మరో వారంలో ఏదో జరుగుతుంది.. ? ఉక్రెయిన్ నెక్స్ట్ స్టెప్…..?
అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యాతో ఢీ అంటే ఢీ అంటున్నట్లుగా పోరాడుతోంది ఉక్రెయిన్.. చూసేందుకు చిన్న ముక్కగా ఉన్నా.. పోరాటంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అంతేకాదు.. తొలిసారిగా రష్యాపై ఏకంగా 1600 డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. దీంతో రాజధాని నగరం మాస్కోలో మంటలు చెలరేగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, తాము ఉక్రెయిన్లోని 146 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. రవాణా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, ఉక్రెయిన్ బలగాలు, విదేశీ కిరాయిసైన్యాన్ని మోహరించిన ప్రాంతాలపై విరుచుకుపడినట్లు చెప్పింది.
రానున్న రోజుల్లో తమ దేశానికి రెక్కలొస్తాయని ఉక్రెయిన్ పాత్రికేయుడు దిమిత్రొ గొర్డన్ వ్యాఖ్యలు చేశారు. అతడిని జెలెన్స్కీ (Volodymyr Zelenskyy)కి అత్యంత సన్నిహితుడిగా చెప్తారు. ‘‘నాకు కచ్చితంగా తెలుసు. కొద్దిరోజుల్లోనే గొప్ప ఆశను కలిగించేది ఏదో జరుగుతుంది. అదేమిటో చెప్పలేను. అదొక సైనిక రహస్యం. కానీ, వారం లేక రెండు వారాల్లో మన దేశానికి రెక్కలు తొడిగేలా ఏదో ఒకటి జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతోన్న సమయంలో రష్యా (Russia) ప్రజలు అధ్యక్షుడు పుతిన్ పార్టీకి అనుకూలంగా నిలిచినట్లు కనిపిస్తోంది. రష్యాలో యుద్ధకాలంలో జరిగిన మొట్టమొదటి పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ ఆదివారం రాత్రి ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల చివరి రోజున ఉక్రెయిన్ దళాలు రష్యాపై వందల డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 11.1కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో ఇప్పటికీ పూర్తి నియంత్రణలో లేని నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల ప్రజలు, అలాగే 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలోని ఓటర్లు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. తమ ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకే ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది.








