వైద్యుల చేతిలోని ‘కత్తి’ మిమ్మల్ని కాపాడుతోందా? సర్జరీల వెనుక ఉన్న షాకింగ్ నిజాలు!
ఒక రోజు మీ డాక్టర్ మీ వైపు చూసి, “ఆపరేషన్ చేయాలి” అని చెబుతాడు.
ఆ వాయిస్ లో ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది. అది సలహాలా అనిపించదు. దాదాపు డెసిషన్ లా అనిపిస్తుంది. ఆ క్షణంలో మనం సాధారణంగా అడిగే ప్రశ్నలు కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. ఎంత ఖర్చవుతుంది? ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి? ఎప్పుడు మళ్లీ ఆఫీస్ కి వెళ్లగలను?
కొందరు మాత్రమే ఒక ప్రశ్న చాలా అరుదుగా అడుగుతారు. “నేను ఈ ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది?” అయితే ఆ ప్రశ్నకు ఆన్సర్ అయితే దొరకదు. దొరికినా నేనేమైనా సరదాగా, ఖాళీగా ఉండి ఆపరేషన్ చేయించుకోమని చెప్పానా అన్నట్లు ఆన్సర్ వస్తుంది. అంతకు మించి ఆశించలేం. ఎందుకంటే…ప్రపంచ వ్యాప్తంగా అసలు ఆధునిక వైద్యం ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన ప్రశ్నల్లో ఇది ఒకటి.
డాక్టర్స్ కు ఒకే విషయం వైద్య శాస్త్రం అద్భుతంగా నేర్పింది. సమస్య కనిపిస్తే దాన్ని సరిచేయాలి. కణితి ఉంటే తొలగించాలి. ఎముక విరిగితే బాగుచేయాలి. అవయవం పనిచేయకపోతే దాన్ని మార్చాలి. నొప్పి ఉంటే దానికి కారణాన్ని వెతికి ఏదో ఒకటి చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ “ఏదో ఒకటి” చేయకపోవడమే బెస్ట్ ఛాయిస్ కావచ్చు అంటోంది ఆధునిక వైద్య శాస్త్రం.
అంటే ప్రతి సమస్యకు కత్తి పట్టుకుని కోత కోయడమే పరిష్కారం కాకపోవచ్చు. కొన్ని రకాల వ్యాధులకు అసలు ఏ ఆపరేషన్ చేయకుండా కాలానికి వదిలేయడమో, లేదా మందులు, ఫిజియోథెరపీలతో చికిత్స చేయడమో చాలా మెరుగైన ఫలితాలనిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
సర్జరీ నిజంగా పనిచేసిందని మనకెలా తెలుస్తుంది?
బ్రిటన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్లు శస్త్రచికిత్సల కోసమే ఖర్చు చేస్తున్నారు. వీటిలో ప్రాణాలు కాపాడేవి, చూపును లేదా వినికిడిని తిరిగి ఇచ్చే అద్భుతమైన ఆపరేషన్లు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వీటితో పాటు అత్యవసరం లేకపోయినా జరుగుతున్న ఆపరేషన్ల ప్రపంచం ఒకటుంది. సాధారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసిన ఆరు నెలల తర్వాత నొప్పి తగ్గితే, మనమంతా ఆ సర్జరీ వల్లే నయం అయిందని నమ్ముతాం.
అయితే ఒకవేళ ఆ వ్యక్తికి అసలు ఆపరేషన్ చేయకపోయినా కూడా అదే ఆరు నెలల్లో ఒళ్ళు తనకు తానుగా కోలుకుని నొప్పి తగ్గి ఉండేదేమో మనం ఎప్పటికీ తెలుసుకోలేం. మందుల విషయంలో అయితే ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలు (Clinical Trials) జరుగుతాయి, కానీ సర్జరీల విషయంలో ‘ఆపరేషన్ చేయకుండా వేచి చూద్దాం’ అని చెప్పే ధైర్యం చేయడం వైద్యులకు కూడా అంత సులభం కాదు.
కోత కోయడం కంటే… వేచి చూడటమే మేలా?
