‘అన్నవరం’లో ఏడు రూపాయల కక్కుర్తి… రూ.7 లక్షల ఫైన్ వేసిన కోర్టు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
దేవాలయ దర్శనానికి వచ్చేవారి దృష్టి పూర్తిగా ఆ భగవంతుడు మీదే నిండి ఉంటుంది. దర్శనం ఎప్పుడు అవుతుందో అన్న ఆత్రం.. ప్రసాదం తీసుకోవాలన్న తొందర.. కుటుంబాన్ని చూసుకోవడం.. చెప్పులు, సామాన్లు చూసుకోవడం.. పార్కింగ్ కోసం హడావుడి.. తిరిగి వెళ్లాల్సిన ప్రయాణం..ఇలా హడావిడి సాగిపోతుంది. ఈ టైమ్ లో డబ్బులు ఎక్కువ, తక్కువలు పెద్దగా పట్టించుకోరు.
దీన్ని అలుసుగా తీసుకుని ఆటోలు వాళ్లు, రూమ్ లు వాళ్లు,షాపు లు వాళ్లు , ఇలా ప్రతీ వాళ్లు అయినకాడికి దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. దేవుడు సమక్షంలో వాళ్లు ఎదురుతిరగరు. టైమ్ వేస్ట్ చేసుకోరు అని నమ్మకం. ఏదైనా అంటే ఇక్కడ ఇంతే అని బుకాయించవచ్చు అనే ధైర్యం. అయితే అందరూ అలా లొంగిపోరు.
‘దేవుడి దగ్గరికి వచ్చాం.. ఈ గొడవ ఎందుకు?’ అని వదిలేయరు. ఒక్కోసారి ఓ భక్తుడు ఎదురు తిరుగుతాడు..ప్రశ్నిస్తాడు. సమాధానం చెప్పకపోతే అక్కడితో ఆగడు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు. అక్కడా స్పందన లేకపోతే.. అవసరమైతే కోర్టు గడప కూడా తొక్కుతాడు. అలాంటి ఓ ఘటన అన్నవరంలో జరిగింది.
ఓ వాటర్ బాటిల్‌పై ఉన్న ధర కంటే రూ.7 అదనంగా వసూలు చేయడం అక్కడ షాపువాడికి చిన్న వ్యవహారంలా కనిపించింది. కానీ ఆ ఏడు రూపాయల కోసం ప్రశ్నించిన వినియోగదారుడు అక్కడితో ఆగలేదు. చివరకు ఈ వ్యవహారం వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. ఫలితం? రూ.7కు కక్కుర్తి పడిన దుకాణదారుడికి రూ.7 లక్షల ఫైన్.
బాటిల్‌పై రూ.18.. వసూలు మాత్రం రూ.25
పిఠాపురానికి చెందిన డి. వెంకటేశ్వరరావు ఫిబ్రవరి 22న అన్నవరం దేవస్థానానికి వెళ్లారు. అక్కడ సత్యగిరిలోని సత్యదేవ్ ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణంలో ఓ వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. బాటిల్‌పై ముద్రించిన గరిష్ట చిల్లర ధర రూ.18. కానీ దుకాణదారు మాత్రం ఆయన నుంచి రూ.25 తీసుకున్నాడు. అంటే.. బాటిల్ ధరపై అదనంగా రూ.7.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చేసి సైలెంట్ గా వచ్చేస్తారు. బాటిల్ తీసుకుంటారు. ముందుకు వెళ్లిపోతారు. ఆ విషయమే మర్చిపోతారు. తమ వాళ్లు ఏంటిది అని అడిగినా ‘ఏడు రూపాయలే కదా!’ అని లైట్ తీసుకుంటారు. కానీ వెంకటేశ్వరరావు మాత్రం అలా అనుకోలేదు.
