తెలంగాణలో వరుస ఎన్నికలు.. పార్టీలకు సవాలు!
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నికలు రాబోతున్నాయి. ఖైరతాబాద్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల పోరు, గ్రాడ్యుయేట్ ఎమ్ఎల్సి ఎన్నికలు.. ఇలా వరుసగా ఎన్నికల మూడ్ రాబోతోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికలను ఎదుర్కోవడంలో బిజీ అవుతున్నాయి. అన్ని పార్టీలూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, విపక్ష బీజేపీకి కూడా ఈ వరుస ఎన్నికలు గట్టి సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఉపఎన్నిక, జిహెచ్ఎంసి, మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని పార్టీలకూ ఒక సెమీ-ఫైనల్స్ లాంటివి.
అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, రాబోయే ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే తీర్పు అని చెప్పొచ్చు. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీ ప్రతిష్టను పెంచినప్పటికీ ఇప్పుడు ఖైరతాబాద్ ఉపఎన్నిక రూపంలో మరో పెద్ద సవాల్ ఎదుర్కోబోతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హత వేటు, కోర్టుల తీర్పులు రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు వ్యతిరేకతను ఎదుర్కొనే వ్యూహంలో కాంగ్రెస్ నిమగ్నమైంది.
ఇక అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి గులాబీ పార్టీకి ఇదొక చక్కటి అవకాశం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్ఎల్సి ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తన పూర్వవైభవాన్ని సాధించాలని చూస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తూ, నైతికంగా పైచేయి సాధించాలని ఆశిస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాలు, మున్సిపల్ ఎన్నికల్లో బలమైన పునాదులు వేసుకోవడం ద్వారా అర్బన్ ప్రాంతాల్లో తన పట్టును మరింత పెంచుకోవాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందనేది బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండటం వల్ల పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతుందనే విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్, ప్రచారాలు, రాజకీయ హామీల హోరులో అసలు అభివృద్ధి పనులు మరుగునపడే ప్రమాదం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ల కాలపరిమితి ముగియడం, కొత్తగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వంటి అంశాలు ఎన్నికల షెడ్యూల్ను మరింత జటిలం చేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. తెలంగాణలో రాబోయే నెలలు ఎంతో ఉత్కంఠను రేకెత్తించనున్నాయి. ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు? అనే ప్రశ్నలకు ఈ ఎన్నికలు సమాధానం చెప్పనున్నాయి. రాజకీయ పార్టీలకు ఇది కేవలం సీట్ల పోరు మాత్రమే కాదు, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించే అసలు సిసలు అగ్నిపరీక్ష!








