ఒక్క సినిమాతో మార్కెట్లో మళ్లీ సత్తా చాటాలని దిల్ రాజు ప్లాన్?
టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు(Dil Raju)కు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈ ఇయర్ ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారీ అంచనాలతో రిలీజైన సినిమాలు నిరాశపరచడంతో ఆయన తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రామాయణ(ramayana) సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది మరో భారీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్గా తన మార్కెట్ పరిధిని చాటుకునే అవకాశంగానూ కనిపిస్తోంది.
నితేశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో రణ్బీర్ కపూర్(ranbir kapoor), సాయిపల్లవి(Sai pallavi), యష్(yash) తదితరులు నటించిన ఈ పౌరాణిక ఇతిహాసంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన సౌత్ థియేట్రికల్ రైట్స్ యష్ చేతిలో ఉండగా, తెలుగు రాష్ట్రాల రిలీజ్ బాధ్యతలను దిల్ రాజు చేపడుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను ఇక్కడ ఎంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తారు? ప్రేక్షకుల ఆదరణను బట్టి కలెక్షన్లు ఏ స్థాయికి చేరుకుంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
నవంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించనున్నారు. అయితే భారీ రిలీజ్ ఒక్కటే సక్సెస్ కు కొలమానం కాదు. డిస్ట్రిబ్యూషన్ డీల్స్, టికెట్ కలెక్షన్లు, ఆడియన్స్ రెస్పాన్స్ కీలకంగా మారనున్నాయి. రామాయణ రిజల్ట్ దిల్ రాజు మార్కెట్ ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.








