టెక్ బిలియనీర్లను టార్గెట్ చేసిన హాలీవుడ్, అసలు వ్యూహం ఏమిటి?
హాలీవుడ్ ఎప్పుడూ కొత్త తరహా కథలకోసం వెతుకుతూనే ఉంటుంది. జనాలు ఏమి ఇష్టపడతారో, ఏది ట్రెండింగ్ లో ఉందో, ట్రెండింగ్ అవుతుందో గమనిస్తుంది. అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతుంది. కథలు తయారు చేసి ప్రంపంచంలోకి వదలుతుంది. అదే పద్దతిలో ఇప్పుడు దాని దృష్టి టెక్ బిలియనీర్ల జీవితాలపై పడింది.
ఆ క్రమంలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, సామ్ ఆల్ట్‌మన్ వంటి వ్యక్తుల చుట్టూ ఉన్న వ్యాపార పోటీలు, అధికార పోరాటాలు, వివాదాలు సినిమాలకు కథా వస్తువులు అయ్యాయి. The Social Reckoning, Musk, Artificial వంటి ప్రాజెక్టులు ఈ ధోరణికి ఉదాహరణలు.
సోషల్ మీడియా ప్రభావం, ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం, OpenAIలో నాయకత్వ విభేదాలు వంటి అంశాలు వేర్వేరు కోణాల్లో తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలు వాళ్ల జీవితాలను ఎంత వరకూ ప్రతిబింబాయనేది ప్రక్కన పెడితే ..వారి జీవితాల్లోని వివాదాలను మాత్రం ముందుకు తెస్తున్నాయి. దాంతో అవి వారికి ఏ మాత్రం నచ్చటం లేదు. కానీ హాలీవుడ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తోంది.
ఈ సినిమాల్లో ఏముంది!
ఈ సినిమాలు చేయటానికి హాలీవుడ్ కు కనిపిస్తున్న ప్రధాన ఆకర్షణ ఆ ప్రముఖుల జీవితాల్లో, వారి ఆఫీస్ లలో ఘర్షణ, సంఘర్షణ. ఒక స్టార్టప్‌ను ప్రపంచవ్యాప్త సంస్థగా మార్చడం విజయగాథగానే కనపడుతుంది. అదే సంస్థలో నాయకత్వంపై వివాదం తలెత్తితే అది కార్పొరేట్ థ్రిల్లర్‌గా మారుతుందనటంలో సందేహం లేదు. ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే హాలీవుడ్ కు వీరి జీవితాలు తెగ నచ్చేస్తున్నాయి.
అపారమైన సంపద, వ్యక్తిగత ఆశయాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు, సాంకేతిక పరిజ్ఞానంపై నియంత్రణ కోసం పోరాటం.. ఇవన్నీ కలిస్తే కల్పిత కథకు అవసరమైన డ్రామా నిజ జీవితంలోనే కనిపిస్తోంది.
ఈ సినిమాలు మార్కెటింగ్ చేసేటప్పుడు మరో ప్లస్ కనపడుతోంది. ఈ వ్యక్తులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన పేర్లు. వారి గురించి ప్రేక్షకులకు కొంత అవగాహన ఉంది. కాబట్టి సినిమాను పరిచయం చేయడానికి మొదటి నుంచీ కొత్త ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం తక్కువ. అయితే, ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. పేరున్న వ్యక్తిపై సినిమా తీయడం వేరు.. ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేసే స్థాయిలో ఆసక్తి చూపడం వేరు.
హాలీవుడ్‌కు ఈ వ్యూహం ఏ మేరకు లాభం?
గతంలోలాగ పరిస్దితులు లేవు. ఓ కొత్త సినిమా వస్తోందంటే…దానిపై చర్చ జరగాలి, జనాల్లోకి వెళ్లాలి, లేకపోతే ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. వాటిని చాలా చక్కగా టెక్ బిలియనీర్ల జీవితాలు అందిస్తున్నాయి.
అలాగే ఈ కథలకు ఉన్న మరో ప్లస్ ఏమిటంటే… అంతర్జాతీయ ప్రేక్షకులను ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. AI, సోషల్ మీడియా, డిజిటల్ వ్యాపారాలు దేశాల సరిహద్దులను దాటి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల అమెరికాలోని ఒక టెక్ కంపెనీ కథ భారతీయ ప్రేక్షకులకు కూడా ఆసక్తికరంగా మారవచ్చు.
