ట్రంప్ ఊహించని బిగ్ యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట! అసలేం జరిగింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఒక్కసారిగా సంచలనం మొదలైంది! రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనే దేశాలపై విరుచుకుపడతామని, ఏకంగా 100 శాతం వరకు భారీ సుంకాలు వడ్డిస్తామని హెచ్చరించిన ఆయన, సరిగ్గా ఆ ఆంక్షలు అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ట్రంప్ తీసుకున్న ఈ బిగ్ యూటర్న్‌తో రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశంతో పాటు చైనాకు తీవ్రమైన ఆంక్షల నుంచి క్షణాల్లో ఊరట లభించినట్లయింది.
చివరి నిమిషంలో అసలేం జరిగింది?
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది అమెరికా ప్రధాన ఉద్దేశం. అందుకే గత నెలలో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై 100 శాతం వరకు పన్నులు వేసే పవర్‌ను తెచ్చారు. అయితే, ఈ రూల్ కనుక అమల్లోకి వస్తే భారత్, చైనాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని అందరూ భావించారు.
కానీ డెడ్‌లైన్‌కు కేవలం ఒక్కరోజు ముందు సీన్ పూర్తిగా మారిపోయింది! ట్రంప్ తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఆంక్షల అమలును తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతూ మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా అమెరికా కాంగ్రెస్‌కు కూడా తెలియజేశారు. ఈ భారీ సుంకాలను సడలించకపోతే గ్లోబల్ మార్కెట్లో అస్థిరత ఏర్పడి, అమెరికా సొంత ప్రయోజనాలకే నష్టం జరుగుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
భారత్ గట్టి వార్నింగ్.. ట్రంప్‌పై విమర్శల దాడి!
నిజానికి రష్యా చమురు కొనుగోళ్ల వ్యవహారంలో భారత్ మొదటి నుంచీ వెనక్కి తగ్గలేదు. చమురును సాకుగా చూపి తమపై పన్నులు మోపాలని చూస్తే, ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని ముందే గట్టిగా చెప్పింది.
మరోవైపు ఇతర దేశాలను రష్యా నుంచి చమురు కొనవద్దని ఆంక్షలతో భయపెడుతున్న అమెరికా, లోపాయికారీగా స్వయంగా రష్యాతో ఆయిల్ డీల్స్ కుదుర్చుకుందనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగాయి.
ప్రపంచ మార్కెట్లకు బిగ్ రిలీఫ్!
ట్రంప్ తాజా యూటర్న్‌తో భారతదేశానికి తక్షణ ఆంక్షల భయం పూర్తిగా తొలగిపోయింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో కొంతకాలంగా రేగుతున్న ఆందోళనలు తగ్గి చమురు ధరలు ప్రశాంతంగా స్థిరపడ్డాయి. అయితే ఇది కేవలం తాత్కాలిక మినహాయింపు మాత్రమే కాబట్టి, రాబోయే రోజుల్లో అమెరికా ఎలాంటి అడుగులు వేస్తుందోననే దానిపైనే భారత్ తదుపరి వ్యూహాలు ఆధారపడి ఉంటాయి.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








