మీ కళ్లద్దాలు మిమ్మల్నే చూస్తున్నాయా… మీపై నిఘా పెడుతున్నాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి నిశ్శబ్దంగా ఉంది.
రోజంతా బయట తిరిగి ఇంటికి వచ్చిన మీరు కళ్లద్దాలు తీసి టేబుల్‌పై పెట్టారు. కాసేపు ఫోన్ చూస్తూ కూర్చున్నారు. తర్వాత నీళ్లు తాగడానికి పక్క గదిలోకి వెళ్తారు. తిరిగి వచ్చి టేబుల్‌వైపు యథాలాపంగా చూసారు.
కళ్లద్దాలు అక్కడే ఉన్నాయి.
అలాగే నిశ్శబ్దంగా.
కానీ ఒక్క క్షణం అవి మిమ్మల్ని చూసినట్లు అనిపించింది. కళ్లు నులుపుకుని చూసారు. మామాలుగా ఉన్నాయి. ఆ ..ఏం లేదులే,మన భ్రమ అనుకున్నారు. కానీ భ్రమలు కూడా ఒక్కోసారి నిజాలు అవ్వచ్చు. ఆ కళ్ళద్దాలు మనపై ఓ కన్నేయచ్చేమో…కాదు ..కాదు కన్నేస్తున్నాయి. మనం కళ్లద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నాం.. ఇప్పుడు ఆ కళ్లద్దాలు కూడా మనల్ని చూస్తున్నాయి.
నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇలా అంటే ఎక్కువగా ఆలోచించకురా..అని నవ్వేసేవారు. కళ్లద్దాలు ఎలా చూస్తాయి అని కొట్టిపారేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. కళ్లకు పెట్టుకునే ఫ్రేమ్‌లో కెమెరా ఉంది. మైక్రోఫోన్ ఉంది. AI ఉంది. ఇంటర్నెట్తో సంబంధం ఉంది.
అంటే మనం కళ్లద్దాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్న రోజులు పోయి, మనతో పాటు ప్రపంచాన్ని చూసే కళ్లద్దాల కాలం వచ్చేసింది. అక్కడితో కథ అయిపోయి ఉంటే బాగుండేది. కానీ తాజాగా మెటా చేసిన ఒక పని ఈ కళ్లద్దాల గురించి ఇంకో విచిత్రమైన సందేహాన్ని మన ముందుకు తెచ్చింది.
కళ్లద్దాల వెనాల ఉన్న కెమెరా ఎవరి మాట వింటుంది?
ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నమెటా స్మార్ట్ గ్లాసెస్‌ను కొందరు కొనుగోలు చేశారు. సాధారణ కళ్లద్దాల్లాగే ముఖానికి పెట్టుకున్నారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. వీడియోలు తీశారు. అయితే కొందరు ఒక పని చేశారు. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వెలిగే చిన్న ఇండికేటర్ లైట్‌ను మార్చేశారు.
ఆ లైట్ ఎందుకు ఉంటుందంటే, ఎదుటివారికి తాము వీడియోలో రికార్డ్ అవుతున్నామన్న విషయం తెలియడానికి. కానీ అది కనిపించకుండా చేస్తే? అప్పుడు మీరు ఎదుటివారు మీతో మాట్లాడుతుంటారు. వాళ్లు మీ వైపు చూస్తుంటారు. మీరు వారిని సాధారణంగా చూస్తున్నారని అనుకుంటారు. కానీ మీ ముఖంపైన ఉన్న కళ్లద్దాలు వారిని రికార్డ్ చేస్తూ ఉండవచ్చు.
ఈ రికార్డింగ్ దుర్వినియోగంపై విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా మహిళలు, యువతులను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్న ఆందోళనలు మరింత పెరిగాయి. దీంతో మెటా ఒక నిర్ణయం తీసుకుంది. గ్లాసెస్‌ను వెనక్కి తెప్పించలేదు. వినియోగదారుల ఇంటికి వెళ్లి వాటిని వాపసు తీసుకోలేదు. కేవలం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసింది. అంతే. చాలా గ్లాసెస్‌లో కెమెరా పనిచేయడం ఆగిపోయింది.
ఆగండి… కళ్లద్దాలు వాళ్లవి కదా!
ఇదంతా విన్నప్పుడు చాలా మందికి మెటాపై కోపం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రహస్యంగా వీడియోలు తీసేవారిని అడ్డుకోవాల్సిందే. ఎదుటివారి అనుమతి లేకుండా, ముఖ్యంగా మహిళలను వేధించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉండాల్సిందే అన్నారు. మెటా చేసింది ఆ కోణంలో చూస్తే సరైనదే.
ఇక్కడే తెలివైన వాళ్లు ఓ ప్రశ్న అడుగుతున్నారు.
అసలు ఆ కళ్లద్దాలు ఎవరివి? వాటిని కొనడానికి డబ్బులు ఎవరు పెట్టారు? వాటిని ఎవరు ధరించారు? అన్నీ వినియోగదారుడివే.అలాంటప్పుడు వాటిలోని కెమెరా పనిచేయాలా వద్దా అన్న డెసిషన్ మాత్రం ఎక్కడో దూరంలో ఉన్న కంపెనీ తీసుకోకూడదు కదా. మన వస్తువు మన దగ్గరే ఉంటుంది. కానీ దానిలోని స్విచ్ మొత్తం కంపెనీ చేతిలో పెట్టుకోడదు కదా అని ప్రశ్నిస్తున్నారు. మనం వస్తువులు కొంటున్నామా… లేక వాటితో వచ్చే రూల్స్ ను కూడా కొంటున్నామా?
ఇన్నాళ్ళూ ఏదైనా వస్తువు కొంటే అది పూర్తిగా మనదే. దాన్ని తెరిచి రిపేర్ చేసుకోవచ్చు.
ఏళ్ల తరబడి వాడుకోవచ్చు. కంపెనీకి తర్వాత పెద్దగా సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న వస్తువులు అలా లేవు. స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్వేర్ ఉంది. కారులో సాఫ్ట్వేర్ ఉంది. ఇంట్లోని డోర్ లాక్కు సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు కళ్లద్దాల్లో కూడా ఉంది.
అంటే వస్తువు మీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా అది పూర్తిగా మీది కాదు. అప్డేట్లు వస్తాయి. కొత్త ఫీచర్లు వస్తాయి. కొన్ని ఫీచర్లు మాయమవుతాయి. కంపెనీ నిర్ణయాలు మారవచ్చు. అంటే “ఇది నాది” అనే మాటకు కొత్త అర్థం వస్తుంది.
ఫైనల్ గా..
మనం చూడటానికి పెట్టుకున్న ఆ కళ్లద్దాల వెనుక… ఇంకెవరి కళ్లు దాగి ఉన్నాయి? అనేది వెతుక్కోవాల్సిన డిజిటల్ కాలం ఇది.








