జడ్పీటీసీ, ఎంపీటీసీ అర్హుల తుది జాబితా విడుదల : ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు గానూ 46,045 నామినేషన్లు (Nominations) సరిగా ఉన్నాయని వెల్లడించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 19,760, వైసీపీ 17,726, జనసేన 4,330, బీజేపీ 1,049 మంది కాగా, ఇండిపెండెంట్లు 2012 మంది ఉన్నారు.
జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న 659 స్థానాలకు గాను 4770 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చింది. ఇందులో టీడీపీ 1,693, వైసీపీ 1,445, జనసేన 587, కాంగ్రెస్ 316, బీజేపీ 227 మంది కాగా ఇండిపెండెంట్లు 227 మంది ఉన్నారు.
జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే జడ్పీటీసీలు ఎక్కువగా ఉన్న కడప జిల్లా (Kadapa District)లో 39 స్థానాలకు 215 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్టు నిర్ధారించారు. అతి తక్కువ జడ్పీటీసీలు ఉన్న విశాఖ జిల్లా (Visakha District)లో నాలుగు స్థానాలకు 46 నామినేషన్లు అర్హత సాధించాయి. అత్యధిక నామినేషన్లు తిరుపతి జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు 280 నామినేషన్లు ఆమోదం పొందాయి.








