మహిళల టి20 వరల్డ్ కప్.. పాక్ ఆతిథ్యం..!
2028లో జరగబోయే ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన ఆతిథ్య వేదికపై ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా, భారత జట్టు ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికగా యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీని కోరనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 12 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 2028 సెప్టెంబర్ 7 నుండి అక్టోబర్ 1 వరకు జరగనుంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఐసీసీ ఈ టోర్నీలోనూ హైబ్రిడ్ మోడల్ ను వర్తింపజేసే అవకాశం ఉంది. ఈ విధానం ప్రకారం, పాకిస్థాన్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తన మ్యాచ్‌లను ఇతర దేశాల్లో ఆడుతుంది. గతంలో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేశారు. ఆ సమయంలో భారత్ తన మ్యాచ్‌లన్నీ యూఏఈలోనే ఆడి, దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచింది. కాబట్టి 2028 మహిళల ప్రపంచకప్‌నకు కూడా ప్రయాణ సౌలభ్యం, తక్కువ ఖర్చుతో కూడిన లాజిస్టిక్స్ కారణంగా యూఏఈ ఉత్తమమైన తటస్థ వేదికగా మారుతుందని పీసీబీ వర్గాలు భావిస్తున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్‌లతో పాటు, ఒకవేళ భారత్ నాకౌట్ దశకు చేరితే ఆ మ్యాచ్‌లను కూడా పాకిస్థాన్ వెలుపలే నిర్వహిస్తారు. భారత జట్టు బరిలో లేని మిగతా గ్రూప్ మ్యాచ్‌లను, నాకౌట్ మ్యాచ్‌లను మాత్రమే పాక్ వేదికల్లో నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోతే, ఆ తుది పోరును లాహోర్‌లో జరిపేందుకు పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.








