చిన్న పొరపాటు.. బీఆర్ఎస్ను డిఫెన్స్ లో పడేసిందా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదంతో ఆత్మరక్షణలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలపై నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో అసెంబ్లీకి భారీ ర్యాలీగా తరలివచ్చి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్ ఆశలపై ఆ పార్టీ నేతలే నీళ్లు చల్లుకున్నారు. గేటు వద్ద జరిగిన తోపులాటలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపి, గులాబీ దళానికి ఊహించని సెల్ఫ్ గోల్ గా మారాయి.
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అభ్యంతరకర పదజాలం వాడటం, మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రవర్తన, హరీశ్ రావు, కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై అధికార కాంగ్రెస్ వేగంగా దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన ఛాంబర్లో మంత్రులు, సీనియర్ సభ్యులతో అత్యవసర భేటీ నిర్వహించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘటన తాలూకు పూర్వాపరాలను వివరించగా, సంబంధిత వీడియో దృశ్యాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. సభా గౌరవాన్ని, ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా ఉన్న ఈ వ్యవహారాన్ని ఉపేక్షించకూడదని నిర్ణయించారు. ఈ వీడియోలను సీఎంవో వర్గాలు మీడియాకు విడుదల చేయడంతో రాజకీయం ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మొగ్గింది.
బీఆర్ఎస్ నిరసనలకు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్, ఈ ఒక్క వివాదంతో నేరుగా ఎదురుదాడికి దిగింది. సోమవారం రోజంతా ఈ వ్యవహారంపైనే సభ దృష్టి కేంద్రీకరించేలా వ్యూహం రచించింది. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడేంతవరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఆయన ఛాంబర్లో కలిసి సంఘీభావం తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి తాతా మధుపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. నిబంధనలు, చట్ట ప్రకారం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మండలి నుంచి బర్తరఫ్ చేయాలని లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు.
శాసనసభలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని తాతా మధుపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాతా మధు నుంచి వివరణ తీసుకున్న తర్వాత మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పక్కా ప్రణాళికతో వచ్చిన విపక్షం, నాయకుల నోటి దురుసు కారణంగా పూర్తి డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన మొదటి రోజే, స్పీకర్‌ను కించపరిచారనే బలమైన ఆరోపణలతో బీఆర్ఎస్ నైతికంగా ఇరుకునపడగా, అందివచ్చిన అవకాశాన్ని చకచకా అందిపుచ్చుకుని రాజకీయ ఆధిక్యాన్ని చాటుకోవడంలో రేవంత్ సర్కార్ విజయవంతమైంది.








