మనసు బరువుగా ఉందా? ఈ ఒక్క పని చేస్తే చాలు.. క్షణాల్లో మార్పు!
ఒక పాత సూఫీ కథ ఉంది.
ఒక గురువు, ఆయన శిష్యుడు కలిసి ప్రయాణిస్తున్నారు. దారిలో ఒక నది ఎదురైంది. నది దాటేందుకు ప్రయత్నిస్తున్న ఒక యువతి అక్కడ ఇబ్బంది పడుతోంది. గురువు ఏమీ ఆలోచించకుండా ఆమెను ఎత్తుకుని నది అవతలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను దించి, శిష్యుడితో కలిసి మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
కొంతదూరం వెళ్లిన తర్వాత శిష్యుడు ఇక ఆగలేకపోయాడు. “గురువుగారూ… మనం సన్యాసులం కదా ఒక స్త్రీని ఎలా ఎత్తుకున్నాం? ఆమెను ఎందుకు మోశారు?” అని అడిగాడు.
గురువు ప్రశాంతంగా అతని వైపు చూశాడు. “నేను ఆమెను నది దగ్గరే దించేశాను. నువ్వు మాత్రం ఇంకా ఆమెను మోస్తున్నావా?” అన్నారాయన. శిష్యుడు మౌనంగా ఉండిపోయాడు.
కథ అక్కడితో ముగుస్తుంది.
కానీ మన జీవితాల్లో మాత్రం ఇలాంటి కథలు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి.ఎవరో మనల్ని అవమానిస్తారు.ఎవరో కోపంలో ఒక మాట అంటారు. ఎవరో మనకు అన్యాయం చేస్తారు. ఎవరో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తారు. ఆ సంఘటన కొన్ని నిమిషాల్లో ముగిసిపోతుంది. అవతలి వ్యక్తి తన జీవితంలోకి వెళ్లిపోతాడు.
కానీ మనం మాత్రం ఆ సంఘటనను మనసులో పట్టుకుని తిరుగుతూనే ఉంటాం. రోజంతా ఏదో టైమ్ లో గుర్తు వస్తూనే ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు అదే మాట గుర్తొస్తుంది. మరుసటి రోజు మళ్లీ అదే సంఘటన గుర్తుకొస్తుంది. “అప్పుడు నేను అలా ఎందుకు చెప్పలేదు?”, “అతను నాతో అలా ఎలా మాట్లాడాడు?”, “మళ్లీ అతను ఎదురైతే ఏం చెప్పాలి?” ఇలా రిపీట్ గా ఆలోచిస్తూనే ఉంటాం.
ఇవి కూడా చదవండి
అతను మన జీవితంలో నుంచి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ మనసులో మాత్రం అతనితో మన conversation ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.
అయితే ఇక్కడ మనం ఓ విషయం సీరియస్ గా ఆలోచించాలి.
మనల్ని ఎక్కువగా బాధపెట్టింది ఆ సంఘటనా? లేక ఆ సంఘటన ముగిసిపోయిన తర్వాత కూడా దాన్ని మనసులో మోస్తూ ఉండటమా? ఈ ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన కోణాన్ని చూపించే self-inquiry practice ఉంది. దాని పేరు Sedona Method.
ఈ పద్ధతి చెప్పేది భావోద్వేగాలను వెంటనే అణచేయమని కాదు. వాటిని మర్చిపోమని కాదు. అవతలి వ్యక్తిని క్షమించేయమని కూడా కాదు. ముందుగా ఒక్కసారి ఆగి… “ఇప్పుడు నాకు ఏం అనిపిస్తోంది?” అని గమనించమంటుంది.
కోపంగా ఉందా? సరే.
బాధగా ఉందా? సరే.
భయంగా ఉందా? అదీ సరే.
ఆ భావనను వెంటనే తరిమేయకుండా… “ఈ భావనను కాసేపు ఇక్కడ ఉండనివ్వగలనా?” అని మనల్ని మనమే అడగాలి.
తర్వాత: “దీన్ని వదిలేయగలనా?”., మరింత లోతుగా: “నేను నిజంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానా?” అని మనమే అడగాలి. ఇక్కడే ఈ పద్ధతి ఇంట్రస్టింగ్ గా మారుతుంది.
ఎందుకంటే మనం సాధారణంగా సమస్యను భావోద్వేగంలోనే వెతుకుతాం. Sedona Method మాత్రం మరో ప్రశ్న వేస్తుంది: “భావోద్వేగం ఎంత బరువుగా ఉంది?” కాదు. “దాన్ని పట్టుకుని ఉండటానికి నువ్వు ఎంత శక్తి ఖర్చు చేస్తున్నావు?”
సూఫీ కథలో గురువు ఆ యువతిని నది దగ్గరే దించేశాడు. శిష్యుడు మాత్రం ఆమెను తన మనసులో ఇంకా మోస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుందేమో.
సంఘటనలు వస్తాయి.
మనల్ని తాకుతాయి. కొన్నిసార్లు గాయపరుస్తాయి. తర్వాత వెళ్లిపోతాయి. కానీ వాటి బరువును మాత్రం మనమే మోస్తూ ఉంటాం. మనసుకు విముక్తి అంటే ప్రతి బాధను మర్చిపోవడం కాదు. ఎప్పుడో ముగిసిపోయిన సంఘటనను ఈరోజు కూడా మోస్తున్నామా అని గుర్తించడం. అందుకే సంఘటన జరిగిన కాసేపటికి ఏదైనా పాత కోపం, బాధ లేదా అవమానం మళ్లీ గుర్తొస్తే…ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి:
“నేను దీన్ని ఇంకా ఎందుకు మోస్తున్నాను?”
బహుశా సమాధానం దొరికిన క్షణమే… ఆ బరువు చాలా భాగం తేలిక కావచ్చు
—శివ దువ్వూరు








