సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి
తిరుమలలో మంత్రి నారా లోకేష్
తిరుమల: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగం (K. Shanmugam)తో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఈ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగంను శ్రీవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (EO Muddada Ravichandra,), ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.








