నార్త్‌లో సంచలనం.. తెలుగులో నిరాశ! ‘హనుమాన్ అంశ్’ ఎక్కడ తడబడింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక సినిమా ఒక భాషలో సంచలన విజయం సాధిస్తే.. అదే సినిమాను మరో భాషలో విడుదల చేసినప్పుడు కూడా అదే స్దాయిలో ఆదరిస్తారని భావిస్తాము. అందులోనూ సక్సెస్ అయిన సినిమా డబ్బింగ్ అనగానే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అనుకుంటాం. కానీ బాక్సాఫీస్ దగ్గర లెక్కలు ఎప్పుడూ అలా ఉండవు. హిందీలో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించటం లేదు. మినిమం ఓపినింగ్స్ రాబట్టడంలో ఫెయిలైంది.
ఉత్తర భారతదేశంలో ఆధ్యాత్మిక కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు వెనుకబడింది? హోంబలే ఫిల్మ్స్ ప్రచార వ్యూహంలో లోపమా? లేక కథలోని ఆధ్యాత్మిక నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదా?
హిందీలో బ్లాక్‌బస్టర్.. తెలుగులో మాత్రం భిన్నమైన పరిస్థితి!
నీమ్ కరోలి బాబా జీవిత ప్రేరణతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ హిందీ మార్కెట్లో భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పెట్టుబడికి వందల రెట్ల వసూళ్లు సాధించిందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అయితే, హిందీలో సాధించిన విజయం తెలుగు మార్కెట్లోనూ అదే స్థాయిలో పునరావృతమవుతుందని భావించడం కష్టమేనని ఫస్ట్ డే కలెక్షన్స్ ని చూస్తూంటే అనిపిస్తోంది.
తెలుగు వెర్షన్‌ను హోంబలే ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ సంస్థకు ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ పంపిణీ బాధ్యతలు తీసుకోవడంతో సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడింది. అయినప్పటికీ, తొలి రోజు వసూళ్లు అంచనాలను అందుకోలేదని ట్రేడ్ అంటోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం, తెలుగు వెర్షన్ తొలి రోజు నెట్ వసూళ్లు కేవలం రూ.60 లక్షలు మాత్రమే.
ప్రమోషన్లో వచ్చిన గ్యాప్.. ప్రేక్షకుల ఆసక్తిపై ప్రభావం చూపిందా?
సినిమా విడుదలకు ముందు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, పబ్లిసిటీ క్యాంపైన్ కూడా చర్చకు వస్తుంది. మొదట సెప్టెంబర్ 18న తెలుగు విడుదలను ప్రకటించినప్పటికీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 9న తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. విడుదల తేదీలో మార్పు వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని మళ్లీ పెంచడం, కొత్త ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా తెలుగు ట్రైలర్, మీడియా ఇంటర్వ్యూలు, ప్రేక్షకులకు సినిమా ప్రత్యేకతను వివరించే కార్యక్రమాలు వంటి అంశాలు ముందస్తు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తాయి. హిందీలో ఇప్పటికే విజయం సాధించిన సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా స్వయంగా థియేటర్లకు వస్తారని భావించి ఉంటే, అది సరైన వ్యూహం కాకపోవచ్చు.
ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో విజయవంతం చేయాలంటే డబ్బింగ్ మాత్రమే సరిపోదు. ఆ భాష ప్రేక్షకులకు సినిమా ఎందుకు ప్రత్యేకమో తెలియజేయాలి. అలాగని ప్రచార లోపమే ఇంత తక్కువ ఓపెనింగ్‌కు ఏకైక కారణమని చెప్పలేం.
నీమ్ కరోలి బాబా ఎవరు? తెలుగు ప్రేక్షకులకు ఇదే అసలు సమస్యా?
