AI ని ఈ 3 విషయాల్లో వాడితే జైలుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక చిన్న ప్రశ్న అడిగితే సెకన్లలో సమాధానం.. పెద్ద విషయాన్ని అడిగితే సింపుల్‌గా వివరణ.. ఏదైనా రాయమంటే రెడీ చేసి చేతిలో పెట్టేస్తుంది! అందుకే చాలామందికి ChatGPT, జెమినీ వంటి అనేక AI చాట్బాట్లు ఇప్పుడు గో-టు ఫ్రెండ్స్ అయిపోయాయి. గూగుల్‌లో వెతకడం దగ్గర నుంచి ఆఫీసు పనులు, చదువులు, కోడింగ్ వరకు అన్నింటికీ AIనే అడుగుతున్నారు. కొందరైతే తమకు వచ్చిన వ్యక్తిగత సమస్యలను కూడా AIతోనే షేర్ చేసుకుంటున్నారు.
కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. AI చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చిందని అది చెప్పేదంతా నిజమేనని అనుకోవచ్చా? తప్పు సమాచారాన్ని కూడా నిజమైన విషయంలా చెప్పగలిగే టెక్నాలజీని మనం ఎంతవరకు నమ్మాలి? ముఖ్యంగా కొన్ని విషయాల్లో AI ఇచ్చిన సమాధానాన్ని గుడ్డిగా ఫాలో అయితే, చిన్న పొరపాటు కాస్తా పెద్ద సమస్యగా మారొచ్చు. అందుకే AIని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేకపోయినా, దాని సాయం తీసుకునేటప్పుడు మాత్రం ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
1. లాయర్ అవసరమైన చోట ChatGPTని నమ్మితే చిక్కుల్లో పడొచ్చు!
ఒకవేళ మీకు ఉద్యోగంలో అన్యాయం జరిగిందనుకోండి.. మీ హక్కుల గురించి తెలుసుకోవాలనిపించొచ్చు. లేదంటే బిజినెస్ మొదలుపెట్టేటప్పుడు ఓ అగ్రిమెంట్ అర్థం కాకపోవచ్చు. వెంటనే ChatGPT లేదా మరొకటో ఓపెన్ చేసి ప్రశ్న అడిగేస్తాం. అది కూడా చక్కగా పాయింట్ల వారీగా సమాధానం ఇచ్చేస్తుంది. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సమాధానంలోనే అసలు సమస్య దాగి ఉండొచ్చు.
ఎందుకంటే, AI కొన్నిసార్లు లేని చట్టాలను ఉన్నట్టుగా చెప్పొచ్చు, అసలు ఉనికిలో లేని కోర్టు తీర్పులను ప్రస్తావించొచ్చు లేదా ఒక చట్టానికి తప్పు అర్థం చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని కోర్టు కేసుల్లో AI సృష్టించిన తప్పుడు న్యాయపరమైన ఆధారాలు సమస్యలకు దారితీశాయి. ఇలాంటి తప్పులు కోర్టులో బయటపడితే జరిమానాలు, పరువు నష్టం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందుకే చట్టపరమైన విషయాల్లో AIని ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ దాని సమాధానాన్నే నమ్ముకుని కోర్టులో వాదించడం, ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం రిస్క్‌తో కూడుకున్నది. AI మీకు చట్టాన్ని అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేయొచ్చు.. కానీ మీ కేసు బాధ్యతను అది తీసుకోదు కదా!
2. ఆరోగ్యం, మానసిక సమస్యలు.. AIతో ప్రయోగాలు వద్దు!
తలనొప్పి వచ్చినా, ఏదైనా లక్షణం కనిపించినా చాలామందికి మొదట గుర్తొచ్చేది ఇంటర్నెట్. ఇప్పుడు ఆ స్థానంలో AI చాట్బాట్లు కూడా వచ్చేశాయి. లక్షణాలు చెబితే ఏ సమస్య ఉండొచ్చో వివరిస్తుంది. డైట్ ప్లాన్ అడిగితే తయారు చేస్తుంది. మందుల గురించి ప్రశ్నిస్తే వివరాలు చెబుతుంది. ఇదంతా సౌకర్యంగానే ఉంటుంది. కానీ AI చెప్పిన ప్రతి ఆరోగ్య సలహా మీకు సరిపోతుందని మాత్రం అనుకోకూడదు.
ఒక మందు మీకు సరిపోతుందా లేదా, మరో మందుతో కలిపి తీసుకోవచ్చా, మీ ఆరోగ్య పరిస్థితికి ఏ ఆహారం మంచిది వంటి విషయాల్లో వ్యక్తిగత వివరాలు చాలా ముఖ్యం. AIకి ఆ వివరాలన్నీ తెలియకపోవచ్చు. తెలిసినా వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. ముఖ్యంగా మందుల మోతాదులు మార్చడం, వైద్య చికిత్స ఆపేయడం లేదా ప్రమాదకరమైన పదార్థాలను ప్రయోగించడం వంటి నిర్ణయాలు తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు.
