దెయ్యాలు తెల్లటి దుస్తుల్లోనే ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక అసలు కథ ఇదే!
అర్ధరాత్రి 2 గంటలు. మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి చూస్తే.. హాలులో ఓ తెల్లటి ఆకారం కనిపించింది. తల నుంచి కాళ్ల వరకు తెల్లటి దుప్పటి కప్పుకుని, కదలకుండా నిలబడింది. మీరు ఒక్క అడుగు ముందుకు వేయగానే.. అది కూడా కదిలింది!
గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. వెంటనే ఫ్లాష్‌లైట్ దాని ముఖం మీద పడేశారు. అంతే.. ఆ ఆకారం దుప్పటి తీసి నవ్వింది. అది మీ ఫ్రెండ్! మిమ్మల్ని భయపెట్టడానికి దెయ్యం వేషం వేసుకొచ్చాడు. మీరు ఒక్కసారిగా నవ్వేసారు..ఆ తర్వాత కబుర్లు చెప్పి ఆ ఫ్రెండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు తెలిసింది. ఆ ఫ్రెండ్ ..మీ దగ్గరకు రాకముందే యాక్సిడెంట్ లో చనిపోయాడని..థ్రిల్ గా ఉందా, భయం వేసిందా… దెయ్యం కథలన్ని ఇలాగే ఉంటాయని అనుకుని నిట్టూర్చారా.
అది ప్రక్కన పెడితే.. దెయ్యాలన్నీ తెల్లటి చీర కట్టుకునో లేక తెల్లటి డ్రస్ వేసుకునే ఎందుకు కనపడతాయి. అవి సినిమాలైనా, బొమ్మలైనా, నిజ జీవితమైనా? ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ తెల్లటి దెయ్యం వేషం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. దెయ్యం అనగానే తెల్లటి దుప్పటి కప్పుకున్న ఆకారమే ఎందుకు గుర్తొస్తుంది? అసలు దెయ్యాలకు ఈ డ్రెస్ కోడ్ ఎవరు ఫిక్స్ చేశారు?
మొదట్లో దెయ్యాలు ఇలా ఉండేవి కాదు!
అప్పట్లో దెయ్యాలు…
ఇప్పుడు దెయ్యం అంటే తెల్లటి దుప్పటి, రెండు కళ్ల దగ్గర రంధ్రాలు, గాలిలో తేలుతూ వచ్చే ఆకారం. కానీ పాతకాలంలో దెయ్యాల డిజైన్ ఇలా ఉండేది కాదు. యూరప్‌లోని మధ్యయుగాల చిత్రాల్లో వాటిని అస్థిపంజరాలుగా, కుళ్లిపోయిన శవాలుగా, సమాధుల నుంచి తిరిగొచ్చిన మృతదేహాలుగా చూపించేవారు.
ఎందుకంటే అప్పట్లో మరణించినవారు తిరిగి వస్తే, తమ మృతదేహాల రూపంలోనే కనిపిస్తారనే ఊహ ఉండేది. మరణం అంటే ఎంత భయంకరమో గుర్తుచేయడానికి కూడా ఇలాంటి చిత్రాలను ఉపయోగించేవారు.
మరి ఆ భయంకరమైన శవాల రూపం నుంచి దెయ్యాలు తెల్లటి దుప్పటి కప్పుకున్న ఆకారాలుగా ఎలా మారాయి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
తెల్లటి దుప్పటి వెనుక అసలు సీక్రెట్!
పాతకాలంలో మరణించినవారి మృతదేహాలను వస్త్రాలతో చుట్టి ఖననం చేసేవారు. వీటిని బరియల్ ష్రౌడ్స్ అంటారు. ఆ వస్త్రాలు దెయ్యాల చిత్రణలోనూ కనిపించడం మొదలైంది. చనిపోయిన వ్యక్తి ఆత్మ తిరిగి వస్తే, తనను చుట్టిన వస్త్రాలతోనే కనిపిస్తుందనే ఊహ క్రమంగా ప్రజల్లోకి వెళ్లింది.