ఎంఆర్పీ కంటే ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని దుకాణదారుడిని ప్రశ్నించారు. తనకు సరైన సమాధానం రాలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్కడితో వదల్లేదు దుకాణదారుడి సమాధానంతో సంతృప్తి చెందని ఆయన విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాట్సాప్ ద్వారా ధరల వ్యవహారాన్ని తెలియజేశారు.
కానీ అక్కడి నుంచి తగిన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.ఇక్కడే చాలా మంది ఆగిపోయేవారు. ‘సరే.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మనకెందుకు?’ అని వదిలేసేవారు. కానీ ఆయన ఆగలేదు. ఏడు రూపాయల వ్యవహారాన్ని అధికారికంగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.
కమిషన్ ఏం తేల్చింది?
కేసును, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన కమిషన్.. బాటిల్‌పై ముద్రించిన రూ.18 కంటే ఎక్కువగా రూ.25 వసూలు చేసినట్లు నిర్ధారించింది.
అంటే.. అదనంగా తీసుకున్న రూ.7 నిజమే.
ఇది కేవలం ఏడు రూపాయల విషయం కాదని కమిషన్ భావించింది. వినియోగదారుడి నుంచి ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దీంతో దుకాణదారుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టును ఆశ్రయించడానికి అయిన ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని పేర్కొంది.అక్కడితో అవ్వలేదు.
రూ.7కు రూ.7 లక్షలు!
ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా ఉండటానికి, ఇతర వ్యాపారులకు కూడా ఇది ఒక హెచ్చరికగా నిలిచేలా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు జమ చేయాలని కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలా ఏడు రూపాయల కక్కుర్తి.. ఏడు లక్షల మూల్యంగా మారింది.
‘చిన్న మొత్తమే కదా’ అనుకునేవాళ్లకు పాఠం
ఈ కేసులో చెప్పుకోదగ్గ విషయం జరిమానా మొత్తం మాత్రమే కాదు. మన సమాజంలో చిన్న మొత్తాల్లో జరిగే మోసాలను పెద్దగా పట్టించుకోని ఓ అలవాటు ఉంది. ఐదు రూపాయలు ఎక్కువ తీసుకున్నా పట్టించుకోం. పది రూపాయలు అదనంగా తీసుకున్నా వదిలేస్తాం. బిల్లులో తప్పు కనిపించినా ‘సరే’ అంటాం. ఎంఆర్పీ కంటే ఎక్కువ తీసుకున్నా ‘ఇక్కడ ఇంతే’ అని అనుకుని వెళ్లిపోతాం. ఒక్కొక్కరి నుంచి చూస్తే అది చిన్న మొత్తం. కానీ అదే పని రోజూ వందల మందితో జరిగితే? చిన్న చిన్న కక్కుర్తులే పెద్ద వ్యాపారంగా మారతాయి. అందుకే ఈ కేసు ఇచ్చే సందేశం రూ.7 లక్షల జరిమానా కంటే పెద్దది.
భక్తుడైనా.. వినియోగదారుడే
దేవాలయానికి వెళ్లినప్పుడు మనం భక్తులం. కానీ షాపులో ఏదైనా కొనుగోలు చేసిన క్షణం నుంచి మనం వినియోగదారులం కూడా. ఆలయం దగ్గర కొనుగోలు చేస్తున్నామా.. పర్యాటక ప్రదేశంలోనా.. బస్టాండ్లోనా.. రైల్వే స్టేషన్‌లోనా అన్నది ముఖ్యం కాదు. వస్తువు పై ఒక ధర ముద్రించి ఉంటే, కౌంటర్ దగ్గర మరో ధర చెప్పడం ప్రశ్నించదగిన విషయమే. ‘ఇక్కడ ఇంతే’ అన్నది చట్టానికి సమాధానం కాదు. ‘అందరూ ఇలాగే తీసుకుంటున్నారు’ అన్నది కూడా సమర్థన కాదు. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించకపోయినంత మాత్రాన.. అది సరైనదని అర్థం కాదు.








