కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు ప్రతిష్టాత్మక ‘శంకరరత్న’ పురస్కారం.. అందజేసిన వెంకయ్యనాయుడు.
చెన్నైలోని శంకరనేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసిద్ధ దాతలు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి దంపతులకు ప్రతిష్టాత్మక ‘శంకరరత్న పురస్కారమ్ – 2025’ను ప్రదానం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వీరు ఈ అవార్డును అందుకున్నారు.
శంకరనేత్రాలయ చైర్మన్ డాక్టర్ సురేంద్రన్, ఇండియా అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, అమెరికా విభాగం అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రదానోత్సవం వైభవంగా సాగింది. ఈ వేడుకకు డల్లాస్ ట్రస్టీ, ఈవీపీ శ్యామ్ అప్పాలి, మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి గోలి, ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ఈ.ఎల్.ఎన్. నరసింహన్, చెన్నై నగర ప్రముఖులు, శంకరనేత్రాలయ సిబ్బంది , పాత్రికేయులు హాజరయ్యారు. గతంలో రతన్ టాటా, మాజీ ఇస్రో చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ జి. మాధవన్ నాయర్, మాజీ ఎల్ అండ్ టి చైర్మన్ పద్మవిభూషణ్ ఏ.ఎమ్. నాయక్, మాజీ టీసీఎస్ సీఈఓ పద్మభూషణ్ ఎస్. రామదొరై, మాజీ హెచ్డీఎఫ్సీ పద్మభూషణ్ దీపక్ పరేఖ్, ప్రముఖ తమిళ చిత్ర దర్శకులు ఎస్.పి. ముత్తురామన్ వంటి మహామహులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ప్రవాస భారతీయుల్లో ఎస్.వి. ఆచార్య, బాలరెడ్డి ఇందుర్తి కూడా గతంలో ఈ గౌరవాన్ని పొందగా, ఈ కార్యక్రమానికి పూర్వ అవార్డు గ్రహీతలైన ఎస్.పి. ముత్తురామన్, ప్రముఖ తమిళ రచయిత వి.వి. రంగనాథన్ ప్రత్యక్షంగా హాజరుకావడం విశేషం.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తమిళనాడుతో, మద్రాస్ శంకరనేత్రాలయతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి దంపతులు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. వీరి సేవా నిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
శంకరనేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శంకరనేత్రాలయ నూతన చాప్టర్లను ప్రారంభించడం వల్ల వాలంటీర్ల సంఖ్య పెరిగిందని వివరించారు. దాతల భాగస్వామ్యం పెరిగి సంస్థకు మునుపెన్నడూ లేని రీతిలో నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. ప్రసాద్ రెడ్డి దంపతులు శంకరరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హులని, తమ వ్యాపార లాభాల నుంచి ఏటా రెండు మిలియన్ డాలర్లను వివిధ సేవా సంస్థలకు విరాళంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాద్ రెడ్డి కుటుంబం ఇప్పటికే తొమ్మిది కంటి వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించగా, వచ్చే ఏడాదికి గాను మరిన్ని క్యాంపులను షెడ్యూల్ చేశారు. వీరి ఆర్థిక సహకారంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ‘చెన్నై మేసు బస్సు యూనిట్’ను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రసాద్ రెడ్డి దాతగానే కాకుండా శంకరనేత్రాలయ సలహాదారుగా, నిధుల సమీకరణలో కీలక ప్రేరేపకుడిగా వ్యవహరిస్తున్నారని, వీరి సేవలను గుర్తించి ఇటీవల న్యూజెర్సీ రాష్ట్ర సెనెట్ ప్రత్యేకంగా ప్రొక్లమేషన్ ఇచ్చి గౌరవించిందని వెల్లడించారు.
అవార్డు స్వీకరణ అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. శంకరనేత్రాలయ అందిస్తున్న సమాజ సేవలు వెలకట్టలేనివని, అహర్నిశలు శ్రమించి వేలాదిమందికి కంటిచూపును ప్రసాదిస్తున్న వైద్యులు, సిబ్బంది తనకు ఎంతో ప్రేరణ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా శంకరనేత్రాలయకు అదనంగా మరో 1,00,000 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. దీనితో శంకరనేత్రాలయకు వీరు అందించిన మొత్తం విరాళం 6,25,000 డాలర్లకు చేరింది. తద్వారా అమెరికాలో శంకరనేత్రాలయకు అత్యధిక ఆర్థిక సాయం అందించిన దంపతులుగా వీరు నిలిచారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం బాలరెడ్డి ఇందుర్తి, డాక్టర్ గిరీష్ రావు, స్వామినాథన్ చంద్రశేఖర్ (శంకరనేత్రాలయ వ్యవస్థాపకులు డాక్టర్ బద్రీనాథ్ సమకాలీకులు) మైసూర్ లోని దత్తపీఠాన్ని సందర్శించారు. అవధూత గణపతి సచ్చిదానంద స్వామిని కలిసి దాదాపు 40 నిమిషాల పాటు శంకరనేత్రాలయ ఉచిత కంటి సేవా కార్యక్రమాలను వివరించి, భవిష్యత్ కార్యాచరణకు ఆశీస్సులు కోరారు. శంకరనేత్రాలయ చేపడుతున్న మంచి కార్యక్రమాలకు తమ ఆశీస్సులు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్వామీజీ అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి కుటుంబానికి శంకరనేత్రాలయ కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.