‘హనుమాన్ అంశ్’ కథకు కేంద్రబిందువైన నీమ్ కరోలి బాబాకు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకమైన భక్తవర్గం ఉంది. ఆయన ఆధ్యాత్మిక బోధనలు, జీవితం, అనుభవాలు అక్కడి ప్రేక్షకుల్లో చాలా మందికి ముందే పరిచయం. అలాంటి ప్రేక్షకులకు సినిమా కేవలం ఒక కథ కాదు.. తమకు విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితాన్ని తెరపై చూసే అనుభూతి.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉండవచ్చు. ఇక్కడ భక్తి సినిమాలకు ఆదరణ లేదని చెప్పలేం. రామాయణం, మహాభారతం, హనుమంతుడి కథలు, స్థానిక దేవతల చరిత్రలతో తెలుగు ప్రేక్షకులకు బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. కానీ ఉత్తర భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని చూడాలంటే, ప్రేక్షకుడికి ముందుగా ఆయన గురించి తెలియాలి, ఆసక్తి కలగాలి. ఆయన జీవితం తమకు ఎందుకు ముఖ్యం? ఆయన అనుభవాల్లో తమ జీవితానికి సంబంధించిన విషయం ఏముంది? అనే ప్రశ్నలకు సినిమా సమాధానం ఇవ్వాలి.
ఇక్కడే ప్రాంతీయ సాంస్కృతిక పరిచయం కీలకమవుతుంది. ఒక ప్రాంతంలో సహజంగా ఏర్పడే భక్తి అనుబంధాన్ని మరో ప్రాంతంలో ప్రచారం, కథనం, భావోద్వేగాల ద్వారా నిర్మించాల్సి ఉంటుంది. ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ కు ఈ సమస్య ఎదురై ఉండవచ్చు.
భక్తి ఒక్కటే సరిపోదు.. కథ ప్రేక్షకుడిని కదిలించాలి!
సినిమా ఎంత గొప్ప సందేశాన్ని చెప్పినా, అది ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లలేకపోతే థియేటర్లలో ఆదరణ పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. భక్తి ప్రధాన చిత్రాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రేక్షకులు కేవలం ఆధ్యాత్మిక సందేశం వినడానికి మాత్రమే కాకుండా, భావోద్వేగం, పాత్రల ప్రయాణం, సంఘర్షణ, ఆశ్చర్యం వంటి అంశాల కోసం కూడా సినిమా చూస్తారు.
‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ కథనశైలి కీలకంగా మారి ఉండవచ్చు. సినిమాలోని కొన్ని మ్యాజికల్ అంశాలను తగ్గించి, భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది.
యువ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే సినిమా సందేశం కంటే ఆ సందేశాన్ని ఎలా చెబుతున్నామన్నది కూడా ముఖ్యం. ఆధ్యాత్మికతను ఆసక్తికరమైన కథగా మలచగలిగితే, భక్తి సినిమాలు చూడని ప్రేక్షకులు కూడా ఆకర్షితులవుతారు. కానీ కథనం ఎక్కువగా బోధనాత్మకంగా అనిపిస్తే, సినిమా పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా థియేటర్‌కు వెళ్లాలా వద్దా అని ఆలోచించే అవకాశం ఉంటుంది.
హిందీ వెర్షన్ ముందే చూసేశారు.. తెలుగు విడుదలకు ఇది మరో అడ్డంకా?
తెలుగు వెర్షన్‌కు మరో సమస్య హిందీ వెర్షన్ ముందుగానే అందుబాటులో ఉండటం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ ఇప్పటికే ప్రదర్శితమైంది. హిందీ సినిమాలు చూసే అలవాటు ఉన్న ప్రేక్షకులు ఇప్పటికే ఆ వెర్షన్‌ను సబ్‌టైటిల్స్‌తో చూసి ఉంటే, మళ్లీ తెలుగు డబ్బింగ్ కోసం టికెట్ కొనాలనే ఆసక్తి ఉండకపోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో బహుభాషా ప్రేక్షకులు ఉండటంతో ఈ అంశం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇక్కడ హోంబలే ఫిల్మ్స్‌కు ఒక ముఖ్యమైన మార్కెటింగ్ ఛాలెంజ్ ఉంది. హిందీలో సినిమాను చూసిన ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం కంటే, హిందీ వెర్షన్ చూడని కొత్త ప్రేక్షకులను ఆకర్షించే ప్రచారం అవసరం. నీమ్ కరోలి బాబా జీవితంలోని ఆసక్తికరమైన అంశాలు, కథలోని భావోద్వేగాలు, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అనుభవాలను ముందుకు తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
తొలి రోజు వసూళ్లే అంతిమ తీర్పు కాదు!
