యాజమానిగా మారిన ద్రావిడ్.. కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) సరికొత్త అవతారంలో మెరిశారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) లోని ‘డబ్లిన్ గార్డియన్స్’ (Dublin Guardians) ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆయన ఓనర్‌గా మారారు. ఎల్లప్పుడూ ఆటగాడిగా లేదా సపోర్ట్ స్టాఫ్‌గా గ్రౌండ్లో కనిపించే ద్రావిడ్‌ను ఓనర్ సీట్లో చూడటం సరికొత్త అనుభూతిని ఇస్తోందని ఆ జట్టు ప్రధాన కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. గతంలో భారత జట్టుకు మరియు ఐపీఎల్లో ద్రావిడ్‌తో కలిసి పనిచేసిన రాథోడ్, యాజమానిగా ఆయన ప్రవర్తనపై ప్రశంసలు కురిపించారు.
టోర్నమెంట్ ప్రారంభంలో డబ్లిన్ గార్డియన్స్ జట్టు వరుసగా మొదటి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ, ఓనర్‌గా ద్రావిడ్ జట్టుపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని విక్రమ్ రాథోడ్ వెల్లడించారు. “రాహుల్ ద్రావిడ్ పూర్తిస్థాయిలో ఒక ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన జట్టు అంతర్గత విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. స్వయంగా సుదీర్ఘ కాలం కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయాన్ని ఆయన చక్కగా అర్థం చేసుకోగలరు. అందుకే కష్టసమయంలోనూ జట్టుకు ఎంతో అండగా నిలిచారు” అని రాథోడ్ ఒక వర్చువల్ మీడియా సమావేశంలో కొనియాడారు.
ఇవి కూడా చదవండి
ఈ ఫ్రాంచైజీకి భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక, మ్యాచ్ వ్యూహాలు, ప్రత్యర్థి ఆటగాళ్లకు చెక్ పెట్టడం వంటి రోజువారీ క్రికెట్ వ్యవహారాలన్నింటినీ అశ్విన్ మరియు కోచ్ రాథోడ్‌లే చూసుకుంటున్నారని, ద్రావిడ్ వాటిలో తలదూర్చడం లేదని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, అక్కడి పరిస్థితులపై అశ్విన్‌కు ఉన్న అపారమైన జ్ఞానం మరియు విశ్లేషణలు జట్టుకు ఎంతో ప్లస్ అవుతున్నాయని, దీనివల్ల ఒక కోచ్‌గా తన పని కూడా చాలా సులువైందని విక్రమ్ రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు.