మానసిక ఆరోగ్యం విషయంలోనూ ఇదే జాగ్రత్త అవసరం. మన సమస్యలను వినడానికి AI ఉపయోగపడొచ్చు. కానీ తీవ్రమైన డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు లేదా ఇతర మానసిక సంక్షోభాల సమయంలో అది వైద్య నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అర్హత కలిగిన వైద్యుడిని లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం.
సింపుల్‌గా చెప్పాలంటే.. AI ఇచ్చిన రెసిపీ తప్పితే వంట మాత్రమే పాడవుతుంది. కానీ వైద్య సలహా తప్పితే ఆరోగ్యమే ప్రమాదంలో పడొచ్చు!
3. మీ సీక్రెట్స్ అన్నీ AIకి చెప్పేస్తున్నారా?
ఇది చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం. ఆఫీసు పని త్వరగా పూర్తి చేయాలని కంపెనీకి చెందిన రహస్య డాక్యుమెంట్‌ను AIలో అప్లోడ్ చేయడం, ఒక రిపోర్ట్ తయారు చేయడానికి కస్టమర్ల వివరాలు ఇవ్వడం, లేదా పర్సనల్ సమస్యను వివరించడానికి బ్యాంకు సమాచారం, గుర్తింపు పత్రాల వివరాలు పంచుకోవడం.. ఇవన్నీ సౌకర్యంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ప్రైవసీ రిస్క్ ఉంది.
మీరు ఉపయోగిస్తున్న AI సర్వీస్ ఏ సమాచారాన్ని సేకరిస్తుంది, ఎంతకాలం నిల్వ చేస్తుంది, ఆ డేటాను ఎలా ఉపయోగిస్తుంది అనే విషయాలు దాని పాలసీలు, మీ అకౌంట్ సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి AIలో టైప్ చేసిన ప్రతి విషయం తప్పనిసరిగా బయటకు లీక్ అవుతుందని చెప్పలేం. అదే సమయంలో, ఏదైనా సర్వీస్‌లో సమాచారం ఇచ్చినంత మాత్రాన అది పూర్తిగా రహస్యంగా ఉంటుందని కూడా అనుకోకూడదు.
ముఖ్యంగా పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాల సమాచారం, కంపెనీ ట్రేడ్ సీక్రెట్స్, కస్టమర్ల వ్యక్తిగత డేటా వంటి వాటిని అనవసరంగా AIతో పంచుకోకండి.మీరు అక్కడ ఎంటర్ చేసే సమాచారం ఆ చాట్‌బాట్ సర్వర్లలో నిల్వ కావచ్చు లేదా వాటి కొత్త మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు సైబర్ దాడుల వల్ల ఈ డేటా బయటకు లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ చిన్న పొరపాటు వల్ల మీరు ఆఫీసు ఉద్యోగం పోగొట్టుకోవాల్సి రావచ్చు, లేదా కంపెనీ రహస్యాలు బయటపడి తీవ్ర నష్టం జరగవచ్చు. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను ఉపయోగించి మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది.
ఆఫీసు పనుల కోసం ఉపయోగిస్తున్నప్పుడు మీ సంస్థ అనుమతించిన AI టూల్స్‌నే వాడటం మంచిది. రహస్య సమాచారం అవసరమైతే, గుర్తించగలిగే వివరాలను తొలగించి, అవసరమైనంత సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి.
ఎందుకంటే ఒకసారి సున్నితమైన సమాచారం తప్పు చేతుల్లోకి వెళ్తే, అది వ్యక్తిగత మోసాలకు లేదా కంపెనీకి ఆర్థిక నష్టానికి దారితీయొచ్చు. AI మీ పని ఈజీ చేయాలి.. మీ పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ చేయకూడదు కదా!
ఫైనల్‌గా ఒక్క విషయం గుర్తుంచుకోండి!
AIని వాడటం తప్పు కాదు. నిజానికి, దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో పనులు వేగంగా, సులభంగా పూర్తి చేయొచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఐడియాలు తెచ్చుకోవచ్చు, కఠినమైన కాన్సెప్ట్‌లను సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. కానీ AI ఇచ్చే ప్రతి సమాధానాన్ని ఫైనల్ వెర్డిక్ట్లా తీసుకోవడమే సమస్య.
చట్టపరమైన విషయాల్లో న్యాయవాదిని, ఆరోగ్య సమస్యల్లో వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వ్యక్తిగత లేదా కంపెనీ రహస్యాల విషయంలో మాత్రం ఏ టూల్ ఉపయోగిస్తున్నా ప్రైవసీని దృష్టిలో పెట్టుకోవాలి.
AI ఎంత స్మార్ట్ అయినా.. చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. దాన్ని మనకు సహాయం చేసే టూల్‌గా వాడుతున్నామా, లేక మన ఆలోచనల స్థానంలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామా? అసలు విషయం ఇది తెలుసుకోవటం లోనే ఉంది!లేకుంటే చిక్కుల వలయమే మీ ముందు ఉంటుంది.








