








