కెమెరాలు చూస్తేనే భయమేస్తోంది: స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు..!
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే బ్లాక్ డేగా భావించే ‘సాండ్‌పేపర్‌గేట్’ (Sandpapergate) బాల్ టాంపరింగ్ వివాదం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, ఆ చేదు జ్ఞాపకాలు తనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ఆవేదన వ్యక్తం చేశాడు. అక్టోబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో.. నాటి ఘటనపై స్మిత్ ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నాడు. ఆ వివాదం తర్వాత తాను మొదటిసారి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడబోతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
2018 కేప్‌టౌన్ టెస్టులో బంతి రూపాన్ని మార్చేందుకు సాండ్‌పేపర్‌ను ఉపయోగించినట్లు తేలడంతో అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం పడిన సంగతి తెలిసిందే. నాటి చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. “నిజం చెప్పాలంటే నాకు కెమెరాలన్నా, వాటి ఫ్లాష్ లైట్లన్నా తీవ్రమైన భయం, యాంగ్జైటీ కలుగుతాయి. నాటి ఘటన తర్వాత జోహన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో మీడియా నన్ను ముట్టడించిన క్షణాలు, ఆపై సిడ్నీకి తిరిగొచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడిన రోజులు నా జీవితంలో అత్యంత బాధాకరమైనవి.
ఇవి కూడా చదవండి
కెమెరా శబ్దం వినబడిన ప్రతిసారీ నాకు ఆ పీడకల లాంటి రోజులే గుర్తొస్తాయి” అని స్మిత్ పేర్కొన్నాడు. నాటి మానసిక క్షోభ నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా పునరాగమనం చేసిన స్మిత్.. ఇప్పటివరకు టెస్టుల్లో 56 సగటుతో ఏకంగా 10,920 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. సౌతాఫ్రికా పర్యటనలో స్థానిక ప్రేక్షకుల నుంచి వచ్చే నినాదాలు, ట్రోలింగ్స్‌ను ఎదుర్కోవడానికి తాను మానసికంగా సిద్ధమయ్యానని తెలిపాడు. “ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్‌లలో కూడా అక్కడి ప్రేక్షకులు నన్ను తీవ్రంగా దూషించారు. ఇలాంటి పరిస్థితులు నాకు అలవాటే. మైదానంలో ప్రేక్షకులు చేసే ఆరోపణలను, అరుపులను నేను మరింత బాగా ఆడేందుకు ఒక మోటివేషన్‌గా మార్చుకుంటాను” అని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు.








