‘101 Dalmatians’ సక్సెస్.. ఆ కుక్కల జీవితాలకు శాపంగా మారింది!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమాలో కనిపించే కుక్కను ప్రేమించడం చాలా సులభం. అది తెరపై కనిపిస్తుంది, తోక ఊపుతుంది, పిల్లలతో ఆడుతుంది, విలన్ను ఎదుర్కొంటుంది, చివరికి చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన కుటుంబం దగ్గరకు తిరిగి వస్తుంది. ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అప్పటిదాకా బాగానే ఉంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత ఆ కుక్కను నిజంగానే ఇంటికి తెచ్చుకుని రోజూ చూసుకోవాల్సి వస్తే?
1996లో ‘101 డాల్మేషియన్స్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించినప్పుడు ఈ అసలు ప్రశ్న గురించి ఎవరూ ఆలోచించలేదు. అంతవరకు చాలామందికి అరుదుగా తెలిసిన ‘డాల్మేషియన్’ జాతి కుక్కలు, ఒక్కసారిగా ప్రతి చిన్నారి కలల జాబితాలోకి చేరిపోయాయి. తెల్లటి శరీరంపై నల్లటి మచ్చలు, పొడవాటి కాళ్లు, కెమెరా ముందర అమాయకంగా కనిపించే ఆ ముఖాలను డిస్నీ కేవలం కుక్కలుగా మాత్రమే కాక, ఒక అందమైన బాల్య స్వప్నంగా మార్చేసింది.
పండగలు వచ్చాయి, పిల్లలు పట్టుబట్టారు, తల్లిదండ్రులు కొనిచ్చారు. దాంతో సినిమాలో కథ సుఖాంతమైంది కానీ, నిజ జీవితంలో ఆ మూగజీవాల అసలు వ్యథ అక్కడే మొదలైంది.
తెర వెనుక మొదలైన చేదు నిజం
సినిమా విడుదలైన కొద్ది నెలలకే అమెరికాలోని జంతు సంరక్షణ కేంద్రాల (షెల్టర్స్) తలుపులు మునుపెన్నడూ లేనంతగా తెరుచుకున్నాయి. ఫ్లోరిడాలోని ‘డాల్మేషియన్ రెస్క్యూ’ సంస్థకు చెందిన పాటీ డేన్, సినిమా వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఏకంగా 130 డాల్మేషియన్లను తమ కేంద్రానికి తీసుకొచ్చారని నాటి రిపోర్ట్ లు తెలిపాయి.
కేవలం ఒకే ప్రాంతం కాదు, లాస్ ఏంజెల్స్, టాంపా బే వంటి ఎన్నో నగరాల్లోని షెల్టర్లు ఈ కుక్కలతో నిండిపోయాయి. వాటిలో కొన్ని గాయాలతో, మరికొన్ని తీవ్ర వేధింపులకు గురై దీనస్థితిలో వచ్చాయి. కొన్నైనా కొత్త ఇళ్లను వెతుక్కోగలిగాయి కానీ, చాలావాటికి ఆ అదృష్టం కూడా దక్కలేదు. మనుషులు సినిమా చూసి ఉత్సాహంగా ఆ కుక్కను ఎంచుకున్నారు కానీ, పాపం ఆ కుక్కకు సినిమా అంటే ఏంటో, తన జీవితం ఎటుపోతుందో తెలియదు కదా!
సినిమా చూపించని అసలు విషయం
సినిమాలు ఒక జీవిని అందమైన చిత్రపటంలా మాత్రమే చూపుతాయి, కానీ నిజ జీవితంలో అదొక ప్రాణమున్న జంతువు. డాల్మేషియన్లకు చాలా శారీరక శ్రమ, బోలెడంత స్థలం, సరైన శిక్షణ, అత్యంత శ్రద్ధ అవసరం. ఇవి ఏడాది పొడవునా విపరీతంగా వెంట్రుకలు రాలుస్తాయి, పైగా 60 నుంచి 70 పౌండ్ల బరువు వరకు పెరుగుతాయి.
