పెంగ్విన్లను లెక్కపెట్టే ఉద్యోగం ! ఐదు నెలలు మంచులోనే జీవితం.. అసలు కథేంటి?
ఉద్యోగం అంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఆఫీసుకు వెళ్లడం, టార్గెట్లు పూర్తి చేయడం అనుకుంటాం. అయితే ఓ ఉద్యోగం మాత్రం ఈ ప్రశ్నలన్నింటినీ ఒకేసారి ప్రక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆఫీసుకు వెళ్లాలంటే మంచు మధ్య ప్రయాణించాలి. సహోద్యోగులుగా పెంగ్విన్లు కనిపిస్తాయి. ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. అయితే మిగతా విషయాల్లో మాత్రం మీ అభిప్రాయం కొంత మారవచ్చు. ఇంతకీ అక్కడ చేయాల్సింది ఏమిటీ అంటారా..పెంగ్విన్లను లెక్కపెట్టడం ! చుట్టూ మంచు కొండలు.. గడ్డకట్టే చలి.. మనుషుల కంటే పెంగ్విన్లే ఎక్కువగా కనిపించే వాతావరణం. అలాంటి అంటార్కిటికాలో ఐదు నెలలపాటు పనిచేసే అవకాశం ప్రతీ యేడు ఓ బ్రిటిష్ సంస్థ ప్రకటిస్తూ ఉంటుంది. వినడానికి కలలా అనిపించినా.. ఈ ఉద్యోగం వెనుక ఆసక్తికరమైన బాధ్యతలు, కఠినమైన సవాళ్లు ఉన్నాయి.
పెంగ్విన్లను లెక్కపెట్టడమే కాదు.. ఇంకా చాలా పనులున్నాయి!
బ్రిటన్కు చెందిన UK Antarctic Heritage Trust సంస్థ అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్ కేంద్రంలో పనిచేయడానికి 2022 నుంచి ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తోంది. బేస్ లీడర్, షాప్ మేనేజర్, జనరల్ అసిస్టెంట్ వంటి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ కేంద్రంలో పోస్టాఫీసు, మ్యూజియం, దుకాణం నిర్వహణతో పాటు పర్యాటకులకు సహాయం చేయడం కూడా ఉద్యోగుల బాధ్యతల్లో భాగం.
అయితే ఈ ఉద్యోగానికి ప్రత్యేక ఆకర్షణ వన్యప్రాణుల పర్యవేక్షణ. అక్కడి పెంగ్విన్లు, వాటి గుడ్లు, ఇతర వన్యప్రాణుల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే చేపట్టే దీర్ఘకాలిక జీవజాతుల జనాభా పర్యవేక్షణ కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది కేవలం పర్యాటక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగం కాదు.. ప్రకృతి పరిరక్షణలోనూ భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత.
ఇవి కూడా చదవండి
ఐదు నెలలు మంచు ప్రపంచంలోనే ఉండాలి!
ఈ ఉద్యోగం గురించి వినగానే అక్కడి అందమైన దృశ్యాలు, పెంగ్విన్లతో గడిపే సమయం గుర్తుకు రావచ్చు. కానీ వాస్తవ పరిస్థితులు అంత సులభం కాదు. తీవ్రమైన చలి, మంచు పేరుకుపోవడం, ఆధునిక సౌకర్యాల కొరత వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో అక్కడ పనిచేసిన సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం, మంచును తొలగించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఫ్లష్ టాయిలెట్లు వంటి సాధారణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు.
అందుకే ఈ ఉద్యోగానికి ప్రకృతిపై ఆసక్తి ఉంటే సరిపోదు. ఒంటరిగా లేదా పరిమిత సిబ్బందితో పనిచేయగలగడం, కఠినమైన వాతావరణానికి అలవాటు పడటం, రోజువారీ నిర్వహణ బాధ్యతలను చేపట్టగలగడం కూడా అవసరం.
అసలు ఈ పోర్ట్ లాక్రాయ్ ఎక్కడుంది?
అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని పోర్ట్ లాక్రాయ్ ఒక చారిత్రక ప్రాంతం. 1944లో బ్రిటన్ ఇక్కడ శాశ్వత శాస్త్రీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1962 వరకు ఈ కేంద్రం పనిచేసింది. ఆ తర్వాత UK Antarctic Heritage Trust ఆధ్వర్యంలోకి వచ్చిన ఈ ప్రదేశం ప్రస్తుతం చారిత్రక వారసత్వ పరిరక్షణ, పర్యాటక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది.
ఇప్పుడు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చా?
2026–27 అంటార్కిటికా సీజన్కు సంబంధించిన టీమ్ ని సంస్థ ఇప్పటికే ఎంపిక చేసింది. అందువల్ల కొత్త ప్రకటన కోసం ఎదురుచూడాలి. ఈ తరహా ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు UK Antarctic Heritage Trust అధికారిక ఉద్యోగాల పేజీని గమనిస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్రిటన్లో చట్టబద్ధంగా పనిచేసే అర్హత తప్పనిసరి కావచ్చు.ఈ ఉద్యోగం చేయాలనుకునేవారు దరఖాస్తు నిబంధనలను ముందుగా పరిశీలించాలి.
పెంగ్విన్లను లెక్కపెట్టడం ఒక ఉద్యోగ బాధ్యత కావచ్చేమో కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణాల్లో ఒకటైన అంటార్కిటికాలో నెలల తరబడి జీవించడం మాత్రం నిజమైన సాహసమే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








