ఏపీ స్థానిక సమరం.. జడ్పీ పీఠాలపై తేల్చనున్న కూటమి పెద్దలు..!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల వేడి పెరిగిన వేళ, అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటు బాధ్యతలను ఎక్కడికక్కడ స్థానిక జిల్లా నాయకత్వానికే అప్పగించాలని కూటమి అగ్రనేతలు ఒక తుది నిర్ణయానికి వచ్చారు. అయితే, అత్యంత కీలకమైన జిల్లా పరిషత్ (zptc) చైర్మన్ స్థానాల పంపకాలను మాత్రం కూటమి పార్టీల రాష్ట్ర అగ్రనాయకత్వమే నేరుగా సర్దుబాటు చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ చైర్మన్ స్థానాలు, 659 జడ్పీటీసీ స్థానాలు, 660 ఎంపీపీ, మరియు 9,829 ఎంపీటీసీ స్థానాలపై కూటమి పార్టీల నడుమ పూర్తిస్థాయి అవగాహన కుదరాల్సి ఉంది. నియోజకవర్గాల్లో తిరుగుబాటు (రెబెల్) అభ్యర్థుల సమస్యలను నివారించేందుకు మరియు స్థానిక బలాబలాల ఆధారంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల కేటాయింపు బాధ్యతను జిల్లా సమన్వయ కమిటీలు, స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించారు.
కూటమి ఐక్యతకు ఎక్కడా విఘాతం కలగకుండా అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాల విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ (bjp) కి జడ్పీ చైర్మన్ స్థానాలు ఏవీ కేటాయించే అవకాశం లేదని నమ్మదగిన సమాచారం. కాగా, పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 6 జడ్పీ చైర్మన్ స్థానాలు దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు మన్యం, అనకాపల్లి జిల్లాల జడ్పీ స్థానాలతో పాటు మరో నాలుగు కీలక స్థానాలను జనసేనకు కేటాయించే వీలుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి వచ్చిన తర్వాత, జనసేన, బీజేపీ అగ్రనేతలతో తుది విడత చర్చలు జరిపి ఈ స్థానాలపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.