ఆర్థోపెడిక్ సర్జరీలను పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తరచూ చేసే పది రకాల ఆర్థోపెడిక్ ఆపరేషన్లలో కేవలం మూడు మాత్రమే (కార్పల్ టన్నెల్, మోకాలి మార్పిడి, తుంటి మార్పిడి) సర్జరీ లేని చికిత్సల కంటే స్పష్టమైన ఫలితాలనిస్తున్నాయని తేలింది. మిగతా సాధారణ వెన్ను, భుజం ఆపరేషన్లు ఏవీ లేకుండానే—కేవలం సరైన ఫిజియోథెరపీ, మందులు , సమయం ఇవ్వడం ద్వారా శరీరం తనకు తానుగా కోలుకోగలదని తేలింది. అలాగే అత్యవసరంగా ఆపరేషన్ చేసి తీసేయాలనుకునే అపెండిక్స్ కేసుల్లో కూడా మూడింట రెండొంతుల కేసులు కేవలం యాంటీబయాటిక్స్‌తో నయం అవుతున్నాయని, ప్రోస్టేట్ సమస్యలకు వెంటనే కోత కోయడం కంటే ‘వాచ్‌ఫుల్ వైటింగ్’ (పరిస్థితిని గమనిస్తూ వేచి చూడటం) చాలా మేలని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
డాక్టర్లు ఎందుకు ఆపరేషన్లు సూచిస్తున్నారు?
ఇక్కడ డాక్టర్ల ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. రోగికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే సర్జన్లు తమ వద్ద ఉన్న సర్జరీ మార్గాన్ని ఎంచుకుంటారు. అసలు సమస్య వ్యక్తిగత వైద్యులలో కాదు, ఒక విధానం నిజంగా ఎంతవరకు పనిచేస్తుందో నిరూపించే బలమైన పరిశోధనాత్మక ఆధారాలు సరిగ్గా లేకపోవడంలో ఉంది. కొత్త మందు మార్కెట్లోకి రావాలంటే అది సురక్షితమని, పనిచేస్తుందని వంద రకాలుగా నిరూపించుకోవాలి. కానీ సర్జరీల విషయంలో “తరతరాలుగా ఇలాగే చేస్తున్నాం” అనే పాత పద్ధతే కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌లోని NHS లాంటి సంస్థలు ఇప్పటికే అనవసరమైన భుజం ఆపరేషన్లను తగ్గించి, బిలియన్ల కొద్దీ నిధులను ఆదా చేయడమే కాకుండా, ఆ సమయాన్ని నిజంగా ఆపరేషన్ అత్యవసరమైన ఇతర తీవ్రమైన రోగుల కోసం కేటాయిస్తున్నాయి.
డాక్టర్ గదిలో మారాల్సిన సంభాషణ
ఈ మార్పు అనేది ఆపరేషన్ థియేటర్లో కాదు, మొదటగా డాక్టర్ కన్సల్టేషన్ గదిలోనే ప్రారంభం కావాలి. డాక్టర్ గారు రిపోర్టు చూసి ఆపరేషన్ అనగానే భయపడిపోయి “ఎంత ఖర్చవుతుంది?”, “ఎప్పుడు చేద్దాం?” అని అడిగేకంటే ముందు, రోగిగా మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకోవాలి. దీనినే వైద్యరంగంలో ‘షేర్డ్ డిసిషన్ మేకింగ్’ (ఉమ్మడి నిర్ణయం) అంటారు.
తర్వాత ఎప్పుడైనా మీకు కానీ, మీ కుటుంబసభ్యులకు కానీ సర్జరీ సూచిస్తే… ధైర్యంగా డాక్టర్‌ను ఈ ఐదు ప్రశ్నలు అడగండి:
1. ఈ ఆపరేషన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది?
2. మందులు లేదా ఫిజియోథెరపీతో ఇదే ఫలితం వచ్చే అవకాశం ఉందా?
3. ఈ సర్జరీ ప్రయోజనాన్ని నిరూపించే clinical evidence ఏమిటి?
4. ఆపరేషన్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి?
5. కొంతకాలం వేచి చూడటం సురక్షితమేనా?
వైద్యం అంటే ఏదో ఒక చర్య తీసుకోవడం, కోసి బాగు చేయడం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఏమీ చేయకుండా ప్రకృతికి, శరీరానికి సమయం ఇవ్వడం కూడా గొప్ప చికిత్స అవుతుంది. సర్జన్ చేతిలో ఉన్న స్కాల్పెల్ (చిన్న కత్తి) ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు. కానీ, ఆ కత్తిని ఎప్పుడు పక్కన పెట్టాలో తెలుసుకోవడమే నిజమైన ఆధునిక వైద్యశాస్త్రం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








