కంస మామ జగన్: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ అంతర్గత ఆస్తుల గొడవలు, వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేదిక వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ, కుటుంబ, నైతిక విలువలు ఏమాత్రం లేవని దుయ్యబట్టారు. జగన్ ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా.. ఒక కొడుకుగా, అన్నగా, చివరికి ఒక మేనమామగా కూడా పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా.
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తన బిడ్డలిద్దరికీ సమానంగా పంచిన ఆస్తిలో, తన వాటాగా వచ్చిన భాగంలో షర్మిల తన కుమార్తె వివాహం చేయాలని నిశ్చయించుకున్నారని గుర్తుచేశారు. అయితే, ఆ పెళ్లి వేడుకను జరిపించుకునేందుకు బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌ను ఇవ్వకుండా జగన్ అడ్డుపడటం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. మేనకోడలి శుభకార్యాన్ని కూడా అడ్డుకుంటున్న జగన్ తీరు ‘కంస మామ’ను తలపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆస్తుల గొడవల కోసం ఎవరైనా కన్నతల్లిని కోర్టుకు లాగుతారా? అంటూ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. సొంత చెల్లి షర్మిలనే కాకుండా, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై న్యాయం కోసం పోరాడుతున్న మరో చెల్లి వైఎస్ సునీతా రెడ్డిని కూడా జగన్ అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లెళ్లను, మేనకోడళ్లను ఇంతలా వేధిస్తున్న వ్యక్తి సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు.
కుటుంబంలోనే ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా హింసించారో ప్రజలంతా చూశారని చంద్రబాబు అన్నారు. “ఒకవేళ మళ్లీ ఈ గొడ్డలి పార్టీ గనుక అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమవుతుందో” అని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా భయపడే స్థితికి వచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం సొంత రక్తాన్ని కూడా కరుణించని ఇలాంటి క్రిమినల్ మనస్తత్వం సమాజానికే ప్రమాదకరమని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇలాంటి అరాచక శక్తుల ఆటలు సాగనివ్వదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.








