‘ఇస్రో’ లో ఏం జరుగుతోంది?… ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఇస్రో పేరు వినగానే మనకు ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది రాకెట్. శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ పైకి ఎగరటం.అలాగే చంద్రయాన్, మంగళయాన్, ఉపగ్రహాలు…ఇవన్నీ వరసగా గుర్తు వస్తాయి. ఇస్రో అంటే ఇదే మనకు తెలిసిన ప్రపంచం. కానీ ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. రేపటిరోజు ఇస్రోలో రాకెట్ అనేది ఉంటుందా?
ఈ ప్రశ్న వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించొచ్చు. కానీ ఇస్రోలోని తొమ్మిది ప్రధాన కేంద్రాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఇటీవల రాసిన లేఖ వెనుక ఉన్న అసలు ఆందోళన ఇదే. రాకెట్లు తయారు చేయడం, ఉపగ్రహాల నిర్మాణం వంటి ఇస్రో ప్రధాన కార్యకలాపాలు క్రమంగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయా? అలా అయితే ఇస్రో పాత్ర ఏమిటి? ఇంతకాలం రాకెట్‌ను కనిపెట్టి, తయారు చేసి, ప్రయోగించిన సంస్థ ఇకపై ఏం చేస్తుంది? అని అడుగుతున్నారు.
ఇది పైనుంచి చూస్తే కేవలం కొంతమంది ఉద్యోగుల ఉద్యోగ భద్రత సమస్యగా కనిపిస్తుందా. అయితే చాలా మందికి అర్దమవుతోంది. మనకు తెలిసిన ఇస్రో మారిపోబోతోందా? అని. రాకెట్ తయారీ ఇక ఇస్రో పని కాదా? అనే సందేహం.
ఈ కలకలానికి కారణమైన మాట చాలా సూటిగా ఉంది. భవిష్యత్తులో రాకెట్లను ఇస్రో స్వయంగా తయారు చేయదని, ఆ పని ప్రైవేట్ రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తాయని IN-SPACe ఛైర్మన్ పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్లో కలకలం రేపాయి.
ఒక్క వ్యాఖ్యకే పరిమితమైన భయం కాదు.
ఇప్పటికే SSLV సాంకేతికతను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. భారీ LVM3 రాకెట్ తయారీ సాంకేతికతను పరిశ్రమలకు అప్పగించే ప్రక్రియ కూడా చర్చలో ఉంది. ఉపగ్రహాల తయారీ నుంచి ప్రయోగ మౌలిక సదుపాయాల వరకు ప్రైవేట్ రంగం పాత్రను పెంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తే సాధారణ మార్పుల్లాగే కనిపించవచ్చు. కానీ వాటిని కలిపి చూస్తే ఉద్యోగులకు ఒక అనుమానం వచ్చింది. ఇస్రో తన పనిని ప్రైవేట్ కంపెనీలతో పంచుకుంటోందా? లేక తన చేతుల్లో ఉన్న పనిని క్రమంగా ప్రక్కన పెట్టేయబోతోందా?
ప్రైవేట్ కంపెనీలు రావడమే సమస్య కాదు
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇస్రో ఉద్యోగులు ప్రైవేట్ రంగాన్ని అంతరిక్షంలోకి రానివ్వొద్దని అడగడం లేదు. నిజానికి, భారతదేశానికి ఇప్పుడు ఉన్న అంతరిక్ష అవసరాలను ఇస్రో ఒక్కటే తీర్చడం సాధ్యం కాదన్న విషయం వారికీ తెలుసు.
దేశానికి మరిన్ని ఉపగ్రహాలు కావాలి. మరిన్ని ప్రయోగాలు కావాలి. అంతరిక్ష సేవలు వ్యవసాయం నుంచి రక్షణ వరకు విస్తరిస్తున్నాయి. ఇంత భారీ అవసరాన్ని తీర్చాలంటే ప్రైవేట్ కంపెనీలు రావాల్సిందే.
కానీ ఉద్యోగులు అడుగుతున్నది ఇంకో ప్రశ్న. ప్రైవేట్ రంగాన్ని పెంచడానికి ఇస్రోను కూడా పెంచుతారా? లేక ప్రైవేట్ రంగం పెరుగుతున్న కొద్దీ ఇస్రో పనిని తగ్గిస్తారా? అంటే రాకెట్ తయారీ బయటకు వెళ్తే… వెళ్లేది రాకెట్ పని ఒక్కటేనా? మిగతావి కూడానా
నాలెడ్జ్ పోతుందా
రాకెట్ తయారీ అంటే ఒక డిజైన్‌ను ప్రింట్ తీసి ఫ్యాక్టరీకి ఇచ్చేయడం కాదు. ఒక రాకెట్ తయారవుతున్నప్పుడు ఎన్నో సమస్యలు బయటపడతాయి. డిజైన్‌లో కనిపించని లోపాలు తయారీ సమయంలో బయటకు వస్తాయి. ఒక ఇంజిన్ ఎందుకు ఆశించినట్టుగా పనిచేయలేదో తెలుసుకోవాలంటే తయారీ ప్రక్రియలోని చిన్న చిన్న వివరాలు కూడా అర్థం కావాలి. అంటే రాకెట్ తయారు చేయడం ద్వారా కూడా విజ్ఞానం పుడుతుంది.
