ఇరాన్ విమాన సర్వీసులపై అమెరికా ఆంక్షలు.. నేటి నుంచి గ్లోబల్ షట్ డౌన్..
ఇరాన్ పై అమెరికా మరో ఆర్థికాస్త్రాన్ని ప్రయోగించింది. నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు అందించడం కొనసాగిస్తే, విదేశీ కంపెనీలపై ద్వితీయ (సెకండరీ) ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు పూర్తవుతున్న తరుణంలో అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ ఈ ప్రకటన చేశారు.
‘‘ఇరాన్ విమానాలు ఇకపై ఎయిర్‌పోర్టులకే పరిమితమవుతాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగిన ఇరాన్ విమానాలకు ఇంధనం అందించడం, ల్యాండింగు సేవలు, టికెట్ల అమ్మకం వంటివి చేస్తే ఆయా దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి బయటకు నెట్టేస్తాం. ఇరాన్ విమానయాన రంగానికి మద్దతిస్తున్న ఇతర దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాం’’ అని స్కాట్ బెసెంట్ అన్నారు. అమెరికా ఆర్థికమంత్రి ప్రకటన తర్వాత ఇరాక్, జార్జియా, తుర్కియే వంటి దేశాలు ఇరాన్ విమానయాన సంస్థల కార్యకలాపాలను తమ దగ్గర నిషేధిస్తున్నట్లు తెలిపాయి.
నేటి నుంచి అమెరికా (USA) ఆంక్షలు అమల్లోకి రానుండటంతో తమ దేశ రాజధానిలోకి ఇరాన్ (Iran) విమానాల రాకపోకలను ఇరాక్ (Iraq) నిలిపివేసింది. ఈ మేరకు ఇరాక్ పౌర విమానయాన సంస్థ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు..బాగ్దాద్ విమానాశ్రయం నుంచి ఇరాన్ విమానాలను నజఫ్ ఎయిర్‌పోర్టుకు తరలించే అంశంపై ఇప్పుడు ఇరాక్ చర్చలు జరుపుతోంది. అర్ధరాత్రి నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండటంతో ఈ అంశంపై వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు ఇరాన్ కూడా చర్యలు చేపట్టింది. ఆ దేశ పౌరవిమానయాన శాఖ ఒమన్‌లోని మస్కట్, ఇరాక్‌లోని బాగ్దాద్‌కు ఫ్లైట్లను రద్దు చేసింది. కానీ, ఇస్తాంబుల్ సహా ఇతర అంతర్జాతీయ మార్గాలకు మాత్రం విమానాలను కొనసాగిస్తోందని తెలుస్తోంది.. ఇప్పటికే ఇరాన్‌కు ప్రయాణించేవారిని ఒమన్ అనుమతించడంలేదని ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు.