ఇక ఈ సినిమాలతో నిర్మాణ పరంగా పెద్ద ప్లస్ ఏమిటంటే…భారీ యాక్షన్ దృశ్యాల కంటే ఆలోచనలతోనే ఉత్కంఠ సృష్టించవచ్చు. సంస్థలో ఎవరి మాట నెగ్గింది? ఒక కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది? ఇలాంటి ప్రశ్నలతోనే ఆసక్తికరమైన కథను నడిపించవచ్చు.
ఇవి కూడా చదవండి
అయితే, ఈ వ్యూహానికి ప్రమాదాలూ ఉన్నాయి. వార్తల్లో చర్చనీయాంశమైన వ్యక్తి గురించి సినిమా తీయడం వల్ల ప్రేక్షకులు వస్తారనే హామీ లేదు. కథనం బలహీనంగా ఉంటే, సినిమా ఒక వార్తా కథనానికి దృశ్యరూపం ఇచ్చినట్టుగా మిగిలిపోవచ్చు. అందుకే ఈ ధోరణిని హాలీవుడ్‌కు ఖాయం అయిన ఆదాయ వనరుగా కాకుండా, కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయోగంగా చూడాలి.
టెక్ బిలియనీర్లకు నష్టం జరుగుతుందా?
ఎవరైనా ఒక వ్యక్తి గురించి సినిమా రావడం అతని ప్రతిష్ఠపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా, విజయాల వెనుక ఉన్న వివాదాలు, ఉద్యోగుల అనుభవాలు, నాయకత్వ నిర్ణయాలు, సంస్థల బాధ్యతలపై సినిమా దృష్టి పెడితే ప్రేక్షకులు ఆ వ్యక్తిని చూసే కోణం మారవచ్చు.
అయితే, నెగిటివ్ గా చిత్రీకరించిన సినిమా వల్ల వ్యాపారం తప్పనిసరిగా దెబ్బతింటుందని చెప్పలేం. కొన్నిసార్లు వివాదాలు మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఒక వ్యక్తిపై ఆసక్తి పెరగడం, అతని కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం రెండూ వేర్వేరు విషయాలు.
అసలు ఆసక్తి బిలియనీర్లలోనా.. వారి చేతుల్లోని అధికారంలోనా?
హాలీవుడ్ ఈ కథలపై ఆసక్తి చూపడానికి అసలైన కారణం టెక్ బిలియనీర్ల వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాదు. వారి నిర్ణయాలు సమాజంపై చూపుతున్న ప్రభావం ఎక్కువ ఉండటం.
ఒకప్పుడు టెక్నాలజీ కంపెనీలను ప్రధానంగా వ్యాపార విజయాల కోణంలో మాత్రమే చూసేవారు. ఇప్పుడు అవి ప్రజలు సమాచారాన్ని పొందే విధానం, ఆన్లైన్లో మాట్లాడే స్వేచ్ఛ, AI వినియోగం, ఉద్యోగాల భవిష్యత్తు వంటి అంశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజాల కథలు వ్యక్తిగత విజయగాథల పరిధిని దాటి, ఆధునిక సమాజంలో అధికారం ఎలా పనిచేస్తోందనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.
అందుకే ఈ సినిమాలను కేవలం సెలబ్రిటీ బయోపిక్‌లుగా చూడలేం. ఇవి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే, తాము ఉపయోగించే టెక్నాలజీ వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలు, నిర్ణయాధికారం, బాధ్యతల గురించి ఆలోచించేలా చేయగలవు.
అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది. టెక్ కంపెనీలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న ఎంటర్నైంట్ సంస్థలు, అదే కంపెనీలను విమర్శించే సినిమాలను నిర్మించడంలో లేదా విడుదల చేయడంలో ఎంతవరకు స్వేచ్ఛగా వ్యవహరించగలవు?
Artificial సినిమా పంపిణీ చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రశ్నను ముందుకు తెచ్చాయి. అయితే, ఒక సంస్థ నిర్ణయం వెనుక నిర్దిష్ట వ్యాపార సంబంధమే కారణమని ఆధారాలు లేకుండా నిర్ధారించలేం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








