AIకి ఈగ పాఠం చెప్పింది? షాకింగ్‌గా ఉందా… కానీ నిజం!
ఆ మధ్యన రాజమౌళి దర్శకత్వంలో ఈగ అనే సినిమా వచ్చింది. ఆ ఈగ ను చూసి సినిమాల్లో కాబట్టి అలా చేసింది. నిజంగా ఈగకు అంత శక్తి ఉంటుందా..అయినా ఈగ లో నాని ఆత్మ ఉంది కాబట్టి అది గ్రేట్ , తన లవర్ ని రక్షించుకుంది విలన్ నుంచి అనుకున్నాం. కానీ సినిమాని ప్రక్కన పెడితే ఈగ మెదడు చాలా గొప్పదిట. ఎంతలా అంటే ఎంతో శక్తివంతమైనది ఈ జనరేషన్ చెప్తున్న AI కూడా దాన్ని దాటలేకపోతోంది. నమ్మబుద్ది కావటం లేదా?
సైంటిస్ట్ లు తేల్చింది ఏమిటి అంటే..ఈగ మెదడు చూడటానికి చిన్న గింజ కంటే చిన్నది. కానీ దాంట్లో ఉన్న న్యూరాన్లు? సుమారు 1.4 లక్షలు.అయినా AI తో ఈగ ను ఎందుకు పోల్చాల్సి వచ్చిందీ అంటే..AI కు ఓ సమస్య వచ్చి పడింది. దాంతో సమస్యకు పరిష్కారం ఆలోచిస్తూ ఈగ దగ్గరకి వచ్చి ఆగారు. ఇంతకీ AI కు వచ్చిన సమస్య ఏమిటి అంటే..అది కొత్తది నేర్చుకున్న తర్వాత… పాతది మర్చిపోతోంది.
AIకి ఒక విషయం నేర్పండి. అది చక్కగా నేర్చుకుంటోంది. మరో విషయం నేర్పండి. అదీ నేర్చుకుంటుంది. కానీ చాలా సార్లు AI కు వస్తున్న సమస్య ఏమిటంటే, రెండో పాఠం నేర్చుకునే క్రమంలో మొదటి పాఠం దెబ్బతింటుంది. దీన్ని శాస్త్రవేత్తలు Catastrophic Forgetting అంటారు.
ఈ పాయింట్ దగ్గరే చేతులెత్తేసిన శాస్త్రవేత్తలు తల గోక్కుంటూ చివరకు ఒక పండ్ల ఈగ వైపు చూశారు. “అసలు నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావ్?” అని. వినడానికి కామెడీగా ఉంది. కానీ పరిశోధన మాత్రం చాలా సీరియస్ గా చేసారు.
పండ్ల ఈగకు ఉన్న వాసన ని గుర్తు పెట్టుకునే శక్తి విపరీతం. ఏది తినాలి? ఏది ప్రమాదకరం? ఎక్కడికి వెళ్లాలి? ఇవన్నీ తెలుసుకోవడంలో వాటికి వాసనలు కీలకం. దానికి రకరకాల వాసనలు గుర్తుంచుకునే శక్తి ఉంది. అలాగని దాని దగ్గర హార్డ్ డిస్క్ లేదు, క్లౌడ్ బ్యాకప్ లేదు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ లేదు. “Memory Upgrade” బటన్ లేదు. కానీ వాసనలను నేర్చుకుని గుర్తుంచుకోగలదు.
ఈ పాయింట్ దగ్గరే AI కాస్త ఇబ్బందిలో పడింది. దానికి ఒక గుర్తు ఉంటే , అంతకు ముందు నేర్చుకున్నది మర్చిపోతోంది. వెంటనే గుర్తు రావటం లేదు. ఎప్పటికప్పుడు డేటా ఇవ్వాల్సి వస్తోంది. దాంతో సైంటిస్ట్ లు …ఈగ మెదడు చేస్తున్న పని వెనుక ఉన్న ట్రిక్‌ను ఇప్పుడు AI కోసం కాపీ చేస్తున్నారు.
అసలు ఈగ మెదడులో జరిగేది ఏమిటి?
వాసన వచ్చిన ప్రతీసారీ ఈగ మెదడులో అనేక న్యూరాన్లు స్పందిస్తాయి. కానీ అన్నీ కలగాపులగం అయ్యిపోవు. ఈ న్యూరాన్స్ ని మనకు అర్దం అయ్యే భాషలో చెప్పాలంటే… ఒక పెద్ద కుటుంబం పెట్టుకున్న WhatsApp గ్రూప్లాంటింది. అక్కడ వందమంది సభ్యులు ఉంటారు. ఎవరైనా ఒక మెసేజ్ పెడితే… మొదట అందరూ స్పందిస్తారు. కానీ నలుగురు , ఐదుగురు మాత్రమే అసలు విషయంపై మాట్లాడుతారు. మిగిలినవాళ్లు నిశ్శబ్దం. ఈగ మెదడులో కూడా దాదాపు అదే జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
వాసనకు స్పందించిన ఈగ న్యూరాన్లలో కొన్ని మాత్రమే రెస్పాండ్ అవుతాయి. మిగతావి సైలెంట్ గా ఉంటాయి. దాంతో టక్కున అవి ఆ వాసనను గతంలో వచ్చిన వాసనతో పోల్చి చూసుకుని గుర్తు పడతాయి. శాస్త్రవేత్తలు దీనిని Sparse Coding అంటారు. అంటే ప్రతీసారి వాసన కోసం మొత్తం మెదడును పని పెట్టడం కాదు. అవసరమైన కొద్దిమంది న్యూరాన్లతో పని ముగించడం.
మన AI లో కూడా ఇలాగే జరిగితే ఎంత బాగుంటుంది! అదే ట్రిక్‌తో పుట్టింది Spi-Fly పరిశోధకులు ఈగ మెదడు పని చేసే విధానాన్ని అనుకరించి Spi-Fly అనే అల్గారిథమ్ రూపొందించారు.AI లోని సెన్సర్ అప్పటికే సేకరించిన డేటాను తీసుకుని… దానిని న్యూరాన్ స్పైక్స్లా మార్చి… ప్రతి విషయానికి ఒక ప్రత్యేకమైన స్పార్స్ కోడ్‌ను తయారు చేస్తుంది.
తర్వాత ఆ కోడ్‌కు సరైన లేబుల్‌ను పెడుతుంది.ఇది ఒక పెద్ద లైబ్రరీలో ప్రతి కొత్త పుస్తకం కోసం అన్ని పాత పుస్తకాలను మళ్లీ అమర్చకుండా… కొత్త పుస్తకానికి సరైన షెల్ఫ్ కేటాయించడం లాంటిది. దాంతో అలాంటి విషయమే మరోసారి వచ్చినప్పుడు వెంటనే గుర్తించి రెస్పాండ్ అవుతంది. అలా ఈగ నుంచి ప్రేరణ పొందిన AI విధానం పనిచేస్తోంది. అయితే ఇంకా పూర్తిగా ఇందులో సక్సెస్ కాలేదు.
ఏదైమైనా …
AIకి ఈగ పాఠం చెప్పింది. అయితే ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రకృతిని తరతరాలుగా మనిషి డీకోడ్ చేస్తూనే ఉన్నాడు. ప్రకృతిని మించి యంత్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎక్కడో చోట ఆగిపోతే మళ్లీ ప్రకృతివైపే చూస్తున్నాడు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








