జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా..?
‘డీఎస్సీ-2025′(DSC-2025) ఉపాధ్యాయ నియామకాలపై పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా జగన్ విషప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. అసలు జగన్‌కు డీఎస్సీ కి, ఏపీపీఎస్సీకి ఉన్న కనీస వ్యత్యాసం కూడా తెలియదా అని లోకేష్ ఎద్దేవా చేశారు. గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భర్తీ చేసిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ‘సున్నా’ అని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర జగన్‌దని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం, తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు. ఆ సంతకం ద్వారా రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టామని వివరించారు. నియామకాల్లో కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న జగన్, తన సొంత హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాల గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని నారా లోకేష్ స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క డీఎస్సీతో సరిపెట్టకుండా, ప్రతి ఏటా 3 వేల ఉపాధ్యాయ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరా నియామకాలు పూర్తయిన వెంటనే, త్వరలోనే మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోందని, తప్పుడు ప్రచారాలను నమ్మి నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.