ఎంతో చురుగ్గా ఉండే ఈ జాతికి తగినంత వ్యాయామం లభించకపోతే, అవి ఇళ్లలోని వస్తువులను నాశనం చేయడం లేదా అవాంఛితంగా ప్రవర్తించడం మొదలుపెడతాయి. దానికితోడు సుమారు పది డాల్మేషియన్లలో ఒక దానికి పుట్టుకతోనే చెవుడు ఉండే అవకాశం ఉందనేది నాటి అధ్యయనాల మాట. ఇవేవీ ఆ కుక్కల తప్పు కాదు, కానీ ప్రతీ కుక్క ప్రతీ ఇంటి వాతావరణానికి సరిపోదనే చిన్న సత్యాన్ని సినిమా గ్లామర్ తుడిచేసింది.
వ్యాపారంగా మారిన బంధం
మార్కెట్లో డాల్మేషియన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వ్యాపార పెంపకందారులు (బ్రీడర్లు) లాభాల బాట పట్టారు. కుక్కల ప్రత్యేక అవసరాలు, వాటి స్వభావం గురించి,వాటిని కొనుగోలు చేసే కుటుంబాలకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, కేవలం డబ్బు కోసం వేగంగా వాటిని పెంచి అమ్మేశారు. అక్కడే అసలు కథ మొదలైంది.
‘101 డాల్మేషియన్స్’ సినిమా కుటుంబ అనుబంధాలు, ప్రేమ, విశ్వాసం గురించి చెప్తే, నిజ జీవితంలో అదే సినిమా కొందరిని బాధ్యతా రాహిత్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేసింది. సినిమాలో కుక్క ఒక కుటుంబ సభ్యుడిగా కనిపిస్తే, మార్కెట్ దాన్ని ఒక వ్యాపార ఉత్పత్తిగా చూసింది, జనాలు దాన్ని ఒక హోదాగా కొనుగోలు చేశారు. వీటి నడుమ ఒక మూగజీవి బలైపోయింది.
రెండో సినిమాతో వచ్చిన హెచ్చరిక
మొదటి సినిమా ఇచ్చిన చేదు అనుభవాల తర్వాత, 2000లో ‘102 డాల్మేషియన్స్’ విడుదలవుతున్న సమయానికి జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఈ సినిమాతో డాల్మేషియన్లపై తాత్కాలిక క్రేజ్ పెరిగి మరిన్ని ప్రాణాలు వీధిన పడతాయేమోనని భయపడి డిస్నీ స్టూడియోస్ ఎదుట నిరసనలు చేపట్టారు.
దాంతో డిస్నీ యజమాన్యం సినిమా ముగింపు టైటిల్స్ పడేటప్పుడు ఒక ముఖ్యమైన సందేశాన్ని జోడించింది. “ఏదైనా పెంపుడు జంతువును ఇంటికి తెచ్చుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి, దాన్ని దత్తత తీసుకోవడం అనేది జీవితాంతం ఉండే బాధ్యత” అని హెచ్చరించింది. అదొక చిన్న ప్రకటన కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న మూగజీవుల వేదన చాలా పెద్దది.
మన బాధ్యత ఎంతవరకు?
సినిమాలు మనకు కేవలం వస్తువులనో, దుస్తులనో మాత్రమే కాదు, కొన్నిసార్లు ఒక రకమైన మోజును కూడా అమ్ముతాయి. ఈ కథలో డాల్మేషియన్ జాతి చెడ్డది కానే కాదు, సమస్యల్లా సినిమా తెచ్చిన ఆకర్షణ ముందర, ఒక జీవిని సాకేందుకు కావాల్సిన వాస్తవ జ్ఞానం ఓడిపోవడమే.
పిల్లలు తెరపై చూసింది ఒక ముచ్చటైన కుక్కను, కానీ తల్లిదండ్రులు ఇంటికి తెచ్చింది ఒక పెద్ద బాధ్యతను. ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించడానికి చాలా కుటుంబాలకు కొద్ది నెలలు కూడా పట్టలేదు.
ఆ లోపే ఎన్నో డాల్మేషియన్లు తమ మొదటి ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డాయి. థియేటర్లలో వెలుగులు నిండి, ప్రేక్షకులు హాయిగా ఇళ్లకు వెళ్లిపోయినా, తెరపై అలరించిన ఆ మచ్చల కుక్కలకు మాత్రం నిజమైన జీవన పోరాటం అప్పుడే మొదలైంది.








