LPG సిలిండర్ రేటు పెరుగుతుందా? ఎంత అవుతుంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మన వంటగదిలో సిలిండర్ చివరి దశకు చేరుకున్నప్పుడు అది మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది. మంట కొంచెం చిన్నదవుతుంది. స్టవ్ మీద పాత్ర పెట్టినప్పుడు నీలి మంట కాసేపు తడబడుతుంది. అప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి, ఫోన్ తీసుకుని సిలిండర్ బుక్ చేస్తారు. ఆ తర్వాత మన పని అయిపోయిందనుకుంటాం. కానీ నిజానికి అక్కడి నుంచే మరొకరి పని మొదలవుతుంది. ఈసారి ఆ పని కొంచెం ఖరీదైనదిగా మారవచ్చని LPG డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
అసలేం జరిగింది
దేశవ్యాప్తంగా LPG డిస్ట్రిబ్యూటర్లు అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. వారి డిమాండ్లలో ప్రధానమైనది. ఒక్కో సిలిండర్‌పై అడ్మినిస్ట్రేటివ్, హోమ్ డెలివరీ ఛార్జీలకు రూ.75 అదనంగా ఇవ్వాలి. ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనందరికి వెంటనే వచ్చే ప్రశ్న సహజమైనదే.
“అయితే నా సిలిండర్ కూడా రూ.75 పెరుగుతుందా?”. అయితే దీనికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేం కానీ …పెరిగే అవకాసం మాత్రం ఉందని మాత్రం అర్దమవుతోంది.
ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్న రూ.75, వినియోగదారుడికి ఇప్పటికే విధించిన కొత్త ధర కాదు. అది వారి డిమాండ్. అయితే ఆ డిమాండ్ అంగీకరించబడితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్న మాత్రం చివరికి మన వంటగదికే చేరుతుంది. అది ఈ కథలో ఇంట్రస్టింగ్ విషయం.
సిలిండర్ ధర మనకు తెలుసు. దాని ప్రయాణం తెలియదు.
మనకు LPG సిలిండర్ అంటే ఒక ధర. బుకింగ్ చేస్తాం. డబ్బు చెల్లిస్తాం. సిలిండర్ వస్తుంది. ఈ మూడు దశల మధ్య ఉన్న ప్రపంచం మనకు దాదాపు కనిపించదు. ఒక సిలిండర్ గోడౌన్లో ఉంటుంది. అక్కడి నుంచి ట్రక్కులో బయలుదేరుతుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది. డెలివరీ వ్యక్తి దాన్ని ఇంటి మెట్ల దగ్గరకు తీసుకొస్తాడు. ఈలోగా బుకింగ్, ఇండెంట్, లెక్కలు, పత్రాలు, డిజిటల్ వెరిఫికేషన్లు చిన్నగా కనిపించే అనేక పనులు దాని ప్రయాణంలో చేరుతాయి.
చివరికి మన ఇంటి తలుపు దగ్గర నిలబడేది ఒక సిలిండర్ మాత్రమే. కానీ దాని వెనుక ఒక చిన్న పరిశ్రమ ఉంటుంది. ఆ పరిశ్రమ ఖర్చు పెరిగిందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.
రూ.75 కంటే ఆసక్తికరమైన సంఖ్య రూ.236
ఈ వివాదంలో మరో సంఖ్య ఉంది. అదే రూ.236. వినియోగదారుల e-KYC పూర్తి చేస్తున్నందుకు ఒక్కో వెరిఫికేషన్‌కు రూ.236 చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.
e-KYC అనే పదం ఇప్పుడు మనకు అంత కొత్తగా అనిపించదు. ఫోన్లో ఒక OTP వస్తుంది. కొన్ని వివరాలు నిర్ధారిస్తాం. ఒక ప్రక్రియ పూర్తవుతుంది. కానీ డిజిటల్ ప్రపంచంలో ఒక పని “రెండు నిమిషాలు” పట్టిందని చెప్పడం, ఆ రెండు నిమిషాల వెనుక పని లేదని చెప్పడం కాదు. ఎవరైనా ఆ వివరాలను సేకరించాలి. ఎవరో ఒకరు ప్రక్రియను పూర్తి చేయాలి. ఎవరైనా అది సరిగ్గా జరిగిందో లేదో చూసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నది ఏమిటంటే…ఆ అదనపు పని కూడా తమదే అయింది; దానికి చెల్లింపు కావాలని.