ఇక్కడే ఉద్యోగుల అసలు ఆందోళన మొదలవుతోంది. తయారీ మొత్తం బయటకు వెళ్లిపోయిన తర్వాత, ఆ తయారీతో వచ్చే అనుభవం కూడా క్రమంగా ఇస్రో నుంచి బయటకు వెళ్లిపోతుందా?
ఈ రోజు ఇస్రో ఒక కొత్త రాకెట్‌ను కనిపెట్టగలుగుతోంది అంటే దాని వెనుక కేవలం ప్రయోగశాలల్లో జరిగిన పరిశోధన మాత్రమే లేదు. దశాబ్దాలుగా రాకెట్లను స్వయంగా తయారు చేసి, ప్రయోగించి, విఫలమై, మళ్లీ సరిదిద్దుకుని వచ్చిన అనుభవం ఉంది. అది పోతే ఇంకేముంది అనేది వారి వాదన.
ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారా?
ఈ స్థాయిలో ఆందోళన పెరగడంతో ఇస్రో నుంచి కూడా స్పష్టీకరణ వచ్చింది. సంస్థను ప్రైవేటీకరించడం లేదని, ఇస్రో ప్రాధాన్యం తగ్గదని చెప్పింది. కొత్త సాంకేతికతల అభివృద్ధి, అత్యాధునిక పరిశోధన, వ్యూహాత్మక అంతరిక్ష కార్యక్రమాలు వంటి కీలక బాధ్యతలు ఇస్రో వద్దే ఉంటాయని స్పష్టం చేసింది.
అంటే ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇస్రో మాయమవ్వడం లేదు. దాని పాత్ర మారుతోంది. ఇప్పటివరకు ఇస్రో ఒక పని చేస్తే మొదటి నుంచి చివరి వరకు దాదాపు తన చేతుల్లోనే ఉండేది. ఇకపై పరిశోధన, కొత్త సాంకేతికత, అత్యంత క్లిష్టమైన మిషన్లు ఇస్రో చూసుకుంటే, భారీ స్థాయి తయారీ బాధ్యతను పరిశ్రమలు చేపట్టాలన్న ఆలోచన కనిపిస్తోంది.
వినడానికి ఇది ఒక మంచి మోడల్లాగే ఉంది. కానీ ఉద్యోగుల సందేహం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఇస్రో ఏ పని వరకు చేస్తుంది? ప్రైవేట్ కంపెనీ ఎక్కడి నుంచి బాధ్యత తీసుకుంటుంది? ఈ గీతను ఎవరు గీస్తారు?
ఇస్రోను ఎందుకు విస్తరించకూడదు?
ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ చెప్పిన మాట కూడా ఇక్కడ చాలా కీలకం. దేశానికి ఇప్పుడు వందల సంఖ్యలో ఉపగ్రహాలు అవసరమవుతున్నాయి. ఇస్రో ఒక్కటే ఈ అవసరాలను తీర్చడం సాధ్యం కాదు. అందుకే ప్రైవేట్ రంగం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవమే.
ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి
దేశ అవసరాలు పెరుగుతున్నప్పుడు ఇస్రో పని తగ్గడం లేదు కదా? మరి ఇస్రోలో కొత్త సిబ్బందిని పెంచకుండా, సంస్థ సామర్థ్యాన్ని విస్తరించకుండా, ప్రధాన తయారీ పనులను ఎందుకు బయటకు అప్పగిస్తున్నారు? అంటే అసలు చర్చ ప్రైవేటీకరణ చుట్టూ మాత్రమే తిరగడం లేదు. భారత్ స్పేస్ రంగాన్ని విస్తరించే సమయంలో ఎందుకు ఇస్రోను విస్తరించటం లేదు?
రేపటి ఇస్రోలో ఆ అవకాశాలు ఎలా ఉంటాయి?
ఒకప్పుడు భారతదేశంలో రాకెట్ తయారు చేయాలంటే ఇస్రోలో చేరాలి అనుకునేవారు. రేపు అదే పని చేయాలంటే ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాల్సి వస్తుందా? ఈ మార్పు ఉద్యోగులకే కాదు, భవిష్యత్ తరానికి చెందిన శాస్త్రవేత్తలకు కూడా సంబంధించింది. ఇక్కడే సమాధానం ఎవరూ చెప్పటం లేదు.
ఫైనల్ గా..
“రేపటి ఇస్రో ఎలా ఉంటుంది?” . ప్రైవేట్ కంపెనీలు రావచ్చు. రావాల్సిందే. అంతరిక్ష రంగం పెద్దదవ్వాలి. భారత్‌లో రాకెట్లు తయారు చేసే కంపెనీలు పెరగాలి. వేలాది ఉద్యోగాలు రావాలి. కానీ అదే సమయంలో ఇస్రో ఏం అవుతుంది? అది కొత్త రాకెట్లను కనిపెట్టే సంస్థగా మరింత శక్తివంతంగా మారుతుందా? లేక తయారీ బాధ్యతలను ఒక్కొక్కటిగా వదులుకుంటూ కేవలం పరిశోధనా సంస్థగా మిగిలిపోతుందా?








