దేవుళ్లపై రేవంత్ రెడ్డి కామెంట్స్.. జాతీయ స్థాయిలో దుమారం!
దేశంలో మరోసారి ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సాంస్కృతిక, భావోద్వేగ రాజకీయాల చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఆర్య-ద్రావిడ భావనలు, శివుడు-శ్రీరాముడి ప్రస్తావనను తెస్తూ ఆయన చేసిన విశ్లేషణ.. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఓ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో ఈ తరహా సిద్ధాంతపరమైన వాదనలను తెరపైకి తేవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ నడుస్తోంది.
ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ రాజకీయ శైలిపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “మేం ద్రావిడులం, ఇక్కడి ప్రజలు ఆర్యులు. మేం శివ భక్తులం, ఇక్కడి ప్రజలు శ్రీరాముడి భక్తులు” అంటూ ఆయన ప్రాంతీయ, సాంస్కృతిక గుర్తింపులను లేవనెత్తారు. అంతేకాకుండా.. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు ఎప్పుడూ ‘జై శ్రీరామ్’ అనడమే తప్ప ‘హర హర మహాదేవ్’ అని ఎందుకు నినదించరని ఆయన సూటిగా ప్రశ్నించారు.
శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. హిందూ సమాజంలోని దేవుళ్ల ఆరాధనను కూడా రాజకీయ, వర్గ కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేశారు. దక్షిణాదిలో శివుడు, మురుగన్, అమ్మవార్ల ఆరాధనకు ఉన్న ప్రాధాన్యతను.., ఉత్తరాదిలో రాముడికి వేస్తున్న పెద్దపీటను పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ భావజాలాన్ని కేవలం ఒకే కోణంలో కేంద్రీకరించి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందనే విషయాన్ని చెప్పేందుకు రేవంత్ రెడ్డి దీనిని ప్రస్తావించారు.
తెలంగాణ సీఎం వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఈ రకమైన కుల, మత, ప్రాంతీయ విభజన రాజకీయాలకు తెరతీశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. హిందువులను ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తోందని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. సోమనాథ్ ఆలయ నిర్మాణం నుంచి కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక హిందూ మతపరమైన కార్యక్రమాలను వ్యతిరేకించిందని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ కేవలం ‘జై శ్రీరామ్’ మాత్రమే కాకుండా, ‘హర హర మహాదేవ్’ అని కూడా నినదిస్తారని వివరించారు. రామాయణ కాలం నుంచే శ్రీరామచంద్రుడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేవుళ్లను కూడా ప్రాంతాలు, వర్గాలుగా విభజించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు విమర్శించారు.
ఈ వివాదం కేవలం రెండు పార్టీల మధ్య మాటలదాడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరణను అడ్డుకోవడానికి ప్రాంతీయ అస్తిత్వం, ద్రావిడ భావజాలం, శివారాధన వంటి అంశాలను అస్త్రాలుగా మలచుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. హిందువులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి జాతీయవాద భావనను బలోపేతం చేయాలని బీజేపీ చూస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి పెద్ద రాజకీయ అస్త్రాన్ని అందించాయి.