తర్వాత తెల్లటి వస్త్రం కప్పుకుంటే దెయ్యంలా కనిపించవచ్చని మనుషులు కూడా గుర్తించారు. ముఖ్యంగా చీకట్లో తెల్లటి ఆకారం కనిపిస్తే భయం కలిగించడం ఈజీ. దుప్పటి కింద ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించడం కూడా కష్టం.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. 15వ శతాబ్దంలోనే కొందరు దొంగలు తెల్లటి వస్త్రాలు కప్పుకుని దెయ్యాల్లా నటిస్తూ ప్రజలను భయపెట్టి దోచుకునేవారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అంటే దెయ్యం వేషం అనేది హారర్ సినిమాల కోసం పుట్టిన ఐడియా కాదు. నిజ జీవితంలోనూ కొందరు దాన్ని మోసాలకు ఉపయోగించారు!
1804లో దెయ్యం అనుకున్నాడు.. కానీ అక్కడ ఉన్నది మనిషి!
ఇప్పుడు ఒకసారి 1803–1804 మధ్యకాలానికి వెళ్దాం. లండన్‌లోని హామర్స్మిత్ ప్రాంతంలో ఓ తెల్లటి దెయ్యం తిరుగుతోందనే వార్తలు వ్యాపించాయి. పొడవుగా, తెల్లటి దుస్తులు ధరించిన భయంకరమైన ఆకారాన్ని చూశామని కొందరు చెప్పడంతో స్థానికులు భయపడిపోయారు. పరిస్థితి ఎంత సీరియస్ అయిందంటే, ప్రజలు ఆయుధాలతో రాత్రిపూట కాపలా కాసే బృందాలను ఏర్పాటు చేశారు.
ఇది ఏదో హారర్ సినిమా సీన్ కాదు. నిజంగా జరిగిన ఘటన!
1804 జనవరి 3న ఫ్రాన్సిస్ స్మిత్ అనే వ్యక్తి తెల్లటి పని దుస్తులు ధరించిన థామస్ మిల్‌వుడ్ అనే ఇటుక పనివాడిని ఆ దెయ్యంగా పొరబడ్డాడు. భయంతో అతడిని కాల్చి చంపాడు.
కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ దెయ్యమే లేదు. తెల్లటి పని దుస్తులు ధరించిన ఓ సాధారణ వ్యక్తి మాత్రమే ఉన్నాడు. దెయ్యం ఉందనే భయం, ఒక మనిషి ప్రాణాన్ని తీసింది.
ఈ ఘటన తెల్లటి దెయ్యం రూపం వెనుక ఉన్న మరో కోణాన్ని చూపిస్తుంది. మనం చూసేది నిజంగా ఏమిటన్నదానికంటే, మనం ఏం నమ్ముతున్నామన్నది కొన్నిసార్లు మన ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. చీకట్లో కనిపించిన ఓ తెల్లటి ఆకారాన్ని మన మెదడు వెంటనే దెయ్యంగా ఊహించుకోవచ్చు. కానీ ఆ ఊహ నిజం కావాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
దెయ్యాలు పారదర్శకంగా ఎప్పుడు మారాయి?
తెల్లటి దుప్పటి ఒక్కటే కాదు.. దెయ్యాలు పారదర్శకంగా కనిపించే ఐడియా కూడా ఒకేసారి రాలేదు. 18వ శతాబ్దం చివర్లో ఫాంటస్మగోరియా అనే వినోద ప్రదర్శనల్లో మ్యాజిక్ లాంతర్లతో దెయ్యాల ఆకారాలను ప్రొజెక్ట్ చేసేవారు. అవి గాలిలో తేలుతూ, కదులుతూ, మాయమవుతున్నట్లు కనిపించేవి.
తర్వాత 19వ శతాబ్దంలో రంగస్థల మాయాజాలం మరింత అభివృద్ధి చెందింది. 1860లలో ప్రసిద్ధి చెందిన పెప్పర్స్ ఘోస్ట్ అనే టెక్నిక్‌తో గాజు, కాంతి, తెర వెనుక దాగి ఉన్న నటుడిని ఉపయోగించి పారదర్శకమైన దెయ్యాన్ని వేదికపై చూపించేవారు.
ఒక్కసారి ఊహించండి.. ప్రేక్షకులు చూస్తున్న వేదికపై ఓ వ్యక్తి నెమ్మదిగా ప్రత్యక్షమై, కళ్ల ముందే మాయమైపోతున్నాడు. అప్పట్లో ఇది ఎంత అద్భుతంగా, భయానకంగా అనిపించి ఉంటుందో!
