బాల్ రూమ్ పై డ్రోన్ పోర్ట్.. మిలటరీ కాంప్లెక్స్ గా వైట్ హౌస్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సరికొత్త నిర్ణయం వెలువరించారు. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా.. ఆలోచించని విధంగా వైట్ హౌస్ స్వరూపాన్ని మార్చేయడానికి సంకల్పించారు. అంటే వైట్ హౌస్ ఇక నుంచి మిలిటరీ కాంప్లెక్స్‌గా మారనుందన్నమాట. దీనిలో భాగంగానే తాజాగా నిర్మిస్తున్న బాల్‌రూమ్‌పై ఓ అత్యాధునిక డ్రోన్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వీటిల్లో క్షిపణులు ప్రయోగించగలిగే అత్యాధునిక డ్రోన్లు కూడా ఉండనున్నట్లు వెల్లడించారు. వాషింగ్టన్లో దాదాపు 18 ఎకరాల్లో విస్తరించిన శ్వేతసౌధం కాంప్లెక్స్‌ను శత్రుదాడుల నుంచి రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
శ్వేతసౌధానికి (White House) కొద్ది దూరంలోని ట్రెజరీ డిపార్ట్మెంట్ భవనంపై సీక్రెట్ సర్వీస్ విభాగం రహస్యంగా ఓ మినీ డ్రోన్పోర్టును నిర్వహిస్తోంది. ఇక్కడ ఎప్పుడూ నాలుగు డ్రోన్లు గ్రే కలర్ బాక్సుల్లో సిద్ధంగా ఉంటాయి. అధికారుల ఆదేశాల మేరకు ఇవి గాల్లో ఎగిరి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏం జరుగుతోందో సమాచారం సేకరించి తిరిగి బాక్సుల్లోకి వెళ్లిపోతాయి. అయితే శ్వేతసౌధం భద్రతను కారణంగా చూపి.. ఇక్కడ భారీ డ్రోన్‌పోర్టు నిర్మించాలని ట్రంప్ వాదిస్తున్నారు.
నిపుణులు మాత్రం ట్రంప్ ప్రతిపాదనలో లోపాలను ఎత్తిచూపుతున్నారు. అసలు డ్రోన్ శ్వేతసౌధం వరకు వస్తే.. అదే భద్రతా వైఫల్యమని స్కైఫైర్ఏఐ వ్యవస్థాపకుడు మ్యాట్ స్లోనే పేర్కొన్నారు. ఈ భారీ డ్రోన్‌పోర్టు కంటే.. సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే వాడుతున్నటువంటివి సరిపోతాయని అభిప్రాయపడ్డారు. కానీ, ట్రంప్ మాత్రం అక్కడ భారీ డ్రోన్లను మోహరిస్తున్నట్లు తన సోషల్ మీడియా పోస్టులో ఏఐ చిత్రాన్ని విడుదల చేశారు.
వాస్తవానికి సీక్రెట్ సర్వీస్ ఎప్పటి నుంచో డ్రోన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. 2024లో పెన్సిల్వేనియా బట్లర్ కౌంటీలో ట్రంప్‌పై దాడి జరిగిన నాటి నుంచి దీనిని మరింత వేగవంతం చేసింది. నాడు కూడా నిందితుడు తొలుత డ్రోన్‌ను ప్రయోగించి చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాడు. దీనిని కూల్చివేయడంలో సీక్రెట్ సర్వీస్ విఫలమైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు సృష్టించిన విధ్వంసం చూశాక.. శ్వేత సౌధంలో ఈ పోర్టు అవసరం ఏర్పడింది. దీనిపై వైట్‌హౌస్‌లో సీక్రెట్ సర్వీస్‌ను పర్యవేక్షించిన మాజీ అధికారి పాల్ ఎక్లోఫ్…. డ్రోన్లు శ్వేతసౌధానికి అతిపెద్ద ముప్పులా మారినట్లు అభివర్ణించారు. వాటి నుంచి అధ్యక్ష భవనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రంప్ కోరినట్లు శ్వేతసౌధం బాల్రూమ్ వద్ద డ్రోన్‌పోర్టు ఏర్పాటు చేస్తే.. పౌర విమానాలకు సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడికి సమీపంలోనే అత్యంత రద్దీ అయిన రీగన్ వాషింగ్టన్ ఎయిర్ పోర్టు ఉంది. శ్వేత సౌధం సమీపంలో కమర్షియల్ విమానాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టును సమన్వయం చేసుకుంటూ.. డ్రోన్‌పోర్టు నిర్వహించడం కత్తిమీద సాముగా మారే అవకాశం ఉంది.








