కష్టకాలంలో అండగా నిలిచారు.. భారత్ కు లంక ప్రభుత్వం కృతజ్ఞతలు..
DELHI: 2022.. శ్రీలంకను తీవ్ర అర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. పెరిగిన ఇంధన ధరలు.. అందుబాటులో లేని నిత్యవసరధరలు లంకలో అశాంతిని రేకెత్తించాయి. అధ్యక్షభవనం, పార్లమెంటు, మంత్రుల భవనాల్లోకి నిరసనకారులు చొరబడ్డారు. మంత్రులను, ఎంపీలను వెంటబడి కొట్టారు. అంతేనా.. ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కనిపించినా దాడి చేశారు.షాపుల లూఠీలకు అంతే లేదు. దీంతో లంక పని అయిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఆదశలో పొరుగున ఉన్న భారత్.. స్నేహపూర్వకంగా స్పందించింది. విదేశాల నుంచి తెచ్చిన ముడిచమురును రిఫైన్ చేసి.. వేల టన్నుల డీజిల్ , పెట్రోల్ ను లంకకు సరఫరా చేసింది. ఆ దేశంలో ఇంధన కొరత లేకుండా చేసింది. దీనికి తోడు రుణ చెల్లింపులను కొంతకాలం పాటు వాయిదా వేసింది. ఆ దేశానికి కావాల్సిన ఆర్థిక సాయం చేసింది. నెమ్మదిగా ద్వీప దేశం ఒడ్డున పడేందుకు సహకరించింది కూడా.
దీంతో…తమ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు శ్రీలంక ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న శ్రీలంక పరిశ్రమలు, వ్యవస్థాపక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి చతురంగ అబేసింఘే ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ తమకు వెన్నెముకగా నిలిచిందని ఆయన కొనియాడారు.
2022లో శ్రీలంకను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అబేసింఘే ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇంధనం, నిత్యావసరాల తీవ్ర కొరతతో పాటు ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో దేశం అల్లకల్లోల స్థితిని ఎదుర్కొందని వివరించారు. “ఆ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా ధన్యవాదాలు. మీరు అందించిన ఆర్థిక సహాయం సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మాకు ఎంతగానో దోహదపడింది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం శ్రీలంక సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకుందని, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అబేసింఘే తెలిపారు. రుణాల పునర్వ్యవస్థీకరణతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కీలక సంస్కరణలు ప్రవేశపెట్టామని వివరించారు. భవిష్యత్తులో రుణ చెల్లింపుల విషయంలో ఎటువంటి రిస్క్ ఉండదని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ఇకపై దేశాన్ని స్థిరత్వం నుంచి వృద్ధి పథం వైపు నడిపిస్తామని, ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వెల్లడించారు. 1990లలో భారత్ క్రమంగా తన మార్కెట్లను తెరిచిన విధానం తమకు ఒక ఆదర్శమని అభిప్రాయపడ్డారు. పారా-టారిఫ్లను తొలగించడం, మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యలతో వృద్ధిని సాధిస్తామని చెప్పారు. 2019 నుంచి నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నామని, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో పారిశ్రామిక, ఆర్థిక మార్పుల కోసం ఇతర దేశాలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని అబేసింఘే స్పష్టం చేశారు.