ఇలా దెయ్యం అంటే తెల్లటి వస్త్రం కప్పుకున్న మనిషి మాత్రమే కాదు, గోడల గుండా వెళ్లగలిగే, పారదర్శకంగా కనిపించే అతీంద్రియ ఆకారం అనే ఊహ కూడా బలపడింది.
హాలీవుడ్, కార్టూన్లు ఈ దెయ్యం డిజైన్‌ను వైరల్ చేశాయి!
ఒకప్పుడు తెల్లటి దెయ్యం అనేది కథల్లో, నాటకాల్లో కనిపించే రూపం. కానీ సినిమాలు, కార్టూన్లు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశాయి.
1937లో డిస్నీ విడుదల చేసిన Lonesome Ghosts కార్టూన్లో తెల్లటి, పారదర్శకమైన దెయ్యాలు కనిపించాయి. 1945లో వచ్చిన Casper the Friendly Ghost ఆ రూపానికి అమాయకమైన, స్నేహపూర్వకమైన గుర్తింపును ఇచ్చింది. ఇక 1966లో It’s the Great Pumpkin, Charlie Brownలో చార్లీ బ్రౌన్ వేసుకున్న తెల్లటి దెయ్యం వేషం కూడా ఈ రూపాన్ని మరింత ప్రజాదరణలోకి తీసుకొచ్చింది.
తర్వాత హారర్ సినిమాలు, టీవీ షోలు, కామిక్స్, హాలోవీన్ కాస్ట్యూమ్స్.. ఇలా ఎక్కడ చూసినా అదే డిజైన్ కనిపించింది. తరతరాలుగా ప్రేక్షకులు ఆ రూపాన్ని చూస్తూ పెరిగారు. ఫలితంగా దెయ్యం అంటే తెల్లటి దుప్పటి కప్పుకున్న ఆకారం అనే ఇమేజ్ మన మెదళ్లలో ఫిక్స్ అయిపోయింది.
ఒక విధంగా చెప్పాలంటే, సినిమాలు దెయ్యాల రూపాన్ని కనిపెట్టలేదు. అప్పటికే ఉన్న ఊహకు ఒక స్టాండర్డ్ డిజైన్ ఇచ్చాయి!
మరి దెయ్యాలు నిజంగా తెల్లగానే ఉంటాయా?
దెయ్యాలను చూసినట్లు చెప్పిన వ్యక్తుల కథనాల్లో తెల్లటి ఆకారాలతో పాటు బూడిదరంగు రూపాలు, చీకటి నీడలు, సాధారణ మనుషుల్లా కనిపించే ఆకారాల వర్ణనలు కూడా ఉన్నాయి. అంటే దెయ్యాలకు ఒకే రంగు ఉంటుందని చెప్పడానికి ఆధారాలు లేవు.
అంతేకాదు, దెయ్యాలు నిజంగా ఉన్నాయని నిరూపించే విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. తెల్లటి దెయ్యం అనేది చరిత్ర, సంస్కృతి, మానవ ఊహ, వినోద ప్రపంచం కలిసి నిర్మించిన ఒక ప్రసిద్ధ రూపం.
ఒకప్పుడు మరణించినవారి వస్త్రాల నుంచి మొదలైన ఆలోచన.. తర్వాత దొంగల వేషాల్లో కనిపించింది. 1804లో ఒక మనిషి ప్రాణం తీసిన భయంగా మారింది. ఆ తర్వాత రంగస్థల మాయాజాలం, సినిమాలు, కార్టూన్ల ద్వారా ప్రపంచమంతా గుర్తుపట్టే ఇమేజ్‌గా మారిపోయింది.
సో.. నెక్స్ట్ టైమ్ చీకట్లో తెల్లటి దుప్పటి కప్పుకున్న ఆకారం కనిపిస్తే వెంటనే దెయ్యమని ఫిక్స్ అయిపోకండి. అది పారానార్మల్ ఎంటిటీ కాకపోవచ్చు.. మీ ఫ్రెండ్ చేసిన ప్రాంక్ కూడా కావచ్చు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








