ఎలాన్ మస్క్ భయపడ్డాడా? యూట్యూబ్, ఇనిస్ట్రాలని భయపెట్టాడా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎలాన్ మస్క్.. అంటేనే ఒక సెన్సేషన్. ఆయన ఏం చేసినా ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది.! రోదసిలోకి రాకెట్లు వదిలినా, ట్విట్టర్‌ని కొనేసి రాత్రికి రాత్రే ‘X’ అని పేరు మార్చేసినా, పొలిటికల్ స్టేజిలపై ఊగిపోయినా.. ఆయన ఏది చేసినా ఒక తీవ్రమైన వివాదమే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పైగా అత్యంత ప్రయాస పడి మరీ కోరి వివాదాలు కొని తెచ్చుకునే ఆ అసాధారణ బిలియనీర్ అసలు రంగు బయటపెడుతూ ఒక డాక్యుమెంటరీ వస్తోందంటే ప్రపంచం ఊరుకుంటుందా? జనం ఏ స్థాయిలో ఎదురుచూస్తారో ఊహించగలరా? అసలు ఆ అంచనాలే ఇప్పుడు సోషల్ మీడియా అల్గారిథమ్‌ల పునాదులను కదిలించేస్తున్నాయి!
ట్రైలర్ పడగానే బ్లాక్ చేశారు.. ఇంటర్నెట్లో అసలు ఏం జరుగుతోంది?
ఆస్కార్ విజేత అలెక్స్ గిబ్నీ రూపొందించిన ‘Musk’ డాక్యుమెంటరీ ఇంకా థియేటర్ల మొహం చూడనే లేదు, కానీ అప్పుడే సోషల్ మీడియా వేదికల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమా ప్రమోషన్ కోసం స్టూడియో వాళ్లు ట్రైలర్‌ను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, చివరికి మస్క్ సొంత ప్లాట్‌ఫారమ్ ‘X’లో పెయిడ్ యాడ్స్‌గా వేయడానికి వెళ్తే.. డిజిటల్ దిగ్గజాలన్నీ ఏకమై “నో వే.. ఈ యాడ్స్ వేసేదే లేదు!” అని ముఖం మీదే తలుపులు వేసేశాయి! ఒక టాప్ బిలియనీర్ జీవితంపై తీసిన సినిమా ప్రచారాన్ని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ఇలా కుమ్మక్కై తొక్కిపెట్టాలని చూడటం ఏంటి? ఇక్కడ జరుగుతున్న అసలు కథేంటి? మస్క్ రాజకీయాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రశ్నించే సరికి ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భయపడిపోయాయా? లేక ఆయన పవర్‌కు లొంగిపోయాయా అనే సందేహం సగటు ఇంటర్నెట్ వినియోగదారుడిలో మొదలైంది.
రాజకీయ సీన్లు ఉన్నాయని సెన్సార్ హడావుడి!
ఈ వివాదానికి ప్రధాన కారణం ఏమిటి అనేది బయిటకు రాలేదు కానీ…—ట్రైలర్లో 2024 అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి మస్క్ రచ్చ చేసిన సీన్లు ఉండటమే బ్లాక్ చేయటానికి కారణం అని సాకు చూపెడుతున్నారు! ఆ సీన్స్ వల్ల పొలిటికల్ యాడ్స్ అంటూ సోషల్ మీడియా ఆటోమేటెడ్ సెన్సార్ బోర్డులు ఆటోమేటిక్‌గా ఈ యాడ్స్‌ను బ్లాక్ చేసేశాయని వాదిస్తున్నారు. “ఇది రాజకీయ ప్రచారం కాదు రా బాబోయ్.. ఒక డాక్యుమెంటరీ సినిమా ప్రమోషన్!” అని స్టూడియో వాళ్లు నెత్తీ నోరూ మొత్తుకుని, అప్పీల్స్ మీద అప్పీల్స్ చేస్తే కానీ అసలు విషయం బోధపడలేదు. జనం నుంచి విపరీతమైన ట్రోలింగ్, నిరసనలు వ్యక్తమవ్వడంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లు దిగివచ్చి.. “అయ్యో, సిస్టమ్ ఏదో పొరపాటు చేసింది” అని సాకులు చెప్తూ చివరకు వెనక్కి తగ్గాయి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ ఓకే అంది.. కానీ టిక్‌టాక్, ‘X’ ఇంకా భయపడుతున్నాయా?