ఒక సినిమా తొలి రోజు తక్కువ వసూళ్లు సాధించిందని వెంటనే దాన్ని పరాజయంగా ప్రకటించలేం. ముఖ్యంగా హిందీలో నెమ్మదిగా మొదలై ప్రేక్షకుల స్పందనతో వసూళ్లు పెంచుకున్న సినిమా విషయంలో వీకెండ్ కలెక్షన్లు, మౌత్ టాక్ కీలకం. శనివారం, ఆదివారం ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా? సోమవారం నుంచి కలెక్షన్లు నిలబడతాయా? థియేటర్లు సినిమాకు తగినన్ని షోలు కొనసాగిస్తాయా? అన్న అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.
అయితే, తెలుగు మార్కెట్లో కొత్త సినిమాల విడుదలలు వరుసగా ఉంటే, ఎక్కువ కాలం థియేటర్లలో నిలబడటం సవాలుగా మారుతుంది. తొలి వారాంతంలోనే స్పందన బలహీనంగా ఉంటే షోల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. అప్పుడు మంచి మౌత్ టాక్ వచ్చినా దాన్ని వసూళ్లుగా మార్చుకునే అవకాశం పరిమితమవుతుంది.
ఇదే హిందీ, తెలుగు మార్కెట్ల మధ్య ఉండే ముఖ్యమైన వ్యాపారపరమైన తేడా. ఒక మార్కెట్లో సినిమా ఇప్పటికే భారీ విజయాన్ని సాధించినా, మరో మార్కెట్లో ప్రేక్షకుల అభిరుచి, ప్రచారం, పోటీ, థియేటర్ల లభ్యత వంటి అంశాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి.
హోంబలే ఫిల్మ్స్‌కు ఈ సినిమా ఏం నేర్పిస్తోంది?
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి సినిమాల విజయాలు హోంబలే ఫిల్మ్స్‌కు తెలుగు మార్కెట్లో గుర్తింపును తెచ్చాయి. కానీ ఒక నిర్మాణ సంస్థ బ్రాండ్ ఇమేజ్ అన్ని రకాల సినిమాలకు ఒకే స్థాయిలో ఓపెనింగ్స్ తీసుకురాదు. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు వచ్చే ప్రేక్షకుల స్పందన, ఆధ్యాత్మిక నేపథ్యంతో సాగే సినిమాలకు వచ్చే స్పందన వేర్వేరుగా ఉండవచ్చు.
‘హనుమాన్ అంశ్’ను తెలుగులో విడుదల చేసేటప్పుడు హిందీ బాక్సాఫీస్ విజయాన్ని ప్రధానంగా చూపించడం కంటే, తెలుగు ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచే ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటే బాగుండేది. విడుదల తేదీలో మార్పు వచ్చిన తర్వాత ప్రచారాన్ని మరింత బలంగా పునఃప్రారంభించడం, సినిమా కథలోని ప్రత్యేకతను స్పష్టంగా పరిచయం చేయడం ఉపయోగపడేవి.
ఏదైమైనా…
హిందీలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా కదా అని, తెలుగులోనూ అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశించడం వ్యాపారపరమైన అంచనా మాత్రమే. ప్రతి భాషకు ప్రత్యేకమైన ప్రేక్షకుల అభిరుచులు, సాంస్కృతిక పరిచయాలు, మార్కెటింగ్ అవసరాలు ఉంటాయి. ఒక మార్కెట్లోని విజయాన్ని మరో మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే అక్కడి ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపిస్తున్నామనే ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి.








