భారత్ , చైనాకు 100శాతం టారిఫ్ ముప్పు.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం..!
రష్యా చమురు కొనుగోళ్లపై ఆధారపడిన భారత్, చైనాలకు పెనుముప్పు సమీపిస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వద్దని హెచ్చరించిన అమెరికా.. కాదని కొనుగోళ్లు చేసిన వారిపై కొరఢా ఝలిపించే దిశగా పెద్ద ముందడుగేసింది. రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో రష్యా, ఇరాన్ (Iran)లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాలపై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది.
‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం-2026’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు బుధవారం సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది.దీంతో భారత్ (India), చైనా (China)తో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా సుంకాలు విధించనుంది.
ఈ చట్టంపై ఇప్పటికే భారత్ స్పందించింది. రష్యా (Russia)పై ఆంక్షలను, తమపై సుంకాలను విధిస్తే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు తప్పదని భారత్ హెచ్చరించింది. అమెరికా చర్యను చైనా తిరస్కరించింది. భద్రతా మండలి ఆమోదం లేని ఏ చర్యనూ ఆమోదించబోమని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ చట్టంతో ట్రంప్‌నకు ..రష్యా నాయకత్వంపై ఆంక్షల విధింపునకు అవకాశం దక్కుతుంది. అదే సమయంలో ఇంధన రంగంపైనా ఆంక్షలు విధించే ఛాన్స్ లభిస్తుంది.ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకుంటూ చమురు సరఫరా చేసే నౌకల షాడో ఫ్లీట్పైనా ఆంక్షలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించనుంది. దీనికి తోడు రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేలా ఒత్తిడి తెస్తూ భారత్, చైనా వంటి దేశాలపై సుంకాల మోత మోగించే అధికారం దక్కనుంది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించవచ్చు.








