ఫోటో ప్రూఫ్స్‌తో బీఆర్ఎస్ను కార్నర్ చేసిన కాంగ్రెస్!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతోంది. సమావేశాల ప్రారంభ వేళ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరకాటంలో పెట్టాలని భావించిన బీఆర్ఎస్, అనూహ్యంగా తానే తీవ్ర ఆత్మరక్షణలోకి జారుకుంది. ఆందోళనలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వేసిన ఎత్తుగడలు కాస్తా, అధికార పక్షం విడుదల చేసిన వీడియో ఆధారాలు, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల దుమారంతో బెడిసికొట్టాయి.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజే నల్ల టీషర్టులు ధరించి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన ర్యాలీతో సభలోకి ప్రవేశించాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. అయితే అసెంబ్లీ సమీపంలో పోలీసులు గులాబీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు తమ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేశారని, మహిళా సభ్యులతో దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మహిళా ఎమ్మెల్యేలు మీడియా ముందే కన్నీటిపర్యంతం కావడం, కొందరు నేతలకు గాయాలయ్యాయని ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందడంతో తొలిరోజు ప్రజల్లో కాస్త సానుభూతి వ్యక్తమైంది. పోలీసుల అత్యుత్సాహమే ఇందుకు కారణమంటూ ప్రభుత్వంపై నైతిక దాడిని ప్రారంభించింది.
బాధితుల కార్డుతో పైచేయి సాధించవచ్చని భావించిన గులాబీ దళానికి ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ ఊహించని షాక్ ఇచ్చింది. ఘటనా స్థలంలో రికార్డయిన వీడియోలు, ఫోటోలను ప్రభుత్వం ఆధారాలతో సహా మంగళవారం బహిర్గతం చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు దాడి చేయలేదని, గులాబీ ప్రజాప్రతినిధులే ఖాకీలపై భౌతిక దాడులకు దిగారని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల చొక్కాలు పట్టుకుని లాగడం, విధుల్లో ఉన్న మహిళా పోలీసులపైకి దూసుకువెళ్లడం కనిపించింది. వీటన్నింటికీ మించి స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ పోలీసు అధికారిని తోసేస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ కథనం ఒక్కసారిగా బలహీనపడింది. శాంతిభద్రతలను కాపాడే పోలీసులపైనే దాడి చేసి, ఎదురు బాధితులమని ప్రచారం చేసుకోవడం ఏమిటన్న ప్రశ్నలు ప్రజాక్షేత్రంలో మొదలయ్యాయి.


ఈ ఉద్రిక్తతలు ఒకవైపు కొనసాగుతుండగానే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో పెను దుమారానికి దారితీశాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడారంటూ కాంగ్రెస్‌తో పాటు సభలోని ఇతర విపక్షాలు కూడా తాతా మధు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని బీఆర్ఎస్ మినహా మిగిలిన అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నాయి. దీంతో దళిత నేత అయిన స్పీకర్‌ను అవమానించారనే అంశం మరింత రాజకీయ రంగు పులుముకుంది.
ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాల్సిన కీలక తరుణంలో.. పోలీసులపై దాడి దృశ్యాలు, స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం రెండూ కలిసి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటు పోలీసులపై దురుసు ప్రవర్తనను సమర్థించుకోలేక, అటు స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలను వెనకేసుకు రాలేక ఆ పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా సాక్ష్యాలతో ఎదురుదాడి చేయడంతో, ప్రతిపక్షం చేయాల్సిన ఎదురుదాడి కాస్తా సెల్ఫ్ గోల్‌గా మారింది. రాజకీయం ఎప్పుడూ రణరంగమే.. కానీ సొంత వ్యూహాలే తిరగబడినప్పుడు ఎదురయ్యే ఈ సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి కేటీఆర్ అండ్ టీమ్ ఎలా గట్టెక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








