బీజేపీ ఎమ్మెల్యేలలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఎంపీల మధ్య నడిచిన ఆధిపత్య పోరు, ఇప్పుడు ఎమ్మెల్యేల మధ్య రచ్చకెక్కింది. బీజేఎల్పీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద తలనొప్పిగా మారాయి.
శుక్రవారం అసెంబ్లీ లాబీలోని బీజేఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఒకవైపు సభ కొనసాగుతుండగానే, లాబీలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు వాదించుకోవడం చూసి అసెంబ్లీ సిబ్బంది సైతం అవాక్కయ్యారు. సభలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే మాట్లాడుతున్నారని, తమకు మాత్రం అసలు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము కూడా ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులమే కదా, మాకు ఎందుకు సభలో గళం విప్పే అవకాశం ఇవ్వడం లేదు?” అని ఒక ఎమ్మెల్యే నిలదీసినట్లు సమాచారం. అన్ని విషయాలపై కేవలం మీరే మాట్లాడితే ఇక మేమెందుకున్నట్లు అని వారు నిలదీయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ వాగ్వాదం ఎంత దూరం వెళ్లిందంటే.. సమావేశం అనంతరం ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి విసురుగా బయటకు వచ్చి మరో ఎమ్మెల్యేపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన తరుణంలో, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా అంతర్గత ఆధిపత్యాల కోసం కొట్లాడుకోవడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.
అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తుండటం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇలాంటి పరిణామాలు పునరావృతమైతే ప్రజల్లో పార్టీ పరువు బజారున పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సమష్టిగా ముందుకు వెళ్లాల్సిన వేళ, నేతల మధ్య సమన్వయం లోపించడం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి హైకమాండ్ ఈ అంతర్గత కుమ్ములాటలకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.








