ఏపీకి పొంచి ఉన్న భారీ తుఫాన్ ముప్పు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కి.మీ, బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై నైరుతి దిశగా కదులుతోంది. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా మారి ‘అర్నాబ్’గా(Arnab Cyclone) రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడి, బుధవారం నాటికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్రలోని లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. సముద్రం తీవ్ర అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే సురక్షిత తీరాలకు చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.








