బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ ప్రభుత్వం హై అలర్ట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అప్రమత్తమైంది. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో తక్షణమే ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. అల్పపీడన కదలికలు, వాతావరణ మార్పులపై ప్రజలకు ఎప్పటికప్పుడు మొబైల్ అలర్ట్స్ మరియు సమాచార సందేశాలను పంపాలని అధికారులకు సూచించారు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రానున్న మూడు రోజుల పాటు ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రాకుండా, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వరదలు లేదా భారీ వర్షాల కారణంగా ఏదైనా అత్యవసర సహాయం కావాల్సిన వారు సంప్రదించడానికి ప్రభుత్వం 112, 1070, మరియు 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. సహాయక బృందాలు (SDRF/NDRF) కూడా సిద్ధంగా ఉన్నాయని హోంమంత్రి అనిత తెలిపారు.








