H-1Bపై లక్ష డాలర్ల ఫీజు.. గడువు మరో ఏడాది పెంచేసిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. హెచ్ -1బీ వీసాదారులపై మరింత కఠినవైఖరి అవలంభిస్తున్నారు. గతేడాది హెచ్-1బీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు లక్షడాలర్లకు పెంచేసిన ట్రంప్.. ఈ ఏడాది సైతం అదేఫీజు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి మరో ఏడాదిపాటు ఫీజు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేశారు.
సాధారణంగా ఈ వీసా దరఖాస్తుల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. గతంలో ఇందుకోసం 2 వేల నుంచి 5 వేల డాలర్ల వరకూ ఖర్చు కాగా.. గతేడాది సెప్టెంబరులో ఈ వీసా ఫీజు (H-1B visa Fee) ను ట్రంప్ సర్కార్ ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసింది. ఆ నిబంధన తీసుకువచ్చిన ఏడాది సమయం పూర్తవుతున్న సమయంలో ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 12 నెలల పాటు ఈ పెంపును పొడిగించింది.
2025లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐటీ సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తున్న కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. దీంతో అమెరికన్ కార్మికులు, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే కంపెనీలు నియమించుకునేలా చూడటం తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ సర్కార్ చెప్తూ వస్తోంది. అమెరికా హెచ్-1బీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు ముందువరుసలో ఉన్నారు.
ఈ లక్ష డాలర్ల రుసుమును అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో సవాలు చేయగా.. ఆ ఫీజు చట్టవిరుద్ధమని తీర్పు వచ్చింది.. అయితే ఈ అంశం ఇతర ఫెడరల్ కోర్టుల్లో విచారణ దశలో ఉంది. ఈ ఫీజుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ.. లక్ష డాలర్ల ఫీజును మరో ఏడాది పాటు పొడిగిస్తూ ట్రంప్ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..