ఒక సిలిండర్, అనేక అసంతృప్తులు
డిస్ట్రిబ్యూటర్ల జాబితాలో రూ.75 ఒక్కటే లేదు. Non-fuel products విక్రయించేందుకు విధిస్తున్న లక్ష్యాలను తొలగించాలని వారు కోరుతున్నారు. తప్పనిసరి PNG అవసరాన్ని తొలగించాలని అంటున్నారు. కొత్త domestic gas connectionsపై ఉన్న freezeను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండెంట్ ప్రక్రియలో బలవంతపు మార్పులను కూడా ఆపాలని కోరుతున్నారు. ఇవి వింటే ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది.
LPG డిస్ట్రిబ్యూటర్‌కు సిలిండర్‌ను ఇంటికి చేర్చడం మాత్రమే పని కాదు. ఒకప్పుడు డెలివరీగా కనిపించిన పని ఇప్పుడు డెలివరీతో పాటు అనేక చిన్న బాధ్యతల సమాహారంగా మారుతోంది. ఆ బాధ్యతలన్నింటికీ సరైన ధర దొరుకుతుందా? అదే వారి వాదన.
ఇదే సమయంలో, ఉన్నావ్‌లో ట్రక్కులు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో చిన్న సంఘటన ఈ కథకు మరొక పొరను జోడించింది. హిందుస్థాన్ పెట్రోలియం LPG బాట్లింగ్ ప్లాంట్‌లో ట్రక్ డ్రైవర్లు మంగళవారం సమ్మెకు దిగారు. ఆ ప్లాంట్ నుంచి లక్నో, కాన్పూర్ సహా 20కి పైగా జిల్లాలకు రోజుకు సుమారు 40,000 నుంచి 50,000 సిలిండర్లు పంపిస్తారు. డ్రైవర్ల సమస్య డిస్ట్రిబ్యూటర్ల సమస్య కాదు. వారు ట్రక్కులను ఎక్కువసేపు నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్లాంట్‌లో ఒక ట్రక్కును రెండు గంటలకు మించి నిలిపివేయకూడదని కోరుతున్నారు.
ప్లాంట్ మేనేజ్మెంట్ మాత్రం సమ్మె జరుగుతోందన్న విషయాన్ని ఖండించింది. ఇక్కడ రెండు కథలు కలుస్తాయి. ఒకరు సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లే ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. మరొకరు సిలిండర్‌ను తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్న సమయం గురించి మాట్లాడుతున్నారు.
మనకు మాత్రం రెండూ ఒకేలా కనిపిస్తాయి. “గ్యాస్ వచ్చింది.”
ఏదైమైనా…
అక్టోబర్ 26న అసలు పరీక్ష మొదలవుతుంది. అక్టోబర్ 26కి మరో ప్రత్యేకత ఉంది. దీపావళి దగ్గరపడుతోంది. పండుగ రోజుల్లో వంటగది సాధారణంగా ఉండదు. ఇంట్లో వంట పెరుగుతుంది. అతిథులు వస్తారు. ఒక్కో ఇంటి LPG వినియోగం కూడా పెరగొచ్చు. అలాంటి సమయంలో సరఫరా చెయిన్ లోని ఏదైనా భాగం నెమ్మదిస్తే, దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. మొదట డెలివరీ కొంచెం ఆలస్యమవుతుంది. తర్వాత బుకింగ్‌కి ఎక్కువ సమయం పడుతుంది. తర్వాత కొద్ది రోజులు అదనంగా ఎదురుచూడాల్సి రావచ్చు. అందుకే స్థానిక అధికారులు డిస్ట్రిబ్యూటర్లు డెలివరీలు కొనసాగించాలని కోరుతున్నారు.