యూట్యూబ్, మెటాలు బాహాటంగా క్షమాపణలు చెప్పుకుని యాడ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే టిక్‌టాక్, అలాగే స్వయంగా ఎలాన్ మస్క్ యాజమాన్యంలో నడుస్తున్న ‘X’ (ట్విట్టర్) మాత్రం ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీ యాడ్స్‌ను ప్రసారం చేయడానికి పచ్చజెండా ఊపలేదు! భావప్రకటన స్వేచ్ఛ గురించి గంటల కొద్దీ మైకుల్లో మాట్లాడే మస్క్ ఏలుబడిలోని ‘X’ లోనే, ఆయన గుట్టు విప్పే సినిమా యాడ్ పడకపోవడం ఎంతటి విడ్డూరం? అని అంటోంది అమెరికా మీడియా.
మస్క్ ప్రతీకారం, బెదిరింపులు నిజమేనా?
దర్శకుడు అలెక్స్ గిబ్నీ ఈ డాక్యుమెంటరీని ప్రకటించినప్పటి నుంచే మస్క్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. దీన్ని ఒక “హిట్ పీస్” (తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నుతున్న కుట్ర) అని మస్క్ బహిరంగంగానే విమర్శించాడు. అంతేకాకుండా, తన వ్యాపారాలను (ఉదాహరణకు స్టార్‌లింక్) తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఈ సినిమా టీమ్‌ను హెచ్చరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. స్వయంగా ఆయన యాజమాన్యంలో ఉన్న ‘X’ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్ ఈ సినిమా ట్రైలర్ యాడ్స్‌ను ప్లే చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. సరికాదా, ఈ సినిమాను పంపిణీ చేస్తున్న ‘బ్లీకర్ స్ట్రీట్’ సంస్థకు చెందిన రాబోయే ఇతర ఏ సినిమాల యాడ్స్‌ను కూడా ‘X’ లో రన్ చేయబోమని స్టూడియోతో మాట్లాడటానికి కూడా నిరాకరించింది. దీన్ని బట్టి, మస్క్ తన సొంత ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఈ సినిమా ప్రచారాన్ని కట్టడి చేయడానికి గట్టిగానే ప్రయత్నించాడని అర్థమవుతోంది.
మొత్తంగా చూస్తే:
ఎలాన్ మస్క్ ఈ డాక్యుమెంటరీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట నిజమే. తన సొంత ప్లాట్‌ఫారమ్ ‘X’ ద్వారా ప్రచారాన్ని అడ్డుకోగలిగినా, మిగిలిన బిగ్ టెక్ సంస్థలు (యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్) పబ్లిక్ ప్రెజర్, మీడియా విమర్శల దెబ్బకు వెనక్కి తగ్గక తప్పలేదు. ప్రస్తుతానికి టిక్‌టాక్, ‘X’ వేదికలు మాత్రం ఈ యాడ్స్‌ను ప్రసారం చేయడానికి నిరాకరిస్తూనే ఉన్నాయి.
అక్టోబర్ 9న అసలు సినిమా!
టెస్లా, స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ మాత్రమే కాదు.. వాషింగ్టన్ రాజకీయాలను, అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించేలా మస్క్ సాధిస్తున్న అపారమైన అధికారం వెనుక ఉన్న అసలు సత్యాలను ఈ సినిమా నిర్భయంగా ప్రశ్నించబోతోంది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘Musk’ డాక్యుమెంటరీ, రాకముందే సోషల్ మీడియా సైట్ల డొల్లతనాన్ని, వాటి భయాలను ప్రపంచం ముందు ఉంచేసింది. సినిమా విడుదలయ్యాక ఇంటర్నెట్ వేదికగా ఇంకెన్ని సంచలనాలు, మరెన్ని వివాదాలు రాజనుకున్నాయో వేచి చూడాల్సిందే!








