రంజీ ట్రోఫీని ఇలా నాశనం చేస్తారా..?: సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి..!
భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మక దేశీవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాణ్యత, దాని షెడ్యూలింగ్ విధానంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఇండియా-ఎ (India A) సిరీస్లను నిర్వహించడంపై ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ విధమైన షెడ్యూలింగ్ వల్ల దేశీవాళీ క్రికెట్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని గవాస్కర్ తన తాజా కాలమ్లో మండిపడ్డారు.
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ ప్రారంభమైన రోజే ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య మ్యాచ్ కూడా జరిగిందని, దీనివల్ల కీలకమైన ఆటగాళ్లు తమ సొంత రాష్ట్ర జట్లకు అందుబాటులో లేకుండా పోయారని గవాస్కర్ గుర్తుచేశారు. రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇండియా-ఎ బాధ్యతల వల్ల రంజీ ఓపెనర్ మ్యాచ్లను ఆడలేకపోయారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నెల చివర్లో ఇండియా-ఎ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండటంతో మరికొంత కాలం స్టార్ ప్లేయర్స్ రంజీ మ్యాచ్లకు దూరం కానున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి బలహీనమైన షెడ్యూలింగ్ వల్ల రంజీ ట్రోఫీలో నాణ్యత లోపిస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. “టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరూ రంజీలు ఆడటం లేదు. బలహీనమైన బౌలింగ్ లేదా బ్యాటింగ్ లైనప్లపై ఆడి కొందరు బ్యాటర్లు రంజీ సీజన్ లో 2000 పరుగులు, బౌలర్లు 100 వికెట్లు తీసి రికార్డులు సృష్టిస్తున్నారు. కానీ, తీరా వారిని భారత జట్టుకు ఎంపిక చేసినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేక త్వరగానే కనుమరుగవుతున్నారు” అని గవాస్కర్ కఠిన వాస్తవాలను ప్రస్తావించారు. ‘ఎ’ జట్టు మ్యాచ్లు అవసరమే అయినప్పటికీ.. రంజీ ట్రోఫీ జరుగుతున్న సమయంలో వాటిని పెట్టకూడదని సూచించారు.
లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రంజీ ట్రోఫీలో చోటు కల్పించడం వల్ల టోర్నీ స్థాయి మరింత దిగజారిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సరైన మౌలిక వసతులు లేని కొత్త జట్లు, ఇతర రాష్ట్రాల నుంచి ఆటగాళ్లను అద్దెకు తెచ్చుకుని ఆడిస్తున్నాయని విమర్శించారు. వారు ఎలైట్ డివిజన్ జట్లతో ఆడినప్పుడు లీగ్ ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బయటపడుతోందని, రంజీ ట్రోఫీ ప్రతిష్టను కాపాడటానికి బీసీసీఐ తక్షణమే షెడ్యూలింగ్ మార్పులపై దృష్టి పెట్టాలని గవాస్కర్ డిమాండ్ చేశారు.








