13 కోట్ల ఓట్ల తొలగింపు నిజమేనా..?
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏకంగా 13.37 కోట్ల మంది ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ స్టేజ్లో తొలగించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ భారీ సంఖ్య వెనుక ఉన్న అసలు వాస్తవాలను ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తన తాజా విశ్లేషణలో వెల్లడించారు. డ్రాఫ్ట్ స్టేజ్లో జరిగిన ఈ తొలగింపుల్లో 2.8 కోట్ల మరణించిన వారి ఓట్లు, 6.3 కోట్ల వలస వెళ్లిన వారి ఓట్లు, ఒక కోటి డూప్లికేట్ ఓట్లు, మరో 3 కోట్ల గుర్తించలేని ఓట్లు ఉన్నాయని, అందువల్ల ఎనిమిదింటిలో ఏడు తొలగింపులు పూర్తిగా సమర్థించదగినవేనని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోని వయోజన జనాభా, ఓటరు నమోదు కాని వారి శాతం మరియు అధికారిక మరణాల గణాంకాలను విశ్లేషించిన సుర్జిత్ భల్లా.. తుది జాబితా తర్వాత కేవలం 70 లక్షల మంది అర్హులైన ఓటర్ల తొలగింపునకు మాత్రమే సరైన వివరణ లభించలేదని లెక్కగట్టారు. భారతదేశం లాంటి భారీ జనాభా, వలసలు ఎక్కువగా ఉండే దేశంలో వంద శాతం పర్ఫెక్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేయడం అంత సులువు కాదని ఆయన పేర్కొన్నారు. గత చరిత్రను పరిశీలిస్తే 2004లో 2.8 కోట్లు, 2014లో 3.1 శాతం చొప్పున వయోజన జనాభా కంటే అదనపు ఓట్లు జాబితాలో ఉండేవని, కాబట్టి ఓటర్ల లిస్ట్ను క్లీన్ చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉందని భల్లా అభిప్రాయపడ్డారు.
అయితే జాతీయ స్థాయితో పోలిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత భిన్నంగా మరియు ఆందోళనకరంగా ఉందని భల్లా తన విశ్లేషణలో హెచ్చరించారు. బెంగాల్లో ఓటర్ల జాబితా ఏకంగా 11.6 శాతం తగ్గిపోగా, అక్కడ దాదాపు 50 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లు ఎలాంటి వివరణ లేకుండా తొలగించబడ్డాయని ఆయన అంచనా వేశారు. మరోవైపు ఈ వివాదం మొదలైన బిహార్ రాష్ట్రంలో మాత్రం వలస కార్మికుల కారణంగా ఉండాల్సిన దానికంటే 60 లక్షల ఓట్లు అదనంగానే ఉన్నట్లు తేలింది. ఎన్నికల సంఘం ఈ సవరణ ప్రక్రియను అత్యంత వేగంగా ముగించడం, పేదలకు ఇబ్బంది కలిగించే కొత్త నిబంధనలు తీసుకురావడం వల్లే ఈ వివాదం ఇంత పెద్దదైందని సుర్జిత్ భల్లా చెప్పుకొచ్చారు.








